Guvvala Balaraju Discharge: 'ప్రజల దీవెనలతోనే బతికి బయటపడ్డా' - బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భావోద్వేగం, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
Hyderabad News: ప్రజల దీవెనలతోనే బతికి బయటపడ్డానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భావోద్వేగానికి గురయ్యారు. శనివారం రాత్రి కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఘర్షణలో గాయపడ్డ ఆయన చికిత్స అనంతరం డిశ్చార్జయ్యారు.
Guvvala Balaraju: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో (Achampeta) శనివారం అర్ధరాత్రి కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఘర్షణలో గాయపడ్డ ఎమ్మెల్యే, అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు (Guvvala Balaraju) అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. శనివారం రాత్రి తన కారును అడ్డుకుని కొందరు తనపై దాడి చేశారని తెలిపారు. తన అనుచరులపై కూడా దాడి చేశారని, అచ్చంపేట ప్రజల దీవెనలతో బయటపడ్డానని చెప్పారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు సరికాదని అన్నారు. 'గతంలో నాపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ (Vamsi Krishna) దాడులు చేయించారు. శనివారం రాత్రి కూడా వంశీకృష్ణ స్వయంగా దాడులు చేయించారు. నా ప్రాణం ఉన్నంత వరకూ ప్రజల కోసమే పోరాడుతా.' అని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.
'రాయితో దాడి'
'కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ శనివారం రాత్రి తన అనుచరులతో వచ్చి నా కాన్వాయ్‌పై దాడి చేయించారు. ఆ సమయంలో నేను నా మిత్రుడి వాహనంలో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డా. నాతో పాటు ఉన్న కార్యకర్తలపైనా దాడికి తెగబడ్డారు. ఎన్నికల సమయంలో దాడులు తగవని కార్యకర్తలకు సర్దిచెప్పి తిరిగి వెళ్తున్న సమయంలో దారి కాచిన వంశీకృష్ణ స్వయంగా రాయితో నాపై దాడి చేశారు. వలస కూలీ బిడ్డనైన నన్ను 2 సార్లు అచ్చంపేట ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు సరికాదు. పగలు.. ప్రతీకారాలు నా సంస్కృతి కాదు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక అంతమొందించాలనే కుట్ర పన్నుతున్నారు.' అంటూ గువ్వల బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి జరిగే అవకాశముందని 10 రోజుల క్రితమే డీజీపీ, నాగర్ కర్నూల్ ఎస్పీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించానని తెలిపారు. ఎన్నికల బరిలో నిలిచే వరకూ యుద్ధరంగం వీడొద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్, హరీష్ రావు పరామర్శ
అంతకు ముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజును మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావొచ్చన్నారు. బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీని కోరుతున్నట్లు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు, దాడులకు తెగబడ్డా తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమని, దాడులు చేసే సంస్కృతికి ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని మంత్రి హరీష్ రావు అన్నారు. బాలరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందొద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఇదీ జరిగింది
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య శనివారం అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే బాలరాజు డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ శ్రేణులు ఆయన కారును అడ్డుకున్నాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో గొడవ పెద్దదై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గువ్వల బాలరాజుకు గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ స్వయంగా రాయి విసిరారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి.
Also Read: Minister KTR: అపోలో ఆస్పత్రిలో గువ్వల బాలరాజుకు చికిత్స, పరామర్శించిన కేటీఆర్