GT vs CSK, Qualifier 1: చెపాక్‌లో ధోనీ బ్రిగేడ్ - కుంగ్ ఫూ పాండ్యతో ఢీ! తొలి ఫైనలిస్ట్ ఎవరో?
GT vs CSK, Qualifier 1: ఐపీఎల్ నాకౌట్ దశకు చేరుకుంది. నేడు చెపాక్ వేదికగా క్వాలిఫయర్-1 జరుగుతోంది. డిఫెడింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి.
GT vs CSK, Qualifier 1:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నాకౌట్ దశకు చేరుకుంది. నేడు చెపాక్ వేదికగా క్వాలిఫయర్-1 జరుగుతోంది. డిఫెడింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. మరి ఎవరి బలం ఏంటి? తొలుత ఫైనల్ చేరేది ఎవరు?
సమవుజ్జీలే!
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్లో దాదాపుగా ఒకే తరహా వ్యూహాలు అమలు చేశాయి. కుంగ్ ఫూ పాండ్యా తాను ఎంతగానో ఇష్టపడే ఎంఎస్ ధోనీ నాయకత్వ శైలినే అనుసరించాడు. అతడిలాగే ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తున్నాడు. వీలైనంత వరకు జట్టును మార్చడం లేదు. అందుకే ఇది బిగ్ క్లాష్! గతేడాది కాన్ఫిడెన్స్ కోల్పోయిన విజయ్ శంకర్‌తో ఈసారి మెరుపులు మెరిపించాడు. పైగా టీమ్‌ఇండియాలో అతడికి శంకర్ కాంపిటీటర్! నూర్ అహ్మద్, జోష్ లిటిల్‌తో బౌలింగ్ చేయించిన తీరు బాగుంది. రిజర్వు బెంచీకి పరిమితమైన క్రికెటర్లో ఉత్సాహం నింపాడు. మరోవైపు చెన్నైలో.. అజింక్య రహానెతో ధోనీ అద్భుతాలు చేయించాడు. అతడిలో దూకుడును బయటకు తీసుకొచ్చాడు. ఫ్రాంచైజీలు పట్టించుకోని శివమ్ దూబేను సిక్స్ హిట్టర్‌గా మార్చాడు. మతీశ పతిరణను డెత్ ఓవర్లలో మలింగ వంటి ఆయుధంగా మలిచాడు. దేశ్‌పాండేను వికెట్ టేకర్‌గా తీర్చిదిద్దాడు. అందుకే ఈ రెండు జట్ల పోటీ 'క్లాష్ ఆఫ్ టైటాన్స్'గా మారింది.
ధోనీ సేనకే ఎడ్జ్!
క్వాలిఫయర్ 1లో ధోనీ సేనకే కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది! తమ హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో మ్యాచ్ జరుగుతుండటమే ఇందుకు కారణం. చిదంబరం స్టేడియంలో అణువణువూ అతడికి తెలుసు. ఇక్కడి కండీషన్స్‌ను అతడి కన్నా మెరుగ్గా ఎవ్వరూ ఉపయోగించుకోలేరు. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. అజింక్య రహానె డేంజరస్‌గా మారాడు. శివమ్ దూబె చాలా కాన్ఫిడెంట్‌గా పేసర్లు, స్పిన్నర్లను చితకబాదేస్తున్నాడు. అంబటితో పెద్దగా పన్లేదు! మిడిలార్డర్లో ధోనీ, జడ్డూ ఫిక్స్ అయ్యారు. ఒకవేళ పవర్ ప్లేలో 3 వికెట్లు పడితే ఎలా ఆడతారన్నది చూడాలి! బౌలింగ్ పరంగా ఇబ్బందుల్ని చెన్నై అధిగమించింది. తుషార్ దేశ్‌పాండే లయ అందుకున్నాడు. ధోనీ అతడితో మ్యాజిక్ చేయిస్తున్నాడు. జట్టులో స్పిన్నర్లకు తిరుగులేదు. ఆఖరి ఓవర్లలో మతీశ పతిరణను ఎదుర్కోవడం చాలా కష్టం.
డేంజరస్ జీటీ!
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్లో ఫైనల్ చేరిందంటే మాటలు కాదు! అన్ని రకాలుగా ఆ జట్టు అద్భుతంగా ఉంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులో పాతుకుపోయి సెంచరీలు కొట్టేస్తున్నాడు. వృద్ధిమాన్ సాహా ఎప్పట్లాగే దూకుడుగా ఆడుతున్నాడు. అసలు నమ్మడమే మానేసిన విజయ్ శంకర్.. 'వీర శంకర్'గా అవతరించాడు. జట్టుకు స్థిరత్వం తీసుకొస్తున్నాడు. డేవిడ్ మిల్లర్ ఎంత డేంజరో తెలిసిందే. రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్సింగులు ఆడుతున్నారు. పాండ్య ఆల్మోస్ట్ ట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తున్నాడు. జీటీ బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయొద్దు. మహ్మద్ షమి చాలా ప్రమాదకరం. మోహిత్ శర్మ డెత్ ఓవర్లలో బాగా వేస్తున్నాడు. యశ్ దయాల్ వంటి కుర్రాళ్లూ ఉన్నారు. రషీద్, నూర్ అహ్మద్ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు. పాండ్య బౌలింగ్ చేయడం ముఖ్యం.
The race for the 🔝 Four Teams begins today in Chennai 🏟️
— IndianPremierLeague (@IPL) May 23, 2023
An opportunity to directly make it to the #TATAIPL 2023 #Final 💪🏻@gujarat_titans & @ChennaiIPL are all in readiness for the challenge! Who makes it through 🤔#Qualifier1 | #GTvCSK pic.twitter.com/ykFIVAUi8b
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.
గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.