GT Vs CSK, Match Highlights: మిల్లర్, రషీద్, ఓ నోబాల్ - చెన్నైపై గుజరాత్ థ్రిల్లింగ్ విన్!
IPL 2022, GT Vs CSK: ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చెన్నైపై విజయం సాధించింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మరో గెలుపు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ మిల్లర్ (94 నాటౌట్: 51 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) గుజరాత్‌ను దగ్గరుండి గెలిపించాడు.
ఫాంలోకి వచ్చిన గైక్వాడ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఫాంలో ఉన్న ఓపెనర్ రాబిన్ ఊతప్ప (3: 10 బంతుల్లో), మొయిన్ అలీ (1: 3 బంతుల్లో) పవర్‌ప్లేలోనే ఇంటి బాట పట్టారు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (73: 48 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు), అంబటి రాయుడు (46: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. అయితే మరింత వేగంగా ఆడే క్రమంలో వీరిద్దరూ అవుట్ అవ్వడంతో స్కోరు వేగం తగ్గింది.
కానీ చివర్లో శివం దూబే (19: 17 బంతుల్లో, రెండు ఫోర్లు), రవీంద్ర జడేజా (22 నాటౌట్: 12 బంతుల్లో, రెండు సిక్సర్లు) వేగంగా ఆడటంతో చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీయగా... షమి, యష్ డాయల్‌లకు చెరో వికెట్ దక్కింది.
మిల్లర్, రషీద్ షో...
ఇక గుజరాత్‌కు చెన్నై కంటే చెత్త ఆరంభం లభించింది. ఓపెనర్లు వృద్ధి మాన్ సాహా (11: 18 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (0: 1 బంతి), ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ (0: 2 బంతుల్లో), అభినవ్ మనోహర్ (12: 12 బంతుల్లో, రెండు ఫోర్లు), రాహుల్ తెవాటియా (6: 14 బంతుల్లో) ఘోరంగా విఫలం కావడంతో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అప్పటికే ఒక ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న డేవిడ్ మిల్లర్‌కు రషీద్ ఖాన్ జతకలిశాడు.
అయితే మొదట్లో రషీద్ ఖాన్ (40: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) క్రీజులో నిలదొక్కుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ రన్‌రేట్ విపరీతంగా పెరిగిపోవడంతో తను కూడా వేగంగా ఆడక తప్పలేదు. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో క్రిస్ జోర్డాన్ వేసిన ఒకే ఓవర్లో రషీద్ ఖాన్ 25 పరుగులు రాబట్టాడు. మ్యాచ్‌కు కీలక మలుపు ఇదే. తర్వాత 19వ ఓవర్‌ను బ్రేవో పొదుపుగా వేయడంతో పాటు రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్‌ల (0: 1 బంతి) వికెట్లు దక్కించుకున్నాడు.
చివరి ఓవర్లో జోర్డాన్... మిల్లర్‌ను అవుట్ చేసినా అది నోబాల్ కావడంతో మిల్లర్ బతికిపోయాడు. వెంటనే బౌండరీ, రెండు పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో మూడు వికెట్లు తీయగా... మహీష్ ధీక్షణకు రెండు వికెట్లు దక్కాయి. ముకేష్ చౌదరి, రవీంద్ర జడేజాకు చెరో వికెట్ దక్కింది.