Odi Biyyam Significance In Telugu: ఒడిబియ్యం వేడుక మాత్రమే కాదు ప్రతి గింజలోనూ పుట్టింటి భరోసా!
ఒడిబియ్యం: ఒడిబియ్యం…తెలంగాణ ఆడపడుచుకు పుట్టింటి నుంచి లభించే అపురూపమైన గౌరవం, కానుక. ఇంతకీ ఒడిబియ్యం అంటే ఏంటి, ఎందుకు పోస్తారు..ఆంతర్యం ఏంటి
Odi Biyyam Significance In Telugu: పసుపు బట్టలతో పెళ్లికూతురిగా అత్తవారింటికి పంపించిన బిడ్డకు అప్పటి నుంచి ముత్తైదువుగా ఉన్నంతకాలం పుట్టింటి నుంచి అందే అత్యంత అపురూపమైన కానుక ఒడిబియ్యం. ఇది కేవలం వేడుక అనుకుంటే పొరపాటే..పుట్టింటి నుంచి అందే భరోసా, నేనున్నాను బిడ్డా అని తండ్రి, నేనున్నామమ్మా అని అమ్మ, బంగారుతల్లల్లే కలకాలం ఉండమ్మా అని దీవించే అన్నయ్య ఇచ్చే విలువ కట్టలేని కానుక. కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, శనగపప్పు, కుడుకలు, పచ్చముగ్గు సారెగా ఇవ్వడం పెళ్లితో మొదలై..అలా కొనసాగుతుంది. మొదటిసారిగా పెళ్లి పందిట్లో నిండు బియ్యం అని పోస్తారు. ఆ తర్వాత కూతురు గృహప్రవేశం చేసినప్పుడు, బిడ్డను కన్న తర్వాత బారసాల నాడు ఒడిబియ్యం మళ్లీ పోస్తారు. ఆ తర్వాతి నుంచి ఐదేళ్లకోసారి ఒడిబియ్యం పోస్తుంటారు. దీనికి ఖర్చు ఎంత అన్నది కాదు..పుట్టింటి నుంచి వచ్చే సౌభాగ్యం. ఆ ఒడి బియ్యాన్ని తీసుకొచ్చి.. ఇరుగు పొరుగువారిని సంబరంగా పిలిచి..నా పుట్టింటి వాళ్లు ఒడిబియ్యం పోశారంటూ అందరికీ చెప్పుకోవడంలో ఆ స్త్రీ పొందే ఆనందం అవధుల్లేనిది. ఆ ఒడి బియ్యాన్ని వండి..పదిమందినీ పిలిచి..భోజనం పెట్టి పుట్టింటి వారిచ్చిన ఐశ్వర్యాన్ని పదిమందికీ పంచి మురిసిపోతారు. పుట్టింటి వారు లేని ఆడపిల్లలకు అత్తింటివారు కూడా ఈ వేడుక జరపొచ్చు.
Also Read: భయం తొలగి మీలో పాజిటివ్ ఎనర్జీని నిండాలంటే 41 రోజులు ఇది పారాయణం చేయాలి!
ఒడిబియ్యం పోయడం వెనుక ఆంతర్యం ఇదే
ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గరా ఒక చక్రం వుంటుంది. ఇలాంటి చక్రాలు శరీరంలో 7 ఉంటాయి. అవే మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం , విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రారం....వీటిలో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో "ఒడ్డియాన పీఠం" ఉంటుంది. అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" అంటారు..వాడుకలో అది వడ్డాణం అయింది. ఏడు చక్రాలలో శక్తి (గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందని చెబుతారు. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం. ఒడ్డియాణపీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. అంటే అమ్మాయిని మహాలక్ష్మి రూపంలో పూజించడం. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి.
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం
ఒడి అంటే రక్షణ
అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటే రక్షణ. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే అర్థమవుతుంది.. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు, సోదరులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని చేసే సంకల్ప పూజ . సంతోషంతో ఆ మహాలక్ష్మి(ఆడపడుచు) తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం పుట్టింటికి ఇచ్చి..దేవుడిని ప్రార్థించి, ద్వారానికి పసుపురాసి బొట్టు పెట్టి దీవించి అత్తింటికి వెళుతుంది. అక్కడ చుట్టుపక్కలవారిని పేరంటానికి పిలిచి పుట్టింటి సారెను అందరికీ పంచుతుంది. ఒడిబియ్యం పోయడం అంటే ఓ క్రతువు మాత్రమే కాదు.. మహాలక్ష్మీ సమానురాలైన ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం...