MLC Duvvada Srinivas: వైసీసీ ఎమ్మెల్సీ దువ్వాడపై వరుస కేసులు.. మంత్రి మనోహర్ వ్యాఖ్యల వెనుక మర్మమిదేనా?
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై పలు చోట్ల వరుస కేసులు నమోదవుతున్నాయి.. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై దువ్వాడ పై ఫిర్యాదులు చేస్తున్నారు జనసేన వీరమహిళలు

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయి ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను టార్గెట్ చేసి నోరు పారేసుకున్న వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్‌లు చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించారని.. కులాల మధ్య చిచ్చురేపేలా కామెంట్లపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులకు సంబందించి ఇప్పటికే దర్శక నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన ప్లీనరీ సన్నద్ధత సమావేశానికి హాజరైన రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలతో ఈ జాబితాలో ఇంకెంత మంది ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్‌కల్యాణ్‌ను దారుణంగా దూషించిన ఓ వ్యక్తి జైలుపాలయ్యారు. ఏం జరుగుతుందో కనిపిస్తుంది. ఎమ్మెల్సీ అయ్యుండి కూడా దారుణంగా మాట్లాడిన దువ్వాడ పరిస్థితి ఏమవుతుందో... అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి..
మరుసటిరోజే అమలాపురంలో దువ్వాడపై కేసు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దారుణమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ దూషించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై అమలాపురంలో జనసేన పార్టీకు చెందిన మున్సిపల్ కార్పోరేటర్ గండి హారిక అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అభిమాన నేతను దారుణమైన పదజాలంతో దూషించి తమను మానసికంగా మనోవేదనకు గురిచేశారని, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. దీనికి సంబందించి అమలాపురం పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అమలాపురం నియోజకవర్గ పరిధిలోనే ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్‌లో కూడా దువ్వాడ శ్రీనివాస్‌పై మరో కేసు నమోదైంది. ప్రస్తుతం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై రెండు కేసులు నమోదు అవ్వగా మరెన్ని కేసులు నమోదవుతాయో అన్న చర్చ సాగుతోంది..
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను తిట్టిన వారే టార్గెట్...
ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఎవరైతే తిట్టారో వారిని కూటమి టార్గెట్ చేస్తోందా... అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది.. పోసాని కృష్ణమురళి గతంలో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి మాట్లాడారని, ఆయన ఫ్యామిలీ విషయంలోనూ కూడా దారుణంగా మాట్లాడారని ఇప్పుడు అనుభవిస్తున్నారని జనసైనికులు, వీర మహిళలు చెబుతున్నారు.. అయితే ఇటీవల జనసేన మంత్రి మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఆధారంగానే ఫిర్యాదులు చేస్తున్నారా.. లేక పార్టీ అధిష్టానం నుంచి ఫిర్యాదులు చేయాలని మౌఖిక ఆదేశాలు అందాయా అన్నవిషయంపై కూడా చర్చ సాగుతోంది.. ఇప్పటికే పోసాని కృష్ణమురళి పై నమోదైన కేసులకు సంబందించి ముఖ్యంగా పవన్ కల్యాణ్ కుటుంబాన్ని ధూషించారన్నదే ప్రధాన్య అంశంగా పరిగణనలోకి తీసుకుని చార్జిషీటు దాఖలు చేయగా ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలోనూ ఇదే జరుగుతోందని, త్వరలోనే దువ్వాడ కూడా అరెస్ట్ తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం





















