Singer Kalpana: సింగర్ కల్పన తాజా హెల్త్ బులెటిన్ - డాక్టర్లు ఏం చెప్పారంటే.?
Singer Kalpana Health Update: సింగర్ కల్పన కోలుకుంటున్నారని.. మరో 2, 3 రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడించారు.

Singer Kalpana Health Update: టాబ్లెట్స్ అధిక మోతాదులో తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన సింగర్ కల్పన (Singer Kalpana) తాజా హెల్త్ బులెటిన్‌ను హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు రిలీజ్ చేశారు. ఆమె త్వరితగతిన కోలుకుంటున్నారని.. మరో 2, 3 రోజుల్లో డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడించారు. 'సింగర్ కల్పనను సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు వెంటనే చికిత్స అందించడంతో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, ఊపిరితిత్తుల్లో కాస్త ఇన్ఫెక్షన్ ఉంది. దీనికి సంబంధించి చికిత్స అందిస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్లు తొలగించాం. శ్వాస తీసుకోగలుగుతున్నారు. భోజనం కూడా తీసుకుంటున్నారు. మరో 2 లేదా 3 రోజుల్లో కల్పనను డిశ్చార్జ్ చేస్తాం.' అని వైద్యులు తెలిపారు.
ఆస్పత్రి నుంచే కల్పన వీడియో విడుదల
హైదరాబాద్ (Hyderabad) కేపీహెచ్‌బీలోని విల్లాలో మంగళవారం అపస్మారక స్థితిలోకి వెళ్లిన కల్పనను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు యత్నించారంటూ అటు సోషల్ మీడియా ఇటు న్యూస్ ఛానళ్లలో పలు కథనాలు హల్చల్ చేశాయి. దీనిపై ఆమె కుమార్తె దయ స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చారు. తన తల్లిది ఆత్మహత్య కాదని.. టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు స్పష్టం చేశారు. తమ కుటుంబమంతా సంతోషంగా ఉందని.. తప్పుడు ప్రచారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సింగర్ కల్పన సైతం స్వయంగా స్పందించారు. ఆస్పత్రి నుంచే ఓ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: రాజమౌళి సినిమాలో 'రుద్ర'గా మహేష్ బాబు - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
'మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు'
తన భర్తపై, కుటుంబంపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. దాన్ని వెంటనే ఆపేయాలని కల్పన (Singer Kalpana) వీడియోలో విజ్ఞప్తి చేశారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లు చెప్పారు. 'మీడియాలో నా గురించి, నా భర్త గురించి, మా కుటుంబంపై ఓ తప్పుడు ప్రచారం నడుస్తోంది. దీనిపై అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నేను, నా భర్త, కుమార్తె సంతోషంగా జీవిస్తున్నాం. నేను 45 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ, ఎల్ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మేము, మా కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం.
వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. దీని కోసం చికిత్స తీసుకుంటున్నా. డాక్టర్స్ సూచించిన ప్రిస్క్రిప్షన్‌లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాను. నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీ వాసులు, పోలీసుల సహాయం వల్ల ఈ రోజు నేను మీ ముందు ఉన్నాను. త్వరలోనే నా పాటలతో మళ్లీ మిమ్మల్ని అలరిస్తాను. నా భర్త సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నా. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా హెల్త్ గురించి ఎంక్వైరీ చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.' అంటూ కల్పన వీడియో రిలీజ్ చేశారు.





















