NASAs James Webb Telescope: నాసా జేమ్స్ వెబ్ మరో అద్భుతం - సౌర కుటుంబానికి బయట తొలిసారిగా ఆ వాయువు గుర్తింపు !
James Webb Telescope Detects Co2: నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన పనిని ప్రారంభించినప్పటి నుంచి మానవ చరిత్రకు సాధ్యం కాని ఆవిష్కరణలు చేస్తూనే ఉంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరో అద్భుతం చేసింది.
నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరో అద్భుతం చేసింది. మన సౌర కుటుంబానికి బయట ఉన్న ఓ గ్రహంపైన పరిశోధనలు చేస్తున్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇప్పుడు ఓ కీలక అంశాన్ని గుర్తించింది. నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన పనిని ప్రారంభించినప్పటి నుంచి మానవ చరిత్రకు సాధ్యం కాని ఆవిష్కరణలు చేస్తూనే ఉంది. తాజాగా సౌరకుటుంబానికి అవతలివైపు ఉన్న ఓ గ్రహం పై పరిశోధనలు చేస్తున్న జేమ్స్ వెబ్...కీలక ఆధారాలతో ఓ విన్నూత్న ఆవిష్కరణ చేసింది. సౌరకుటుంబానికి బయట మన సూర్యుడు లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ భారీ గ్రహంలో కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ను గుర్తించింది నాసా జేమ్స్ వెబ్.
శని లాంటి గ్రహం :
నాసా జేమ్స్ వెబ్ పరిశోధనలు చేస్తున్న ఈ సూర్య కుటుంబం బయటి గ్రహానికి శాస్త్రవేత్తలు WASP-39 b అని పేరు పెట్టారు. భూమి నుంచి 700 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు 2011 లో కనుగొన్నారు. సైజులో మన బృహస్పతి కంటే కొంచెం చిన్నగా..దాదాపు శని గ్రహం పరిమాణంలో ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో మండిపోతున్న ఈ గ్రహం ఉపరితలం మీద సుమారు 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. ఇంత వేడి ఉంటుంది కాబట్టే ఈ గ్రహంపైన వాతావరణం అంతా దట్టమైన వాయువులు, మేఘాలతో కప్పేసి ఉంటుంది. 2011 నుంచి WASP-39b పై హబుల్, స్పిట్జర్ స్పేస్ టెలిస్కోపులు పరిశోధనలు చేస్తున్నాయి. నీటి ఆవిరి, సోడియం, పొటాషియం లాంటి మూలకాలు ఈ గ్రహం పైన ఉండొచ్చని కనుగొన్నప్పటికీ దట్టమైన మేఘాల కారణంగా స్పష్టమైన ఆధారాలు ఇవ్వలేకపోయాయి. కానీ జేమ్స్ వెబ్ లో ఉన్న ఇన్ ఫ్రా రెడ్ డిటెక్టర్స్ కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ ఆనవాళ్లను పట్టేసింది మన స్పేస్ టెలిస్కోప్.
ఎలా కనుగొన్నారంటే..
WASP-39b నుంచి వస్తున్న కాంతి లో ఉన్న రంగుల్ని నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. వాస్తవానికి వేర్వేరు వాయువులు వేర్వేరు రంగులతో స్పైక్ట్రమ్ లను ఏర్పరుస్తాయి. కాకపోతే సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆ రంగుల్ని స్పష్టంగా గుర్తించటం కష్టం. గ్రహంపైన వాతావరణంలో ఉన్న దూళి మేఘాలను దాటుకుని ఒకవేళ రంగుల్ని స్పష్టంగా గుర్తించే టెక్నాలజీ ఉంటే అక్కడ ఏయే వాయువులు ఉన్నాయని స్పష్టంగా చెప్పేయొచ్చు. ఇప్పుడు నాసా జేమ్స్ వెబ్ చేసింది అదే. నాసాజేమ్స్ వెబ్ లోని నియర్ ఇన్ ఫ్రా రెడ్ స్పెక్ట్రోగ్రాఫ్ (NIRSpec) సహాయంతో టెలిస్కోప్ ఈ రంగుల్ని గుర్తించగలిగింది. గ్రహం నుంచి వస్తున్న కాంతి ఏర్పరుస్తున్న స్పెక్ట్రంలో 4.1-4.6 మైక్రాన్ల వద్ద తేడాలను స్పష్టంగా గుర్తించింది జేమ్స్ వెబ్. ఫలితంగా అక్కడ కార్బన్ డై ఆక్సైడ్ ఆనవాళ్లు ఉన్నాయని ఆధారాలతో సహా స్పష్టం చేయగలిగింది.
Catch your breath — Webb has captured the first clear evidence of carbon dioxide (CO2) in the atmosphere of a planet outside of our solar system! WASP-39 B is a gas giant closely orbiting a Sun-like star 700 light years away: https://t.co/FenLqV6HSo pic.twitter.com/abJvqxfLdG
— NASA Webb Telescope (@NASAWebb) August 25, 2022
ఉపయోగం ఏంటీ..?
ఓ గ్రహ వాతావరణంలో ఎలాంటి గ్యాసెస్ ఉన్నాయో తేలితే...ఆ గ్రహంపై ఎలాంటి పదార్థాలు ఆ గ్యాసెస్ కు కారణమవుతున్నాయో ఊహించవచ్చు. గ్రహ వాతావరణాన్ని అధ్యయనం చేయటం ద్వారా ఆ గ్రహాల పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి కార్బన్ డై ఆక్సైడ్ లాంటిది అక్కడ ఉంది అంటే ఆ పని ఇంకా తేలిక అవుతుంది. సాలిడ్- గ్యాస్ రేషియో కూడా తెలుస్తుంది కాబట్టి...అక్కడున్న పరిస్థితులు ఎలాంటివో అంచనా వేయటం కూడా సాధ్యమవుతుంది.
WASP-39b దాని నక్షత్రం చుట్టూ తిరగటానికి పడుతున్న సమయం భూమిపై నాలుగు రోజులతో సమానం. అంటే ఆ గ్రహం పై సంవత్సరం అంటే మన భూమిపై నాలుగు రోజులతో సమానం అన్నమాట. అంత వేగంగా తిరుగుతున్న గ్రహంపై ఉష్ణోగ్రత ఏంటీ..అది ఎలా ఏర్పడిందనే విషయాలను ఆధారాలతో సహా కనిపెట్టటం Exoplanets విషయంలో మన పరిశోధనలు మరింత వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతుంది. మన సౌరకుటుంబంలో లాంటి గ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా..అక్కడ ఆవాసయోగ్యమైన పరిస్థితులుండేందుకు ఆస్కారం ఉంటుందా లాంటి విషయాలు కూడా తెలుసుకునేందుకు జేమ్స్ వెబ్ పరిశోధనలు దోహదపడుతున్నాయి.