RBI MPC Key Polints: రెపో రేట్ నుంచి ద్రవ్యోల్బణం వరకు - ఆర్‌బీఐ గవర్నర్ ప్రసంగంలోని కీలకాంశాలు
RBI MPC Highlights: రెపో రేట్‌ను పావు శాతం తెగ్గోయడం ఒక శుభవార్త అయితే, స్నేహపూర్వక విధాన వైఖరికి మారడం రెండో శుభవార్త. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్నది అంచనా.

RBI MPC Meeting April 2025 Highlights: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నేతృత్వంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం, రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపును (25 bps Cut InRepo Rate) ప్రకటించింది. ఈ కోత తర్వాత, రెపో రేట్ 6.25 శాతం నుంచి 6.00 శాతానికి తగ్గింది. ఇది నేరుగా ప్రజలకు ప్రయోజనం కల్పించే శుభవార్త. దేశంలోని పరిశ్రమలకు కూడా ఊతమిచ్చేలా RBI మరో గుడ్ న్యూస్ చెప్పింది. తన విధాన వైఖరిని "తటస్థం" (NEUTRAL) నుంచి (ACCOMMODATIVE)కు మార్చుకుంది. ఫలితంగా, పరిశ్రమలకు, ముఖ్యంగా "సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు" (MSMEలు) స్నేహ హస్తం లభిస్తుంది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం సోమవారం నుంచి బుధవారం వరకు జరిగింది. ఇది, 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొదటి MPC భేటీ.
ఫిబ్రవరిలో జరిగిన చివరి MPC సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వృద్ధి అనుకూలమైన విధాన వైఖరికి పునాది వేసాయి. అప్పుడు కూడా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం నెమ్మదించడంతో, తిరిగి వేగం పెంచడానికి తన విధానాలను సర్దుబాటు చేస్తామని ఆర్‌బీఐ గవర్నర్ అప్పుడే ప్రకటించారు. ఆ వైఖరి కొనసాగుతుందని ఇప్పుడు కూడా వెల్లడించారు.
RBI MPC సమావేశం ముఖ్యాంశాలు:
- రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు
- విధాన వైఖరిని "తటస్థం" నుంచి "సౌకర్యవంతమైన స్థాయి"కి మార్పు
- మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటును 6.25 శాతానికి సర్దుబాటు
- ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల వల్ల పెట్టుబడులు, ప్రజలు చేసే ఖర్చుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల దేశ వృద్ధి రేటులో వేగం తగ్గవచ్చు.
- అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
- దేశీయ తయారీ రంగంలో తిరిగి పుంజుకుంటున్న సంకేతాలు కన్పిస్తున్నాయి.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ద్రవ్యోల్బణం తగ్గుతుంది, లక్ష్యిత స్థాయిలో ఉంటుంది.
- ఏప్రిల్ 4, 2025 నాటికి విదేశీ మారక నిల్వలు $676.3 బిలియన్ల వద్ద ఉన్నాయి, ఇది 11 నెలల దిగుమతులను కవర్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్, వ్యాపారం, రవాణా సేవల కారణంగా జనవరి-ఫిబ్రవరి నెలల్లో భారతదేశ సేవల ఎగుమతులు పుంజుకున్నాయి.
- నికర సేవలు, పేమెంట్ రిసిప్ట్స్ మిగులులో ఉంటాయి, వాణిజ్య లోటును పాక్షికంగా భర్తీ చేస్తాయి.
దేశ ఆర్థిక వృద్ధి అంచనా
ఆర్‌బీఐ అంచనా ప్రకారం, భారతదేశ జీడీపీ (GDP) 2025-26లో 6.5 శాతానికి పరిమితం కావచ్చు. RBI, ఫిబ్రవరిలో వేసిన అంచనా 6.7% కాగా, ప్రస్తుత ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఆ అంచనాను మరో 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జీడీపీ FY26 మొదటి త్రైమాసికంలో 6.5%, రెండో త్రైమాసికంలో 6.7%, మూడో త్రైమాసికంలో 6.6% & నాలుగో త్రైమాసికంలో 6.3%గా ఉండవచ్చని కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచ వాణిజ్య సమస్యల కారణంగా ఈ గణాంకాలు మారవచ్చని సంజయ్ మల్హోత్రా చెప్పారు.
ద్రవ్యోల్బణం అంచనా
ద్రవ్యోల్బణం గురించి మాట్లాడిన మల్హోత్రా, ఇటీవలి నెలల్లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (Retail inflation) తగ్గిందని వెల్లడించారు. 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆహార పదార్థాల ధరలు భారీగా తగ్గడం వల్ల ఓవరాల్‌గా రేట్లు స్థిరంగా ఉన్నాయన్నారు. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 4.2 శాతంగా ఉంది. పంటలు మెరుగ్గా పండడం, సరఫరా పెరగడం కారణంగా ఇది సాధ్యమైందని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. FY26లో ఇన్‌ఫ్లేషన్ సగటున 4 శాతంగా నమోదవుతుందని కేంద్ర బ్యాంక్ అంచనా వేసింది. 2025-26 నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం - Q1లో 3.6 శాతం, Q2లో 3.9 శాతం, Q3లో 3.8 శాతం & Q4లో 4.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

