BAPS Temple: అబుదాబిలో మోదీ ప్రారంభించబోయే హిందూ దేవాలయం ప్రత్యేకతలు ఏంటి ?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా...యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం జరిగింది.
Abudabi Hindu Temple : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా...యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం జరిగింది. 27 ఎకరాల్లో ఏడు గోపురాలతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)ఈ నెల 14 ప్రారంభించనున్నారు. అబుదాబిలో బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ (Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha ) సంస్థ...హిందూ దేవాలయాన్ని నిర్మించింది. అబుదాబిలోని హిందూ దేవాలయం అరబ్‌దేశాల్లో...అతిపెద్ద ఆలయంగా పేరు సంపాదించుకుంది. మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఏడు ఎమిరేట్లను సూచించేలా ఏడు శిఖరాలు
అబుదాబిలో 27 ఎకరాల్లో నిర్మించిన హిందూ దేవాలయంలో మొత్తం 7 శిఖరాలు...UAEలోని 7 ఏమిరేట్స్‌ని సూచిస్తాయి. అబుదాబి, యూఏఈ, దుబాయ్, షార్జా.. ఇలా మొత్తం ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఏడు గోపురాలను నిర్మించారు. ఆలయంలో 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని రూ. 700 కోట్లతో నిర్మించారు. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్యాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద 3డీ విధానంలో ఏక శిలపై అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు. ఆ అద్భుతాన్ని వీక్షిస్తే.. సాక్షాత్తూ అయోధ్య రాముణ్ని దర్శించుకున్న భావన కలగనుంది.
2018 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ
అబుదాబి, అజ్మాన్, దుబాయ్, ఫుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, ఉమ్ అల్ క్వన్లు అనే దేశాలు.. ఏడు ఎమిరేట్ల సమాఖ్య. ఇస్లాం మత రాచరికపు వ్యవస్థ. ప్రతి ఎమిరేట్‌కు ఒక పాలకుడు ఉంటాడు. ఏడుగురు ముక్తకంఠంతో ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. అబుదాబిలో హిందూ దేవాలయం నిర్మాణానికి అనుమతినిస్తూ...యూఏఈ ప్రభుత్వం 2015 ఆగస్టులో భూమిని కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా...ఆ దేశ అధ్యక్షుడు, రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 27 ఏకరాల భూమిని బహుమానంగా బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థకి ఇచ్చారు. 2018 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది.
వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా...
పింక్ సాండ్‌స్టోన్‌తో నిర్మితమవుతున్న ఈ ఆలయం...దాదాపు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు. సంప్రదాయ, ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా నిర్మాణం జరిగింది. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ప్రతీకగా ఆలయంలో ఏడు గోపురాలను నిర్మించారు. ఈ ఏడు గోపురాలే కాకుండా ఆలయం దాని వైభవాన్ని పెంచే ఐదు అలంకారమైన గోపురాలు కూడా ఉన్నాయి. ఆలయం శిఖరం ఎత్తు 108 అడుగులు ఉంటుంది.
20వేల టన్నుల పాలరాయి వినియోగం
పూర్తిగా రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న 20 వేల టన్నులకు పైగా పాలరాతితో...రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2 వేల మందికి పైగా శిల్పులు, కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ఎత్తు 108 అడుగులు కాగా.. 40 వేల క్యూబిక్ ఫీట్ల పాల రాయి.. 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా వాడారు. 6.90 లక్షల గంటలు పని చేసి ఆలయాన్ని నిర్మించారు. యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని నిర్మాణంలో ఉపయోగించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. నదీ జలాల ప్రవాహాన్ని మరిపించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు.