Traffic Jam In Space: ఇది విన్నారా! అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ఆలస్యమైన ఇస్రో రాకెట్ ప్రయోగం
Traffic Jam In Space: అంతరిక్షంలో ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ వల్ల ఇస్రో రాకెట్ ప్రయోగం ఆలస్యమైంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు.
Traffic Jam In Space: రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకపోతే వింత. రోడ్లన్నీ కిక్కిరిసిపోయి వాహనాలేవీ కదలకుండా గంటలపాటు వేచి ఉండాల్సి వస్తుంది. అయితే అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ అవుతుందని ఎప్పుడైనా విన్నారా. అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్ అవుతోందని.. దీని వల్ల ప్రయోగాలు వాయిదా వేయాల్సి వస్తోందని ఏకంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ చెబుతున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల గత నెలలో చేయాల్సిన పలు ప్రయోగాలు కాస్త ఆలస్యం అయినట్లు చెప్పారు. 2023 అంచనా ప్రకారం 27 వేల వస్తువులు అంతరిక్షంలో.. భూగురుత్వాకర్షణ పరిధిలో తిరుగుతున్నాయి. అందులో దాదాపు 80 శాతం వ్యర్థాలేనని ఇస్రో చెబుతోంది. 10 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న మిలియన్ల కొద్దీ అంతరిక్షణ వస్తువు అంతరిక్షంలో భూమి చుట్టూ తిరగాడుతూ ఉన్నాయి. వందలు, వేల కోట్లు పెట్టి చేపట్టే ప్రయోగాలు ఈ అతి చిన్న రోదసి వ్యర్థాల వల్ల ప్రమాదాలకు గురవుతున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు.
అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువగా అమెరికా, రష్యా, చైనా దేశాలు ప్రయోగాల ద్వారానే ఏర్పడ్డాయని ఇస్రో ఛైర్మన్ చెప్పుకొచ్చారు. ఈ అంతరిక్ష వ్యర్థాల వల్ల జులై 30వ తేదీన ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ ప్రయోగం కూడా ప్రభావితం అయినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ నిమిషం వాయిదా పడిందని వెల్లడించారు. జులై 30వ తేదీన ఉదయం 6.30 గంటలకు రాకెట్ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా.. అది కాస్త 6.31 గంటలకు ప్రయోగం మొదలైందన్నారు. ఈ ప్రయోగంలో శాటిలైట్ లు భూమికి 536 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించాల్సి ఉండగా.. పీఎస్ఎల్వీ నాలుగో దశను ఉద్దేశపూర్వకంగా 300 కిలోమీటర్ల కక్ష్యలోకి తగ్గించినట్లు చెప్పారు. స్వచ్ఛంద అంతరిక్ష వ్యర్థాలను తగ్గించే చర్యలల్లో భాగంగానే కక్ష్యను తగ్గించామన్నారు. కక్ష్యను 300 కిలోమీటర్లు తగ్గించడం వల్ల పీఎస్ఎల్వీ 4వ దశలో భూమికి తిరిగి ప్రవేశించి, 30 రోజుల్లో కాలిపోతుందని చెప్పారు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు కక్ష్యలో తిరుగుతుందన్నారు. అంతరిక్షంలో ఘన వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కోసం ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పనికిరాని మేఘట్రోపిక్స్ ఉపగ్రహాన్ని భారత్ కూడా సురక్షితంగా నిర్వీర్యం చేసిందని వివరించారు.
ఎక్కువగా అమెరికావే, ఇస్రోవి ఎంతంటే?
అధునాతన రాడార్, ఆప్టికల్ సాధనాలు, కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల సాయంతో.. 10 సెం.మీ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న వస్తువులు అంతరిక్షంలో 26,783 ఉన్నట్లు అమెరికా అంచనా వేసింది. అంతరిక్షంలో వ్యర్థాల్లో అమెరికా వాటా ఏకంగా 40 శాతం కాగా రష్యాకు చెందినవి 28 శాతం ఉంటాయి. చైనా వ్యర్థాలు 19 శాతం వరకు ఉంటాయని ఇస్రో చెబుతోంది. రోదసిలో భారత వ్యర్థాలు అతి తక్కువగా అంటే కేవలం 0.8 శాతం మాత్రమే ఉన్నాయని ఇస్రో వెల్లడిస్తోంది.
Also Read: Manipur Violence: మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి షాక్, సర్కారు నుంచి వైదొలిగిన కీలక పార్టీ
ప్రస్తుతం ఇస్రోకు చెందిన 52 ఉపగ్రహాలు భూకక్ష్యలో పరిభ్రమిస్తూ పని చేస్తున్నాయి. అలాగే 6 ఉపగ్రహాలు, 105 అంతరిక్ష వ్యర్థాలు (రాకెట్ బాడీలు, శకలాలు) ఇప్పటికీ కక్ష్యలో తిరుగుతున్నట్లు సోమనాథ్ తెలిపారు. మొత్తం మీద భారత్ 130 ఉగ్రహాలను ప్రయోగించగా.. 73 తక్కువ భూకక్ష్యలో, 54 జియోస్టేషనరీ ఆర్బిట్ లో తిరగాడుతున్నాయి. అంగారక కక్ష్యలో మంగళయాన్ ఒకటి ఉంది. చంద్రయాన్ సిరీస్ లో భాగంగా మూడు ఉగ్రహాలు చంద్రుని కక్ష్యలో ఉన్నాయి. అంతరిక్ష వ్యర్థాలు ఢీకొనడం వల్ల ప్రయోగాలు విఫలమైనట్లు ఇస్రో చరిత్రలో లేదు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల INSAT 2D, GSAT-6A ఉపగ్రహాలను మాత్రం ఇస్రో కోల్పోవాల్సి వచ్చింది.