Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
Earthquake prediction for Ramagundam: తెలంగాణలోని రామగుండం భూకంప ముప్పును ఎదుర్కొంటోంది. ఓ ప్రేవేట్ పరిశోధన సంస్థ.. త్వరలో అక్కడ భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది…

Earthquake prediction for Ramagundam: ఇదేమీ జనాలను భయపెట్టడానికి.. కంగారు పెట్టడానికి చెబుతున్న విషయం కాదు. చాలా రకాల పరిశీలనలు, అంచనాల తర్వాత తేల్చిన సంగతి ఏంటంటే.. కొద్దిరోజుల్లో తెలంగాణ ఓ భూకంపాన్ని ఎదుర్కోబోతోంది. భూకంప జోన్‌లో ఉన్న రామగుండంలో భూమి ప్రకంపనలు రావొచ్చని Epic ( Earthquake Research & Analysis ) సంస్థ అంచనా వేసింది. కొద్ది రోజుల్లో రామగుండం సమీపంలో 5 మాగ్నిట్యూడ్‌తో ఈ భూకంపం రావొచ్చని లెక్కలు వేసింది.
పొంచి ఉన్న ముప్పు… రామగుండానికి గండం
తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలో భూకంపాలకు అవకాశం ఉంటుందని ఎప్పటి నుంచో అధ్యయనాలున్నాయి. రాష్ట్రంలో భూకంప సంభావ్యత ఎక్కువుగా ఉన్న ప్రాంతం రామగుండం, గోదావరి ఖని ప్రాంతాలు. ఇప్పుడు అక్కడ త్వరలోనే ఓ మధ్యస్థాయి భూకంపం వస్తుందని Epic చెబుతోంది. ఈ సంస్థ కొంతమంది భూకంప అధ్యయన ఔత్సాహికులు నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి వాళ్లు భూకంపాలపై మందస్తు అంచనాలను ఇస్తుంటారు.
“As per our research & analysis #upcoming significant #earthquake possible near #Ramagundam #Telangana south #India #tremors may reach up to near #Hyderabad #Warangal #Amaravathi #AndhraPradesh #Maharashtra ~18.73°N 79.62°E ~10-17 April 2025 ~5 #Magnitude” అని ఆ సంస్థ ప్రకటించింది.
As per our research & analysis #upcoming significant #earthquake possible near #Ramagundam #Telangana south #India #tremors may reach up to near #Hyderabad #Warangal #Amaravathi #AndhraPradesh #Maharashtra
— Epic ( Earthquake Research & Analysis ) (@epic_earthquake) April 9, 2025
~18.73°N 79.62°E
~10-17 April 2025
~5 #Magnitude pic.twitter.com/COhmgcHcnq
వాళ్లిచ్చిన GPS కోఆర్డినేట్స్ ప్రకారం ఈ ప్రాంతం రామగుండం సమీపంలోని కాసిపేట వద్ద గోదావరి మధ్యలో ఉంది.
ఏమిటీ Epic, భూకంపాలను ఎలా అంచనా వేస్తోంది…?
ప్రపంచ వ్యాప్తంగా చాలా సంస్థలు తమకు అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో భూకంపాలను ముందే అంచనా వేస్తుంటాయి. మన దేశంలో NGRI, ఇతర సంస్థలు ఆ పనిచేస్తున్నాయి. Epic కూడా అలాంటిదే కానీ ఇది ప్రభుత్వ సంస్థనో, లేక ఓ భారీ పరిశోధనా సంస్థనో కాదు. GIS చదువుకున్న శివ సీతారామ్ అనే భూకంప అధ్యయన ఔత్సాహికుడు దీనిని ప్రారంభించారు. కొంతమంది వాలంటరీగా ఆయనకు సహకారం అందిస్తున్నారు. ఇప్పటి వరకూ చాలా భూకంపాల ప్రిడిక్షన్ ను ఈ వేదిక ద్వారా ప్రకటించారు. వాటిలో చాలా వాటిని కచ్చితమైన నిర్థారణ చేశారు. 2004 సునామీ చూసిన సీతారామ్‌కు భూకంపాలపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆయనే సొంతంగా పరిశోధనలు ప్రారంభించి ఓ అల్గారిథమ్ కనుక్కొన్నారు. దాని ప్రకారం అంచనాలు ఇస్తుంటారు. వాటిని www.seismo.in వైబ్‌సైట్‌లో ప్రచురిస్తున్నారు. వీటిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు Epic పేరుతో ట్విటర్ అకౌంట్‌ను ప్రారంభించారు. “ ఏప్రిల్ 10-17 వ తేదీల మధ్య రామగుండం సమీపంలో 5 మాగ్నిట్యూడ్‌తో భూకంపం రావడానికి అవకాశం ఉంది.” అని ఆయన ఏబీపీ దేశంతో చెప్పారు.
మయన్మార్ భూకంపాన్ని కచ్చితంగా చెప్పాం.
2021 నుంచి ఇప్పటి వరకూ 22 భూకంపాలను వీళ్లు కచ్చితంగా అంచనా వేయగలిగారు. మొన్న జరిగిన మయన్మార్ భూకంపాన్ని కూడా కచ్చితమైన అంచనాతో చెప్పారు. సాధారణంగా వీళ్ల ప్రిడిక్షన్స్ భూకంప భూకంప కేంద్రం అన్నది 300కిలోమీటర్లు, భూకంప తీవ్రత 1- 1.5 మాగ్నిట్యూడ్ తేడా ఉంటుంది. అలాగే భూకంప సమయం కూడా 2 -3 నెలల వరకూ తేడా ఉండొచ్చు. మయన్మార్ లో ఫిభ్రవరి 28న భూకంపం వస్తుందని అంచనా వేయగా.. మార్చి 28న వచ్చింది. 6.5 మాగ్నిట్యూట్ అని అంచనా ఇస్తే.. 7.7 తీవ్రతతో వచ్చింది.
భూకంపాల అంచనాల్లో మాకు 18 శాతం సక్సెస్ రేట్ ఉంది. ఇలాంటి పరిశోధనలు, విశ్లేషణల్లో ఇది కచ్చితంగా మెరుగైన ఫలితమే. మాకున్న వనరులు తక్కువ. మేం సొంతగా తయారు చేసుకున్న అల్గారిథమ్ వల్ల అంచనా వేయగలుగుతున్నాం. అంచనా కోసం చాలా పారామీటర్లు తీసుకుంటాం. సోలార్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నిటిక్ వేవ్స్, అట్మాస్ఫియర్ డేటా, వెదర్ మోడల్స్ ఇలా రకరకాల పారామీటర్స్ ద్వారా అంచనా వేస్తాం. అని సీతారామ్ చెప్పారు. “వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే రామగుండంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. మేం ఈ వారంలోనే రావొచ్చు అనుకుంటున్నాం. తీవ్రత విషయంలోనూ.. టైమ్ విషయంలోనూ కొంత తేడా ఉండొచ్చు”
ధర్మశాలలో భారీ భూకంప సూచన
కేవలం రామగుండం మాత్రమే కాదు.. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ధర్మశాలకు కూడా ముప్పు ఉందని వీరు సూచిస్తున్నారు. 120 ఏళ్ల క్రితం హిమాలయాల్లోని కాంగ్రా ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. మరికొద్ది రోజుల్లో అదే ప్రాంతంలోని ధర్మశాలలో 7 మాగ్నిట్యూడ్‌తో ఓ భారీ భూకంపం వచ్చే అవకాశం కూడా ఉందని సీతారామ్ చెబుతున్నారు. భూకంపాల గురించి జనాలను భయపెట్టాలన్నది తమ ఉద్దేశ్యం కాదని.. దీని ద్వారా ప్రజలు అప్రమత్తం కావొచ్చని సీతారామ్ చెప్పారు. ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో 4 మాగ్నిట్యూడ్ కంటే ఎక్కువుగా తీవ్రత నమోదయ్యే పక్షంలో ప్రజలను హెచ్చరించే వ్యవస్థలు అభివృద్ధి చేశారని అలాంటివి రావాలన్న ఉద్దేశ్యంతోనే ముందస్తు అంచనాలు ఇస్తున్నామన్నారు.
తెలంగాణలో భూకంపాలు
దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణలో భూ పలకల రాపిడి వలన, గోదావరి ఫాల్ట్ లైన్స్ వల్ల భూకంపాల తాకిడి ఎక్కువుగానే ఉంటుంది. చాలా తక్కువ తీవ్రత గల భూకంపాలు తరుచుగా వస్తూనే ఉంటాయి. అవి వచ్చినట్లు కూడా తెలియదు. తెలంగాణలో 50ఏళ్లలో అతిపెద్ద భూకంపం 4 డిసెంబర్ 2024న వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. వరంగల్ కు ఈశాన్యంగా 85కిలోమీటర్లు, హైదరాబాద్‌కు ఈశాన్యంగా 218 దూరంలో ములుగు సమీపంలోని భూకంప కేంద్రం ఉన్నట్లు National Center for Sesimology గుర్తించింది. తెలంగాణలో గడచిన 50ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం అని చెప్పుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి 300కిలోమీటర్ల పరిధి తీసుకుంటే గడచిన 10ఏళ్లలో 12 భూకంపాలు 4 అంతకంటే ఎక్కువ తీవ్రత ఉన్నవి నమోదయ్యాయి. గడచిన 50ఏళ్లలో తీసుకుంటే 5 తీవ్రతకు మించి వచ్చిన భూకంపం కిందటి డిసెంబర్‌లో ములుుగులో వచ్చింది.
భద్రాచలంలో అతిపెద్ద భూకంపం.
https://earthquaketrack.com/in-40-hyderabad/biggestప్రకారం 57 ఏళ్ల కిందట భద్రాచలంలో అతిపెద్ద భూకంపం వచ్చింది. ఏప్రిల్ 13, 1969 న రాత్రి 9గంటల ప్రాంతంలో 5.7 మాగ్నిట్యూడ్‌తో వచ్చిన ఈ భూకంప కేంద్రాన్ని భద్రాచలానికి 14.2 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అయితే 20 కిలోమీటర్ల లోతున రావడంతో ప్రభావం తక్కువుగా ఉంది. 1969లో వచ్చిన భూకంపానికి సంబంధించి ప్రాణనష్టం జరిగినట్లుగా గుర్తించలేదు.

ఇప్పుడు రామగుండంలో 5 తీవ్రతతో రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంచనా నిజం కావొచ్చు… కాకపోవచ్చు. అలాగే ఆ భూకంప తీవ్రత తగ్గనూ వచ్చు.. లేదా పెరగొచ్చు. కేవలం వీళ్ల అల్గారిథమ్ ప్రిడిక్షన్ ను ఆధారంగా చేసుకునే ఈ అంచనాలు ఇచ్చారు.





















