APMS 2025 Exam: విద్యార్థులకు అలర్ట్, ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు, ఎగ్జామ్ ఎప్పుడంటే?
APMS: ఏపీలోని ఆదర్శపాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతి ప్రవేశ పరీక్ష తేదీలో పాఠశాల విద్యాశాఖ మార్పు చేసింది. ఏప్రిల్ 21న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

APMS 2025 Exam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో (Model Schools) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశ పరీక్ష తేదీలో విద్యాశాఖ మార్పు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. క్రైస్తవుల పవిత్ర దినమైన 'ఈస్టర్' పర్వదినం నేపథ్యంలో ఏప్రిల్ 21కి రీషెడ్యూల్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని విజ్ఞప్తి చేశారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారివారి మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లో ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ప్రవేశపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ కోరింది. ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఇంటర్‌లో ప్రవేశాలకు ఇప్పటికే మొదలైన దరఖాస్తుల ప్రక్రియ మే 22 వరకు కొనసాగనుంది.
ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో (Mode Schools) ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడింది. విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 24 నుండి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధిస్తారు, చదువుకోవడానికి విద్యార్థులు ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు. ఈ పాఠశాలలన్నీ కూడా సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 5వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో అర్హత మార్కులకు ఓసీ, బీసీ విద్యార్థులకు 35గా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30గా నిర్ణయించారు.





















