YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డి భద్రతపై టీడీపీ, వైసీపీ మధ్య సాగుతున్న పోరు మరో మలుపు తిరుగుతోంది. విషయంపై కేంద్రం వద్ద తేల్చుకునేందుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

ఏ ముహుర్తాన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనకు వెళ్లారో గాని అక్కడ జరిగిన ఘటనలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. వైఎస్ జగన్ పనుల వల్ల రాష్ట్రంలో లా అండ్ అర్డర్ దెబ్బ తింటోంది అంటూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.మాజీ సీఎం జగన్ అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. అందులో భాగంగా ఆయన చేసిన కామెంట్స్‌పై టీడీపీ మండిపడుతోంది.
కేంద్రానికి ఫిర్యాదు చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు
జగన్ వ్యవహారశైలిపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు వైఎస్ జగన్ అరాచకాలు ముప్పుగా మారుతోన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి కామెంట్స్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ హోదాలో లావు శ్రీకృష్ణదేవరాయులు బుధవారం లేఖ రాశారు. సానుభూతి పర్యటనల పేరుతో వైఎస్ జగన్ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పాపిరెడ్డిపల్లిలో జగన్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆయన అన్నారు.
రాజ్యాంగబద్ధంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని తప్పు పడుతూ పోలీసుల నైతికతను దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారని శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. 13 ఏళ్లుగా CBI, ED కేసుల్లో బెయిల్‌పై బయట ఉన్న వైఎస్ జగన్ వ్యవస్థలను బెదిరించేలా వ్యవరిహస్తున్నారని కంప్లైంట్ చేశారు. సిన్సియర్‌గా పని చేస్తున్న పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు బెయిల్ షరతులను ఉల్లంఘించటమేనన్నారు శ్రీకృష్ణదేవరాయలు.తన సొంత పినతండ్రి వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా మార్చి చెప్పి, ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్న వ్యక్తి జగన్ రెడ్డి అని పేర్కొన్నారు తన లేఖలో కోడి కత్తి నుంచి రాళ్ల దాడి వరకూ ప్రతిదీ ఒక నాటకమేనని ఆయన ఆరోపించారు. కోడి కత్తి కేసులో NIA ముందు ఒక్కసారి కూడా హాజరు కాని వ్యక్తి.. ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వేలమంది పోలీసులతో బందోబస్తు ఇచ్చినా కూడా ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారంటూ జగన్‌పై మండిపడ్డారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చు రేపేలా జగన్ ప్రసంగాలు చేయడం… కార్యకర్తల్ని రెచ్చగొట్టడం… ఇవన్నీ శాంతి భద్రతలకు ముప్పు కలిగించే కుట్రలుగా లావు కృష్ణ దేవరాయలు అన్నారు.
ముందుగానే రోడ్డు ప్రయాణం ప్లాన్ చేసి స్క్రిప్ట్ ప్రకారం డ్రామాకి తెర లేపి అలజడులు సృష్టించడానికి జగన్ వర్గం ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు ఆదరించిన NDA కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తోందన్నారు టీడీపీ ఎంపీ.
పరిపాలన గాలికి వదిలేసి జగన్ పై నిందలు వేస్తే ఊరుకునేది లేదు : బొత్స సత్యనారాయణ
లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. రామగిరిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళితే భద్రత చర్యలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని బొత్స విమర్శలు చేశారు. వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకంత ఆక్రోశమని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తప్పు చేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టారని అన్నారు. గేట్లు సరిగా కట్టకపోతే దానికి ప్రకాష్ రెడ్డిదా తప్పు అంటూనే అధికారం ఎన్నడు శాశ్వతం కాదనీ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయనీ గుర్తు చేశారు.
జగన్ ఎక్కడికి వెళ్లినా భద్రతను గాలికి వదిలేస్తున్నారన్న బొత్స.. జగన్‌కు కావలసిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జగన్ భద్రత పట్ల తమకు ఆందోళన ఉందన్న అయన జగన్ భద్రత కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పుకొచ్చారు. త్వరలోనే ప్రధానిమంత్రి దగ్గరకు వెళ్ళి జగన్‌కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తామని ఆయన చెప్పారు.
ఎంపీ కృష్ణదేవరాయలకు వారి తండ్రి సంస్కారం నేర్పలేదా అంటూ విమర్శించారు బొత్స. కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని...1100 మందితో జగన్ కు భద్రత కల్పిస్తే ఆ పోలీసులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
బొత్సకు కౌంటర్ ఇచ్చిన నిమ్మల రామానాయుడు
జగన్ భద్రతపై బొత్సా సత్యనారాయణ చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే భద్రత కావలసింది జగన్‌కు కాదని రాష్ట్రానికి, ప్రజలకు భద్రత కావాలి అంటూ నిమ్మల మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లోనే పరదాలు వద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఆంక్షలు వద్దు అని, తన భద్రత కూడా తగ్గించుకున్నారని గుర్తుచేశారు. జగన్‌కు మాత్రం 1100 మందితో భద్రత కల్పిస్తే అదికూడా సరిపోదంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పరామర్శకు వెళ్తున్నారా ? బల ప్రదర్శనకు వెళ్తున్నారా? అంటూ ప్రశ్నించిన మంత్రి డబ్బులు పంచిపెట్టి హెలికాఫ్టర్ దగ్గరకు జనసమీకరణ
చేయాల్సిన అవసరం ఏంటని అన్నారు. హెలికాఫ్టర్ దగ్గరకు అంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులను తీసుకురావడం, వాళ్ళే మీ మీద దాడి చేశారని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు ఇరిగేషన్ మంత్రి. హెలికాఫ్టర్ దగ్గర 250 మంది పోలీసులను భద్రత పెడితే, భద్రత లేదు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ముందే ఎలా సర్క్యులేట్ చేశారని మండిపడ్డారు. హెలికాఫ్టర్ మీద దాడి చేశారని అంటున్నారు, గంటన్నర వ్యవధిలోనే హెలికాఫ్టర్ ఎలా వెళ్ళిపోయిందన్నారు నిమ్మల రామానాయుడు.
మొత్తం మీద జగన్ రాప్తాడు పర్యటనలో జరిగిన ఘటనలపై టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేంద్రం దాకా వెళ్లారు. మరి కేంద్రంలోని బిజెపి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.





















