Mumbai Rains: మహారాష్ట్రలో కుండపోత వానలు- బయటకు రావద్దని ప్రజలకు అధికారుల హెచ్చరిక
Maharashtra Mumbai Rain News: ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
Mumbai Rain Update: మహారాష్ట్ర రాజధాని ముంబై, దాని పొరుగు జిల్లాల్లో వాతావరణ శాఖ గురువారం (సెప్టెంబర్ 26) 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల హెచ్చరికల కారణంగా ముంబై దాని శివారు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ ఆదేశించారు. BMC పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. భారీ వర్షాలు పడుతున్న వేళ ముంబై పోలీసులు కూడా సోషల్ మీడియా హ్యాండిల్‌లో కీలక ప్రకటన జారీ చేశారు. "ముంబయి నివాసితులు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి. దయచేసి సురక్షితంగా ఉండండి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ చేయండి" అని ట్వీట్ చేసింది.
Mumbai Police tweets, "In view of the Red alert in Mumbai & suburbs, issued by IMD, a holiday has been declared for all schools & colleges for tomorrow, 26th September 2024. Mumbaikars are requested to stay indoors, until essential. Please stay safe. Dial 100 in case of any… pic.twitter.com/fKJAT4IFUW
— ANI (@ANI) September 25, 2024
ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్
ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా జిల్లాలైన పాల్ఘర్, సింధు దుర్గ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. వివిధ చోట్ల పిడుగులు పడతాయని పేర్కొంది. బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
పూణేలో కూడా పాఠశాలలు, కళాశాలలు మూత
పూణే జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అందుకే జిల్లా కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాస్ పూణే సహా చుట్టుపక్కల ప్రాంతాలలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
వర్షం, బలమైన గాలుల కారణంగా విమానాలను కూడా దారి మళ్లించారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలు ముందుకు కదలడం లేదు. ముంబై విమానాశ్రయంలో స్పైస్‌జెట్, ఇండిగో, విస్తారా విమానాల సర్వీస్‌లు దెబ్బతిన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల క్యాన్సిల్ అవుతున్న, లేట్‌గా రన్ చేస్తున్న విమాన సర్వీసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆయా కంపెనీలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తున్నాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు- అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన