Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Osamu Suzuki : 80వ దశకంలో రిస్క్ చేసి భారత్‌తో ఒప్పందం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచిన ఒసాము సుజుకీ తుదిశ్వాస విడిచారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు.
Osamu Suzuki : ఒసాము సుజుకి 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. జపాన్‌కు చెందిన సుజుకి మోటార్‌కార్పొరేషన్ చెప్పిన వివరాల ప్రకారం లింఫోమా వ్యాధితో మృతి చెందారు. భారత దేశంలో ఆటోమొబైల్ రంగాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. దాదాపు నలభై ఐదేళ్ల క్రితం... ఇండియా అంటేనే ప్రపంచ దేశాలకు అంత పెద్ద నమ్మకం లేని పరిస్థితి. అలాంటి సమయంలో భారత్‌పై నమ్మకంతో ఓ వ్యక్తి వచ్చి ఒప్పందం చేసుకున్నారు.
1981లో అంటే లైసెన్సు రాజ్ నడుస్తున్న కాలంలో భారత్ వచ్చి ఒప్పందం చేసుకోవాలంటే విదేశీ కంపెనీలు ఆసక్తి చూపేవి కావు. అలాంటి అపోహలను తుడిచిపెట్టేశారు సుజికి ఒసాము. మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందదుకు భారత్‌తో ఒప్పందం చేసుకున్నారు.
ఒసాము సుజుకి చేసిన రిస్క్ వృథాపోలేదు. ఆయన అంచనాలు తప్పు కాలేదు. దేశంలో పరిశ్రమ అనుకున్నట్టుగానే విజయవంతంగా సాగింది. మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ తర్వాత మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌గా మారింది. ఇందులో భారత ప్రభుత్వాని కంటే ఎక్కువ వాటా సుజుకి మోటార్ కార్పొరేషన్ కలిగి ఉండటంతో 2007లో బయటకు వచ్చేసింది. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్‌కు ఒసాము సుజుకి డైరెక్టర్, గౌరవ ఛైర్మన్‌గా కంటిన్యూ అవుతున్నారు.
విచారం వ్యక్తం చేసిన మోదీ
గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమలో దిగ్గజ వ్యక్తి అయిన ఒసాము సుజుకి మరణించినందుకు ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. "ఒసాము సుజుకి దూరదృష్టితో కూడిన పని ప్రపంచ ఆలోచననే మార్చేసింది. ఆయన నాయకత్వంలో సుజుకి మోటార్ కార్పోరేషన్ గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారింది సవాళ్లను విజయవంతంగా అధిగమించారు. ఆవిష్కరణలు చేయడమే కాకుండా వాటి విస్తరణకు శ్రమించారు. భారతదేశంపై ఆయనకు ఎనలేని ప్రేమ కలిగి ఉండేవాళ్లు. మారుతితో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌ను విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
"దార్శనికత, దూరదృష్టితో మరెవరూ తీసుకోని రిస్క్ తీసుకున్నారు. భారతదేశం పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమ ఉంది. ఆయన అపారమైన సామర్థ్యాలతోనే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ శక్తి కేంద్రంగా మారింది. "అని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) చైర్మన్, R C భార్గవ సుజుకి పాస్ అన్నారు. భారతదేశానికి సుజుకి చేస్తున్న సహకారాన్ని పేర్కొంటూ, "ఒసాము కారణంగా ఈ దేశంలో లక్షల మంది మెరుగైన జీవితాలను గడుపుతున్నారు" అని అన్నారు. "భారత ఆర్థిక వ్యవస్థకు ఒసాము అందించిన సహకారం, భారతదేశం, జపాన్ మధ్య సంబంధాల మెరుగు పరిచినందుకు పద్మభూషణ్ ప్రదానం చేయడం ద్వారా గుర్తింపు లభించింది. "