![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CM KCR : దేశంలో ఇన్ని జీవనదులున్నా తాగేందుకు నీళ్లుండవా?, ఈ పాపానికి బాధ్యులెవరు? - సీఎం కేసీఆర్
CM KCR : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా...ప్రజల పరిస్థితులు మారలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.
![CM KCR : దేశంలో ఇన్ని జీవనదులున్నా తాగేందుకు నీళ్లుండవా?, ఈ పాపానికి బాధ్యులెవరు? - సీఎం కేసీఆర్ Maharashtra Aurangabad BRS Chief KCR questioned Union Government water scarcity in country CM KCR : దేశంలో ఇన్ని జీవనదులున్నా తాగేందుకు నీళ్లుండవా?, ఈ పాపానికి బాధ్యులెవరు? - సీఎం కేసీఆర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/24/9e49754695b858a8e796be2a5b4d38f41682353288074235_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM KCR : దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్అన్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారని, పేదవాళ్లు మరింత పేదవాళ్లు అవుతున్నారని ఆవేదన చెందారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ జబిందా గ్రౌండ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పలువు మరాఠా నేతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఇన్ని జీవనదులు ఉన్నా తాగు, సాగు నీరు సమస్య ఎందుకు వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. నీరు అందించని పాపం ఎవరిదని మండిపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.
పేదలు మరింత పేదలు
మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని కేసీఆర్ తలచుకున్నారు. తన మాటలు ఇక్కడ విని ఇక్కడే మరిచిపోకుండా... గ్రామాలకు వెళ్లి చర్చించాలన్నారు. దేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించాలని కోరారు. దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. శంభాజీనగర్‌లో వారానికోసారి నీళ్లు వస్తాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారన్నారు. మన కళ్లముందే ఇదంతా జరుగుతుంటే ఈ వ్యాధికి చికిత్స చేయాలా? వద్దా అని ప్రశ్నించారు. ప్రజలు ఎంత త్వరగా మేలుకుంటే అంత త్వరగా బాగుపడుతామన్నారు.
In a country where farmers are dying in hundreds, Prime Minister is showing cheetahs: BRS President, CM Sri KCR. pic.twitter.com/FrzvINxm4v
— BRS Party (@BRSparty) April 24, 2023
ఆర్థిక రాజధానిలో తాగునీటి సమస్య
తెలంగాణలో సమస్యలు లేకుండా చేశామని కేసీఆర్ తెలిపారు. భయపడితే ఇంకా భయపెట్టిస్తారని, ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదన్నారు. మార్పును తీసుకురావడం కోసమే బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందన్నారు. మార్పు వచ్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందన్నారు. దేశ భవిష్యత్ ప్రజల మీదే ఆధారపడి ఉందన్నారు. గోదావరి, కృష్ణా వంటి జీవ నదులున్నా.. మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు వస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయిలో తాగేందుకు నీళ్లుండవన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే దేశం పురోగమిస్తోందా? తిరోగమిస్తోందా? అర్థంకావడంలేదన్నారు. ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు.
మహారాష్ట్రలో ఐదేళ్లలో ప్రతి ఇంటికీ నీరు
దేశంలో తాగేందుకు నీరు లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. పెద్ద పెద్ద మాటలు చెబుతున్న నేతలు... తాగునీరు అందించలేకపోతున్నారన్నారు. దేశంలో యువతకు ఉద్యోగాల్లేవన్నారు. జనాభాకు కావాల్సిన దానికంటే రెట్టింపు నీరు ఉన్నా సద్వినియోగం చేసుకోవడంలేదన్నారు. సాగు యోగత్య ఉన్న భూములకు నీరు అందించాల్సి ఉంద్నారు. అయితే ప్రధాని, రాష్ట్రాల సీఎంలకు ఆ పని చేసే సామర్థ్యాలు లేవని విమర్శించారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ తాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఐదేళ్లలో ప్రతి ఇంటికీ నీరు అందిస్తామన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ పోరాటం ఆగదన్నారు. ఒక కులం, మతం, వర్గం కోసం బీఆర్‌ఎస్ ఆవిర్భవించలేదన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)