IndiGo Flight Grounded: టేకాఫ్ అయిన వెంటనే ఇండిగో విమానంలో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన సిబ్బంది
IndiGo Flight Grounded: ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నిప్పు రవ్వలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
IndiGo Flight Grounded at Delhi Airport: ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు రావడంతో అత్యవసరంగా అదే ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇండిగో విమానం 6E-2131 ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు రావడాన్ని సిబ్బంది గుర్తించారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూసేందుకు వెంటనే ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే విమానంలో మంటలు చెలరేగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Thank God people are safe! Visual of an #Indigo flight at the Delhi airport. God!!!
— Prashant Kumar (@scribe_prashant) October 28, 2022
pic.twitter.com/r8K5TwMbiu
ఢిల్లీ నుంచి బయలుదేరిన తమకు భయానక అనుభవం ఎదురైందని ఓ ప్రయాణికురాలు ట్విట్టర్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. ఇది టేకాఫ్ వీడియో, కానీ ఢిల్లీ రన్ వే లో ఈ ఘటన జరిగిందని ప్రియాంక కుమార్ అనే నెటిజన్ తన ట్విట్టర్ లో వీడియో షేర్ చేయగా వైరల్ గా మారింది. షెడ్యూల్ టైమ్ కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా దాదాపు రాత్రి 9:30 గంటల సమయంలో ఇండింగో ఫ్లైట్ ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కానీ నిప్పు రవ్వలు రావడంతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అర్ధరాత్రి 12:16 గంటలకు ప్రయాణికులకు మరో విమాన సర్వీసు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రమాదంపై ఇండిగో ప్రకటన..
ఢిల్లీ - బెంగళూరు మధ్య సర్వీసులు అందిస్తున్న ఇండిగో విమానం 6E-2131 టేకాఫ్ సమయంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా మరో ఇండిగో విమానాన్ని ఏర్పాటు చేస్తామని ఓ ప్రకటనలో ఇండిగో తెలిపింది.
An aircraft operating flight 6E-2131 (Delhi-Bangalore) experienced a technical issue while on take-off roll, immediately after which the pilot aborted the takeoff & aircraft returned to the bay. All passengers & crew are safe & an alternate aircraft is being arranged: IndiGo pic.twitter.com/rkNeRXgqbg
— ANI (@ANI) October 28, 2022
గురువారం ఇలాంటి ఘటనే..
ఢిల్లీకి బయలుదేరిన ఆకాశ విమానం టేకాఫ్ సమయంలో పక్షి ఢీకొట్టింది. దాంతో విమానం రాడోమ్ దెబ్బతింది. గురువారం ఈ ఘటన జరిగింది. ‘ఆకాశ B-737-8 (మాక్స్) విమానం VT-YAF ఆపరేటింగ్ ఫ్లైట్ QP-1333 (అహ్మదాబాద్ - ఢిల్లీ) టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొంది. అప్పటికే విమానం 1900 అడుగుల ఎత్తులో ఉంది. అయితే ఢిల్లీలో ల్యాండింగ్ తర్వాత, రాడోమ్ దెబ్బతిన్నట్లు సిబ్బంది గుర్తించామని’ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 14న బెంగుళూరుకు వెళ్లే మరో ఆకాశ విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు.