Annamayya Crime News: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
Andhra Pradesh News | అన్నమయ్య జిల్లాలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిచెందారు. పాయకరావుపేటలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు.

Annamayya Road Accident | సంబేపల్లి: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో హెచ్ఎన్ఎస్ యూనిట్ 2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిపై చంద్రబాబు సంతాపం
అమరావతి: రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంబేపల్లె మండలం యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమను రాయచోటి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరణించారు. రమ మృతి దురదృష్టకరమని కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. వీరిని విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ వాసులుగా పోలీసులు గుర్తించారు.






















