పురుషులూ, కంగారు వద్దు - చలికాలంలో ‘అది’ తగ్గడం సాధారణమే!
చలికాలం మొదలైనప్పటి నుంచి అనారోగ్యాలు ఉంటునే ఉంటాయి. వాటికి తోడుగా మరిన్ని అసౌకర్యాలు, ప్రాణాంతకాలు ఏర్పడవచ్చు జాగ్రత్త అంటున్నారు నిపుణులు
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రల్లో చలి విపరీతంగా ఉంది. తుఫాన్ ప్రభావం వల్ల గాలులతో జనాలు వణికిపోతున్నారు. ఇక హైదరాబాద్‌లో ఏకంగా ఢిల్లీలో ఉన్న అనుభూతి కలుగుతోంది. ఈ చలితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే.. చలి కాలం అంటేనే జబ్బుల కాలం. రకరకాల కారణాలతో ఏదో ఒక జబ్బు దాడి చేస్తూనే ఉంటుంది. ఇక ఆస్తమా, సైనసైటీస్ వంటి అలర్జీలు ఉన్నవారికి వచ్చే అనారోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. చలికాలం మొదలైనప్పటి నుంచి వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. అలాగే పురుషుల్లో అంగ పరిమాణంలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఇందుకు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు చలికాలంలో ప్రజలను వేదించే సమస్యలు ఏమిటో ముందుగా తెలుసుకుందాం.
అతి మూత్రం
మామూలుగా వేడి వాతావరణం ఉన్నప్పటి కంటే వాతావరణం చల్లగా ఉన్నపుడు మరింత ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. చల్లని వాతావరణంలో ఎక్కువ చెమట రాదు. శరీరంలో నుంచి ఎక్కువైన నీరు బయటకు చర్మం ద్వారా బయటకు పోదు ఫలితంగా కిడ్నీలు ఎక్కువ నీటిని రక్తం నుంచి వడకడుతుంటాయి. అందువల్ల శరీరంలో మూత్రం ఎక్కువ తయారవుతుంది. అందుకే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి వస్తుంది. చాలా మందికి ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ కొందరిలో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉంటుంది. అలాంటి వారికి రోజువారీ పనుల్లో కొంత అంతరాయం కలుగవచ్చు.
పంటి నొప్పి
చలికాలంలో దంతాలు రెండు రకాలుగా చలి ప్రభావానికి లోనవుతాయి. చల్లని వాతావరణం వల్ల పంటి మీద ఉండే ఎనామిల్ కోటింగ్ పగుళ్లలా కనిపిస్తుంది. అంతేకాదు చల్లని వాతావరణంలో టూత్ సెన్సిటివిటి చాలా సాధారణంగా కనిపించే సమస్య. వాతావరణం చల్లబడగానే శ్వాసించే గాలి కూడా చల్లబడుతుంది కనుక పంటి మీద ఉండే ఎనామిల్ వ్యాకోచించడం, సంకోచించడం చాలా తరచుగా జరగడం వల్ల అది పగుళ్లు చూపుతుంది. లేదా దంతక్షయం కూడా జరుగుతుంది. ఫలితంగా దంతాల్లో రంద్రాలు ఏర్పడి పిప్పిపళ్ల కూడా రావచ్చు. ఫలితంగా డెంటిన్ బయటకు రావడం వల్ల నొప్పి వస్తుంది. చల్లని వాతావరణం వల్ల వణుకు వచ్చి దంతాల మధ్య రాపిడి కూడా పెరుగుతుంది. ఇది కూడా దంతాల్లో నష్టం జరగడానికి కారణం అవుతుంది.
నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది
వాతావరణం చల్లగా ఉండడం వల్ల శక్తి ఎక్కువ శాతం శరీర ఉష్ణోగ్రతను సంతులనం చెయ్యడానికే వినియోగించాల్సి వస్తుంది. అందువల్ల నిరోధక వ్యవస్థ బలహీన పడతుంది. ఫలితంగా చాలా త్వరగా ఇన్ఫెక్షన్లు దాడిని ఎదుర్కొనె శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. అందువల్ల ఈ సీజన్ లో న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకాలుగా మారుతుంటాయి. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు చాలా కామన్ గా కనిపిస్తుంటాయి.
అంతేకాదు ఇమ్యూనిటి తగ్గడం వల్ల పదే పదే వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ఊపిరితిత్తులు కూడా బలహీనపడతాయి. చల్లని వాతావరణం గుండె పనితీరు మీద కూడా ప్రభావం చూపుతుంది. అందువల్ల చలికాలంలో గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలతో ఎక్కువ మరణాలు సంభవిస్తుంటాయి. చల్లని వాతావరణంలో రక్తనాళాలు కుంచించుకు పోవడం, బ్లాక్స్ ఏర్పడడం వంటి కారణాలతో గుండెపోటు మరణాలు ఎక్కువగా జరుగుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డీహైడ్రేషన్
చలికాలంలో గాలి చాలా పొడిగా ఉంటుంది. ఈ పొడిగాలి వల్ల నోరు చాలా త్వరగా పొడి బారిపోయిన భావన కలుగుతుంది. నోటిలో లాలాజలం కూడా తక్కువగా తయారవుతుంది. ఫలితంగా నోటికి ఉండే సహజమైన పోరాడే శక్తి తగ్గిపోతుంది. నోటిలో ఊరే లాలాజలం నోటిలో మిగిలిపోయిన ఆహారం వల్ల ఏర్పడిన హానికారక బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దంతక్షయానికి ఇది కూడా ఒక కారణం. దీనిని నివారించేందుకు నీళ్లు అందుబాటులో పెట్టుకొని తరచుగా నీళ్లు తాగుతుండాలి. వాతావరణం చల్లగా ఉండడం వల్ల నీళ్ల తాగాలన్న కోరిక ఎక్కువ కలగదు. అందువల్ల నీటి వినియోగం తగ్గుతుంది. ఇది శరీరం డీహైడ్రేట్ అవడానికి కారణం అవుతుంది. కాలం ఏదైనా రోజుకు రెండు లీటర్ల నీరు తప్పనిసరిగా శరీరానికి అవసరం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.
అంగ పరిమాణం
వేసవిలో వెచ్చని వాతావరణం వల్ల రక్తనాళాలు విశాలంగా ఉంటాయి. అందువల్ల శరీరంలో ఆ భాగాలు పెద్దవిగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురుష జననాంగం పెద్దదిగా కనిపిస్తుంది. అయితే, చలికాలంలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. అంగం పరిమాణం తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రక్తనాళాలు చలి నుంచి శరీరాన్ని కాపాడే క్రమంలో శరీరం పైన ఉండే రక్తనాళాలు ఎక్కువ కుంచించుకుపోతాయి. ఇలాంటి రక్తనాళాలు ఎక్కువగా పురుషాంగం చుట్టూరా ఉంటాయి. అంతేకాదు ఈ కారణం వల్లనే వృషణాల పరిమాణం కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. అంతేకాదు, స్క్రోటమ్ వరకు ఇవి చొచ్చుకుని వస్తాయి. ఒకసారి వాతావరణం వేడెక్కగానే తిరిగి యథాస్థితి కి వస్తాయి. ఇదేమీ పెద్ద భయపడాల్సిన విషయం కాదు. కాబట్టి, చిన్నదిగా మారిందనే భయాన్ని మనసులో పెట్టుకోవద్దు.
Also Read: చల్లని vs వేడి నీళ్ళు - ఏ నీటితో తలస్నానం చేస్తే మంచిది?