Menopause: మహిళల్లో మెనోపాజ్ ఏ వయస్సులో వస్తుంది? వాటి లక్షణాలు గుర్తించడం ఎలా?
మెనోపాజ్ లక్షణాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. వాటి మెనోపాజ్ సంభవించే ముందు వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయాల్సిందే.
మెనోపాజ్.. ప్రతి ఒక్క మహిళ తన రుతుచక్రంలో చివరిగా ఎదురయ్యే సహజమైన జీవప్రక్రియ. వరుసగా 12 నెలల పాటు రుతుక్రమం రాకపోతే మెనోపాజ్ దశకి చేరుకున్నట్లే. ఇది సాధారణంగా 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు స్త్రీలలో సంభవిస్తుంది. అయినప్పయిటికి కూడా ఇది జన్యుశాస్త్రం, వయస్సు, వైద్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి కొంతమందికి ముందుగానే మెనోపాజ్ రావచ్చు, మరికొంతమందికి ఆలస్యంగా వస్తుంది. అండాశయాలు గుడ్లు ఉత్పత్తి చేయడం ఆపేసి స్త్రీ సెక్స్ హార్మోన్లు స్థాయిలు పడిపోయినప్పుడు ఇది జరుగుతుంది. స్త్రీ పునరుత్పత్తి ముగిసింది అనేందుకు ఇది సూచిక.
మెనోపాజ్ శరీరంలో అనేక మార్పులకి కారణం అవుతుంది. ముఖ్యంగా వయస్సు రీత్యా వచ్చే వృద్ధాప్యం వల్ల వస్తుంది. అయితే ఏవి వృద్ధాప్య సంకేతాలు, ఏవి మెనోపాజ్ సంకేతం అనే తేడాను గుర్తించడం కొంచెం కష్టం. అనేక ఆరోగ్య పరిస్థితులు, శారీరక లక్షణాలు మెనోపాజ్ ని సూచిస్తాయి. ఈ లక్షణాలు ఈస్ట్రోజెన్ ఉత్పత్తి, హార్మోన్ల హెచ్చుతగ్గులని సూచిస్తుంది. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, ఎక్కువ లేదా తక్కువ రోజులు రక్తస్రావం అవడం వంటి వాటిని మెనోపాజ్ కి సంకేతాలుగా గుర్తించవచ్చు. ఇవే కాదు మరికొన్ని సూచనలను బట్టి కూడా మెనోపాజ్ దశ మొదలైన విషయం గ్రహించవచ్చు.
శరీరంలో వేడి: అకస్మాత్తుగా శరీరం వెచ్చగా అనిపిస్తుంది. సాధారణంగా మెడ, ముఖం, ఛాతిపై తీవ్రమైన చెమట వస్తుంది. రాత్రి పూట చెమటలు ఎక్కువగా పడతాయి.
కోల్డ్ ఫ్లాష్: మెనోపాజ్ లో కోల్డ్ ఫ్లాష్, హాట్ ఫ్లాష్ అని రెండు ఉంటాయి. ఉన్నట్టుండి చెమట వస్తే అది హాట్ ఫ్లాష్, అకస్మాత్తుగా చలిగా అనిపిస్తే అది కోల్డ్ ఫ్లాష్.
వజీనా పొడిబారిపోవడం: ప్రీమెనోపాజ్ సమయంలో వజీనా పొడిబారిపోతుంది. ఇది లైంగిక కలయిక సమయంలో అసౌకర్యానికి దారి తీస్తుంది.
మూత్రం ఆపుకోలేని స్థితి: తుమ్మడం, దగ్గడం, గట్టిగా నవ్విన సమయంలో తెలియకుండానే మూత్రాశయం మీద నియంత్రణ కోల్పోతారు. దీని వల్ల మూత్ర విసర్జన నియంత్రించలేరు.
నిద్రలేమి: ఒక్కోసారి నిద్ర లేమితో కూడా బాధపడతారు. నిరంతరం నిద్ర సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగే భావోద్వేగంలో మార్పులు వస్తాయి. మానసికంగా చిరాకు, ఆందోళన, తేలికపాటి నిరాశకి గురయ్యే అవకాశం ఉంది. మానసిక క్షోభ మెనోపాజ్ ప్రారంభాన్ని సూచిస్తుంది.
శారీరకంగా మార్పులు: మెనోపాజ్ సమీపిస్తున్నప్పుడు జుట్టు, చర్మం పొడిగా మారిపోతుంది. కొంతమంది సన్నగా అయిపోతే మరికొంతమంది బరువు పెరుగుతారు. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. కీళ్ల నొప్పులు కూడా సంభవిస్తాయి.
ఇవే కాకుండా హార్ట్ బీట్ లో మార్పులు, కీళ్ళు, కండరాల నొప్పి, లిబిడీలో మార్పులు, ఏకాగ్రత దెబ్బతినడం, జ్ఞాపకశక్తి మందగించడం, బరువు పెరగడం, జుట్టు రాలడం లేదా సన్నబడటం జరుగుతుంది. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మెనోపాజ్ లక్షణాల నుంచి వచ్చే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ధూమపానం, కెఫీన్ తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి వాటి వల్ల మెనోపాజ్ లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి. అందువల్ల వీలైనంత వరకు వాటిని నివారించడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఈ సమస్యలు ఉన్నవాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకపోవడమే బెటర్