ABP Desam Health Conclave 2024: బొప్పాయి తింటే డెంగీ తగ్గిపోతుందనడానికి ఆధారాల్లేవు,హెల్త్ కాన్‌క్లేవ్‌లో పీడియాట్రిషియన్
ABP Desam Health Conclave: ఏబీపీ దేశం హెల్త్ కాన్‌క్లేవ్‌లో రెయిన్‌బో హాస్పిటల్స్ పీడియాట్రిషన్ డాక్టర్ షేక్ ఫర్హాన్ డెంగీ ఫివర్ గురించి కీలక విషయాలు వెల్లడించారు.
ABP Desam Health Conclave Live 2024: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్‌లో రెయిన్‌బో హాస్పిటల్స్ పీడియాట్రిషియన్ డాక్టర్ షేక్ ఫర్హాన్ పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్య సమస్యలపై కీలక విషయాలు వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న డెంగీ జ్వరం గురించి మాట్లాడారు. కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. డెంగీ ఫివర్ మరీ ప్రమాదకరమేమీ కాదని, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచించారు. డెంగీ ఫివర్‌లో క్రిటికల్, రికవరీ అనే ఫేజ్‌లు ఉంటాయని వివరించారు. డెంగీ వైరస్ సోకిన వాళ్లలో వాపులు, తీవ్ర జ్వరం, దద్దర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. అయితే..95% కేసుల్లో లక్షణాలు స్వల్పంగానే ఉంటాయని వివరించారు. ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోవడం వల్ల నీరసపడిపోతారని చెప్పారు. బీపీ కూడా తగ్గిపోయి, ఒక్కోసారి రక్తస్రావమూ అవుతుందని తెలిపారు. ఇలాంటి కేసులను సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. మరికొంత మంది చిన్నారులు శ్వాస తీసుకోడానికీ ఇబ్బంది పడతారని డాక్టర్ షేక్ ఫర్హాన్ అన్నారు. సాధారణంగా డెంగీ జ్వరం 7-8 రోజుల పాటు ఉంటుందని, కొంత మందిలో అంత కన్నా ఎక్కువ రోజులు ఉండే అవకాశముందని తెలిపారు. అయితే...మొదటి మూడు రోజులు విపరీతంగా ఇబ్బంది పెడుతుందని, ఆ సమయంలోనే సరైన వైద్యం అందించాలని సూచించారు. ఇప్పటి వరకూ డెంగీకి ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదని, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్‌ని అందిస్తారని చెప్పారు.
డెంగీ సోకినప్పుడు లక్షణాల్ని బట్టి వైద్యం చేస్తామని డాక్టర్ షేక్ ఫర్హాన్ తెలిపారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ అందరికీ కామన్‌గా ఇస్తారని స్పష్టం చేశారు. బీపీ విపరీతంగా తగ్గిపోయినప్పుడు ICUలో ఉంచి చికిత్స అందించాల్సి వస్తుందని వెల్లడించారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం కీలకమని వివరించారు. పారాసిటమాల్ ఇచ్చిన రెండు మూడు గంటల్లో హైఫివర్ వస్తే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఆలస్యం చేస్తే లివర్ సహా మిగతా అవయవాలపైనా ప్రభావం పడుతుందని చెప్పారు. బొప్పాయి తింటే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేశారు. కొంత మందిలో ఇది అనవసరంగా అసిడిటీని పెంచుతుందని అన్నారు. ఇదే సమయంలో ECMO గురించి ప్రస్తావించారు. గుండె, ఊపిరితిత్తులు పని చేయనప్పుడే ఈ చికిత్స అందిస్తారని తెలిపారు. పిల్లల్లో కన్నా పెద్దల్లోనే ఎక్మో ఎక్కువగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. గోవా నుంచి వచ్చిన పిల్లాడికి 29 రోజుల పాటు ఎక్మో అందించి ప్రాణాపాయం నుంచి తప్పించినట్టు వెల్లడించారు.