Har Ghar Tiranga: జాతీయ జెండాని స్వేచ్ఛగా ఎగరేసే హక్కు ఎప్పుడొచ్చింది? దీని వెనక ఇంత పోరాటం ఉందా?
Har Ghar Tiranga:
హర్ ఘర్ తిరంగాతో చర్చ..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా...హర్ ఘర్ తిరంగాను అందరూ అనుసరించారు. జాతీయ జెండాతో మనకున్న అనుబంధాన్ని పెంచింది ఈ ఉద్యమం. ఇదే సమయంలో మన జాతీయ జెండా అసలు ఎలా పుట్టింది..? ఎవరు తయారు చేశారు..? ఎన్ని మార్పులకు లోనైంది..? అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. జెండా అంటే మన దేశపు పొగరు, ఉనికి, ఆత్మగౌరవం...అన్నీ. జెండాలోని రంగుల గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి. కాషాయ రంగు హిందువులకు, ఆకుపచ్చ రంగు ముస్లింలకు...తెలుపు..మిగతా వర్గాలకు ప్రతీక అని భావిస్తుంటారు. అయితే 1921లో ఏప్రిల్ 13న యంగ్ ఇండియా కోసం మహాత్మా గాంధీజీ ఓ ఆర్టికల్ రాశారు. ఈ మూడు రంగులు ఎంచుకోటానికి కారణాన్ని వివరించారు. కాషాయానికి ముందు ఎరుపు రంగు ఉండేది. 1947 జులై 22న కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ జరిగినప్పుడు జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించారు. ఆ సమయంలోనూ మూడు రంగులపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కొందరు ఈ మూడు రంగుల్ని మతానికి ఆపాదిస్తే..మరికొందరు ఇంకో వాదన వినిపించారు. కాషాయం మనలోని ఐక్యతకు, త్యాగానికి, ఆకుపచ్చ రంగు ప్రకృతికి, తెలుపు రంగు శాంతికి ప్రతీకగా గుర్తించాలని అన్నారు. అప్పటి నుంచి ఇదే అభిప్రాయానికి గౌరవమిస్తున్నారు. ఈ సిద్ధాంతాలు, అభిప్రాయాలెలా ఉన్నా...ఈ త్రివర్ణ పతాకం భారత దేశ ఆత్మ గౌరవానికి అసలైన నిదర్శనం అని కచ్చితంగా చెప్పాలి.
జాతీయ జెండా ఎందుకు అవసరం..?
అసలు ఓ దేశానికి జాతీయ జెండా ఎందుకు అవసరం..? ఈ ప్రశ్నకూ గాంధీజీ అప్పట్లో సమాధానమిచ్చారు. భారత్‌కు ప్రత్యేకంగా జెండా ఎందుకు ఉండాలో, అది ఎంత కీలకమో గాంధీజీ అప్పట్లో వివరించారు. "జాతీయ జెండా అనేది అన్ని దేశాలకూ కీలకం. లక్షలాది మంది ఆ జెండా కోసమే ప్రాణాలర్పించారు. భారతీయులకు, ముస్లింలకు,క్రిస్టియన్లకు, పార్సీలకు...ఇలా ప్రజలందరి అస్తిత్వానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే జెండా చాలా అవసరం" అని బాపూజీ అన్నారు. జాతీయ గీతం చరిత్ర కూడా చిన్నదేమీ కాదు. అధికారిక జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరంతో పాటు అనధికారిక జాతీయ గీతం "సారే జహాసే అచ్ఛా" కూడా మన భారత దేశ ఉనికిని చాటి చెప్పేదే. మనందరి లోనూ దాగున్న దేశభక్తిని, ఉద్యమ స్ఫూర్తిని, ఐక్యతను, సామరస్యాన్ని తట్టి లేపేందుకు జాతీయ జెండా ఎంతో అవసరం. దేశ గౌరవానికి, జాతీయ వాదానికి బలం చేకూర్చేది త్రివర్ణ పతాకమే. భిన్న సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు ఉన్న భారత్ లాంటి దేశంలో జాతీయ జెండా "మనమంతా ఒక్కటే" అని గుర్తు చేస్తుంది. కులం, వర్గం, ప్రాంతం ఏదైనా కావచ్చు..చివరకు మనం భారతీయులం అని గర్వంగా చెప్పుకునే వివేకం అందించేది త్రివర్ణ పతాకం. అందుకే జాతీయ జెండా పట్ల మనం గౌరవం, విధేయత చూపించాలి. సాంస్కృతిక శాఖ "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరిట ప్రత్యేక వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఓ ఆసక్తికర అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. "జాతీయ జెండాతో మనకు వ్యక్తిగతమైన అనుబంధం ఉండట్లేదు" అని చెప్పింది. ప్రతి భారతీయుడినీ జాతీయ జెండాకు దగ్గర చేసేందుకే హర్ ఘర్ తిరంగా చేపట్టినట్టు వివరించింది. అంతే కాదు. దేశ నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేయాలన్న ఆలోచననూ పంచుకుంది.
ఎన్నో అపోహలు..
దేశభక్తిని పెంపొందించటమే హర్ ఘర్ తిరంగా ఉద్దేశం. అయితే ఇక్కడ మనం ఓ రెండు కీలక అంశాలు చర్చించుకోవాలి. ఒకటి దేశభక్తి, మరోటి జాతీయ జెండాకు అధికార ముద్ర వేయకుండా, ఆ పతాకంతో అనుబంధం పెంచుకోవటం. మొదట మనం రెండో పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అమెరికా, కెనడా సహా భారత్ కూడా జాతీయ జెండాను ఎగరేయటంలో కొన్ని ఆంక్షలు విధించింది. ఇళ్లపైన, ఆఫీస్‌లపైనా ఎప్పుడు పడితే అప్పుడు జెండా ఎగరేయటానికి వీలుండేది కాదు. అయితే 2002లో ఫ్లాగ్ కోడ్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఈ సంస్కరణలు చేపట్టక ముందే 1995 సెప్టెంబర్ 21న దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా (Flag Code of India)లోని నిబంధనలతో
ఓ సాధారణ పౌరుడు జాతీయ జెండా ఎగరేయటానికి ఆంక్షలు విధించటం సరికాదు అని చెప్పింది. ఆ తరవాత ఎంతో మేధోమథనం జరిగాక 2002లో " The Flag Code of India" అమల్లోకి వచ్చింది. జాతీయ జెండాకు గౌరవమిస్తూ ఎవరైనా, ఎపుడైనా జాతీయ జెండా ఎగరేసేందుకు అనుమతినిచ్చింది. జెండా ఎగరేయటంలో ఆంక్షలు తొలగిపోయినా...అది ఏ మెటీరియల్‌తో తయారు చేయాలన్న వాదన ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. కేంద్రం పాలిస్టర్‌తో తయారు చేసిన జెండాలకూ అనుమతినివ్వటంపై భిన్న అభిప్రాయాలు వినిపించాయి. ఈ చర్చ ఇక్కడితో ఆగలేదు. జాతీయ జెండాను "సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు" మాత్రమే ఎగరేయాలన్న మరో వాదన తెరపైకి వచ్చింది. కానీ... దీనిపై ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. ఏదేమైనా హర్ ఘర్ తిరంగాతో కొంత వరకూ జాతీయ జెండా ఎగరేయటంపై ఉన్న అపోహలు తొలగి పోయాయి.
కాంగ్రెస్ జెండానే..జాతీయ జెండాగా..
దేశానికి స్వాతంత్య్రం రాక ముందు దాదాపు రెండు, మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఫ్లాగ్‌నే జాతీయ జెండాగా పరిగణించారు అప్పటి ప్రజలు. ఈ పతాకాన్నే "గాంధీ జెండా" అని కూడా పిలుచుకునేవారు. ఈ జెండాను ఎగరేయాలని, తమ ఉద్యమ స్ఫూర్తిని తెల్లవాళ్లకు చాటి చెప్పాలని అప్పట్లో కొందరు మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలానే ప్రయత్నించారు. అయితే బ్రిటీష్ వాళ్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. వాళ్లను కాదని జెండా ఎగరేస్తే, వెంటనే తెల్లదొరలు హెచ్చరికలు పంపేవారు. 1923లో భగల్‌పూర్‌లో ఇదే జరిగింది. యూనియన్ జాక్ జెండాకు కాస్త తక్కువ ఎత్తులో కాంగ్రెస్ జెండాను ఎగరేసినందుకు..బ్రిటీష్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. "యూనియన్ జాక్ జెండా పక్కన కాంగ్రెస్ జెండా ఎగరటానికి వీల్లేదు" అని హెచ్చరించింది. సత్యాగ్రహ ఉద్యమం సమయంలో ఓ 8 ఏళ్ల బాలుడు కాంగ్రెస్ జెండాను ఎగరేసినందుకు... బ్రిటీష్ సైనికులు కొరడాతో కొట్టారు. అప్పటి నుంచి భారతీయులు ఎక్కడ జెండా ఎగరేస్తే అక్కడ బ్రిటీష్ సైన్యం ప్రత్యక్షమై వెంటనే తొలగించటం మొదలు పెట్టిందని, కమలా దేవి ఛటోపాధ్యాయ్ ఓ సందర్భంలో అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జాతీయ జెండాను ఎగరేసే హక్కు...ఎంతో కాలం పాటు పోరాడిన తరవాత కానీ దక్కలేదు. 1907లో మేడమ్ కామా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదే జెండాను 1906లో కలకత్తాలో తొలిసారి ఎగరేశారు. 1921లో జాతీయ జెండా మధ్యలో అశోక చక్రాన్ని జోడించారు గాంధీజీ. ఆ జెండాలో 1931లో మరోసారి మార్పులు చేర్పులు చేశారు.
అది ప్రాథమిక హక్కు
1945లో సుభాష్ చంద్రబోస్‌తో పాటు మరి కొందరి అమరుల ఫోటోల పక్కన కాంగ్రెస్ జెండాను ప్రింట్ చేశారు. అశోక చక్రంతో ఉన్న కాంగ్రెస్ జెండాతో పాటు INA జెండా కూడా ఇందులో చూడొచ్చు. జాతీయ జెండా కోసం భారతీయులు తీవ్ర పోరాటం చేశారు. జెండాతో వారికి క్రమ క్రమంగా అనుబంధం పెరిగింది. 2004లో సుప్రీం కోర్టు కూడా ఓ కీలక తీర్పునిచ్చింది. జాతీయ జెండాను ఎగరేయటం భారతీయుల అందరి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఇదే మన రాజ్యాంగంలోనూ ఉంది. అయితే..జాతీయ జెండాను గౌరవించిన వాళ్లందరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తారా అనేది మరో వాదన. చివరకు చెప్పేదేంటంటే..భారత పౌరులకు స్వేచ్ఛగా జాతీయ జెండాను ఎగరేసే హక్కు లభించటం వెనక..సుదీర్ఘ పోరాటం ఉంది. అది ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరమూ ఉంది.
Also Read: Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?