Etela Properties : ఈటలకు కేసులు - భార్యకు ఆస్తులు ఎక్కువ ! ఆఫిడవిట్‌లో ఆశ్చర్యపరిచే విషయాలు ...!
హుజురాబాద్‌లో ఈటల తరపున ఆయన సోదరుడు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆస్తులు, కేసుల వివరాలు వెల్లడించారు.
హుజూరాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ తరపున ఆయన సోదరుడు భద్రయ్య మొదటి విడత నామినేషన్ పత్రాల సెట్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, కేసుల వివరాలను కూడా వెల్లడిస్తూ అఫిడవిట్ ఇచ్చారు. ఆ ఆఫిడవిట్‌లో కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇతర ఎంతో మంది నేతల్లాగే ఆయనకూ కారు లేదు కానీ.. ఆస్తులు మాత్రం బాగానే ఉన్నాయి. కానీ భార్యకన్నా ఎక్కువ కాదు.
ఆదాయం ఆస్తుల్లో ఈటల కన్నా ఆయన భార్య జమునే ముందు !
ఈటల రాజేందర్ వార్షిక సంపాదన గత ఆర్థిక సంవత్సంలో ఆయన రూ. ముఫ్పై లక్షల కంటే కాస్త ఎక్కువ సంపాదించారు. ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ ప్రకారం ఆయన సంపాదించింది రూ. 30,16, 591. అదే సమయంలో ఆయన భార్య సంపాదన రూ. కోటి దాటిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈటల భార్య జమున సంపాదించిన మొత్తం రూ. కోటి 33 లక్షల 40వేల 372. ప్రస్తుతం ఈటల చేతిలో ఉన్న నగదు లక్ష రూపాయలు మాత్రమే. ఆయన భార్య చేతిలో కూడా ఎక్కువేమీ లేదు. రూ. లక్షన్నర మాత్రమే నగదు ఉన్నట్లుగా అఫిడవిట్‌లో చెప్పారు. అయితే బ్యాంకులో మాత్రం దండిగానే డబ్బులున్నాయి. ఈటలకు వేలల్లోనే ఉన్నాయి కానీ.. ఆయన భార్యకు మాత్రం మూడు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలో రూ. 60 లక్షల వరకు నగదు ఉంది.
Also Read : హైదరాబాద్‌లోని ఆ కాలనీలకు త్వరలోనే తాగునీరు: మంత్రి కేటీఆర్
వ్యాపారాలన్నీ ఈటల జమున పేరు మీదనే !
ఈటల రాజేందర్ ఏ రకమైన వ్యాపారము చేయడం లేదు. అన్ని వ్యాపారాలు ఆయన భార్య పేరు మీదనే ఉన్నాయి. తెలంగాణలో పేరు మోసిన పౌల్ట్రీ పరిశ్రమ ఓనర్లలో ఈటల కూడా ఒకరు. అయితే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటే వ్యాపారాలను ఆయన భార్య చూస్తారు. ఈ కారణంగా వ్యాపారాలన్నీ ఆమె పేరు మీదనే ఉన్నాయి. జమున హ్యాచరీస్‌తో పాటు అభయ డెవలపర్స్, నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్, ఎస్వీఎస్ అర్చవాన్ అండ్ డొలరైట్ అనే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఈటల పేరు మీద ఒక్క వాహనం కూడా లేదు. కానీ ఆయన భార్య పేరు మీద మూడు ఎస్‌యూవీ వాహనాలు ఉన్నాయి. ఈటల రాజేందర్ కు కాసు కూడా బంగారం లేదు. కానీ ఆయన భార్యకు కేజీన్నర బంగారం ఉంది.దీని విలువ రూ. యాభై లక్షలు ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
రూ. కోట్ల విలువైన భూములు !
ఇక ఈటల రాజేందర్‌తో పాటు ఆయన భార్యకు కూడా కోట్ల విలువైన భూములు ఉన్నాయి. ఈటల రాజేందర్ పేరు మీద ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూమల విలువ రూ. పన్నెండున్నర కోట్ల వరకూ ఉటుంది. ఆయన భార్య పేరుపై ఉన్న భూముల విలువ రూ. 14 కోట్ల 78 లక్షల 84000 వేలు. ఇదంతా మార్కెట్ వాల్యూ. ఆయనకు అప్పులు కూడా ఎక్కువే ఉన్నాయి. ఈటలకు రూ. 3 కోట్ల 62 లక్షల 42 వేల 168 అప్పు ఉండగా ఆయన భార్యకు రూ. 4 కోట్ల 89 లక్షల 77వేల 978 అప్పు ఉంది.
Also Read : ఈటల స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నికలు.. వ్యక్తి లాభమా? వ్యవస్థ లాభమా? తేల్చుకోండి: హరీశ్ రావు
ఈటలపై ఇప్పటికి 19 కేసులు - ఐదు కేసుల్లో శిక్ష కూడా పడింది !
ఉద్యమ సమయంలో నమోదైన కేసులు.. ఎన్నికల కేసులు అన్నీ కలిపి ప్రస్తుతం ఈటల రాజేందర్‌పై 19 కేసుల వరకూ ఉన్నాయి. ఐదు కేసుల్లో శిక్ష పడింది. అయితే ఇవన్నీ జరిమానాతో శిక్షింపబడిన కేసులు. ఈ కారణంగా ఆయన వచ్చిన ఇబ్బందేమీ లేదు.
Also Read: పాతబస్తీలో అసదుద్దీన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి అలా చేస్తే తీవ్ర పరిణామాలని హెచ్చరిక
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.