Huzurabad Politics: ఈటల స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నికలు.. వ్యక్తి లాభమా? వ్యవస్థ లాభమా? తేల్చుకోండి: హరీశ్ రావు
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా గురువారం హరీశ్ రావు హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హుజూరాబాద్‌లో ఎన్నికల వాతావరణం రాన్రానూ మరింత వేడిగా మారుతోంది. ప్రత్యర్థి లక్ష్యంగా ఎవరికి వారు తమ ఆరోపణలు, విమర్శలకు పదును పెడుతున్నారు. తాజాగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ తన వ్యక్తిగత స్వార్థం కోసమే హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. హుజూరాబాద్ జిల్లా కావాలనో, లేక హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ కావాలనో ఆయన రాజీనామా చేశారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. సొంత లాభం పొందేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేసి ఉప ఎన్నికలు రప్పించారని హరీశ్ రావు విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా గురువారం హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Also Read: ఏపీకి వర్ష సూచన, కొన్ని చోట్ల భారీ వానలకు ఛాన్స్.. తెలంగాణలో ఇలా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. స్వార్థం కోసం జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో వ్యక్తి లాభం కావాలా? వ్యవస్థ లాభం కావాలా? తేల్చాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ ఎందుకు బీజేపీలో చేరారని.. అసలు ఆ పార్టీ ప్రజలకు ఏం చేసిందని హరీశ్ రావు ప్రశ్నించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ప్రజలకు బీజేపీ వాతలు పెడుతోందని.. పలువురు ఆడవారు బతుకమ్మల మధ్య సిలిండర్లు పెట్టి నిరసన తెలిపారని మంత్రి గుర్తు చేశారు. గ్యాస్ సిలిండర్ ధర త్వరలో వెయ్యి రూపాయులు అవ్వనుందని అన్నారు. వారం వారం బీజేపీ గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు పెంచూతూ సామాన్యుడి నడ్డివిరుస్తోందని విమర్శించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెంచే బీజేపీకి ఓటు వేద్దామా? లేక సుపరిపాలన అందించే టీఆర్ఎస్‌కు ఓటు వేద్దామని ప్రశ్నించారు. ఈటల తనను చూసే పనులు జరుగుతున్నాయని చెప్తున్నాడని.. మరి కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ ఎవరిని చూసి కేసీఆర్ ఇచ్చారని హరీశ్ రావు ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆడ పిల్లల పెళ్లికి రూ.లక్ష సాయం చేస్తున్నారా అని నిలదీశారు. ఆరు సార్లు ఈటలను ఎమ్మెల్యేగా గెలిపించారని.. ఆయన ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని అన్నారు. గెల్లు శ్రీనివాస్‌ని ఒక్కసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.
Also Read: పాతబస్తీలో అసదుద్దీన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి అలా చేస్తే తీవ్ర పరిణామాలని హెచ్చరిక
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.