Hyderabad Fraud: ఆ ఫోటోకు టెంప్ట్ అయిన గుంటూరు యువకుడు.. రూ.1.20 కోట్లు హుష్‌కాకీ.. బాధితుడు లబోదిబో..
హైదరాబాద్‌కు చెందిన యువతి గుంటూరుకు చెందిన వ్యక్తిని మోసం చేసింది. ఏకంగా రూ.1.20 కోట్లు కాజేసింది. పూర్తి వివరాలివీ..
కొంత మంది యువతులు, మహిళలు పలువురిని వలపు వలలోకి దింపి వారిని ఏ తరహాలో మోసం చేస్తారో అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు వెలుగులోకి వచ్చాయి. అయినా కొంత మంది అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేసి చేతులారా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సైబర్ క్రైమ్ ఘటన ఒకటి హైదరాబాద్‌లోనే జరిగింది. హైదరాబాద్‌కు చెందిన యువతి గుంటూరుకు చెందిన వ్యక్తిని మోసం చేసింది. ఏకంగా రూ.1.20 కోట్లు కాజేసింది. పూర్తి వివరాలివీ..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తియ్యగా మాట్లాడుతూ, అందమైన యువతి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టిన యువతి మాయలో పడి ఓ వ్యక్తి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అతడి నుంచి ఏకంగా రూ.1.20 కోట్లు కాజేసింది. గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు విడతల వారీగా వివిధ కారణాలు చెప్పి ఈ డబ్బులు ఆయన నుంచి లాగింది. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బుధవారం అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటురు జిల్లాకు చెందిన వి.సుబ్బా రెడ్డి అనే వ్యక్తికి బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాయిరాంతో గతంలో కొంత పరిచయం ఉంది. గత డిసెంబర్ నెలలో వారిద్దరూ అనుకోకుండా చాలకాలం తర్వాత కలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయిరాం తన మరదలు అయిన అర్చన అనే 24 ఏళ్ల యువతిని ఫోన్ ద్వారా పరిచయం చేశాడు. ఆమె బ్యూటీ పార్లర్ నడుపుతుందని తన వ్యాపార విస్తరణ పెట్టుబడి కోసం ఏదైనా సహాయం చేయాలని కోరుతూ సుబ్బా రెడ్డికి ఆమె ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత సుబ్బారెడ్డి, అర్చన ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే అర్చన తన ఫొటోకు బదులు అందమైన అమ్మాయి ఫొటోను డిస్‌ప్లే పిక్చర్‌గా ఉంచింది. ఆ ఫోటో ఆమెదే అని సుబ్బా రెడ్డిని నమ్మాడు.
Also Read: మళ్లీ భారీగా ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొద్దిరోజులుగా తగ్గని రేట్లు, తాజా ధరలు ఇలా..
తరచు సుబ్బారెడ్డికి ఫోన్ చేసి బ్యూటీపార్లర్, ఇతర అవసరాల పేరుతో విడతలవారీగా అన్‌లైన్ ద్వారా లక్షల నగదు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. అయితే, సుబ్బా రెడ్డి ఆమెను నేరుగా కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ, ఆమె ఏవేవో సాకులు చెబుతూ తప్పించుకునేది. ఈ ఏడాది ఆగస్టు వరకూ ఇలాగే తిరిగేది. ఆమె కోసం గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సుబ్బా రెడ్డి కలిసేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఫోన్ ద్వారా ఒత్తిడి చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. వారు అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించగా.. బాధితుడు బుధవారం అంబర్ పేట పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు అర్చన, అమె బావ సాయిరాం, ప్రియుడు అనిల్ కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: ఏపీకి వర్ష సూచన, కొన్ని చోట్ల భారీ వానలకు ఛాన్స్.. తెలంగాణలో ఇలా..