Adilabad News: నాలుగున్నరేళ్ల బుడతడి అపర మేథస్సు - ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం, గోల్డ్ మెడల్ కైవసం
India Book Of Records: ఆదిలాబాద్‌కు చెందిన నాలుగున్నరేళ్ల బుడతడు తన అద్భుత ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడమే కాక గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
Adilabad Student Got India Book Of Records Gold Medal: ఆదిలాబాద్ జిల్లాకు (Adilabad District) చెందిన నాలుగున్నరేళ్ల బుడతడు తన అపార మేథస్సుతో అబ్బురపరుస్తున్నాడు. వివిధ దేశాల పేర్లు, పతాకాలు, అబ్రివేషన్స్, ఇంకా ఇతర జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన విషయాలనే కాకుండా ఆధ్యాత్మిక విషయాలను కూడా అడిగిన వెంటనే అలవోకగా చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ద్వారా బంగారు పతకాన్ని సైతం అందుకున్న చిన్నారిపై ABP దేశం ప్రత్యేక కథనం.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ కాలనీలో నివాసముండే జాల్ పేట్ రాజు, జహ్నావి దంపతుల కుమారుడు సాయి లోహిత్. నాలుగున్నరేళ్ల ఈ బుడతుడు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. లోహిత్ తండ్రి రాజు మాజీ సైనిక ఉద్యోగి. అయితే రెండు సంవత్సరాల క్రితం తల్లి జాహ్నవి ఇంటి వద్ద కొడుకు లోహిత్‌తో హోం వర్క్ చేయిస్తుండగా చెప్పిన సమాధానాలను మరుసటి రోజు పూసగుచ్చినట్లు చెప్పాడు. దీంతో తన బిడ్డ ఏకసంతాగ్రహి అని గ్రహించిన అతని తల్లి ఆసక్తిగా పలు విషయాలను నేర్పించారు. వీటన్నింటినీ గుర్తించుకున్న అతను 5 రోజుల్లోనే అన్నింటినీ చెప్పాడు.
అద్భుత మేథస్సు
ప్రపంచంలోని ఏడు వింతలు, జీ 20 దేశాల పేర్లు, ప్రపంచంలోని 195 దేశాల పేర్లు, 40 అంతరిక్ష ఎలిమేట్స్, ప్రపంచ వింతలు, ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల పేర్లు, మన దేశంలోని రాష్ట్రాలు, భాషలు, స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు, దేశాలు, వాటి రాజధానులు, సప్త సముద్రాలు, సప్త మహర్షులు, తెలుగు నెలలు ఇలా అనేక విషయాలను తడుముకోకుండా చెబుతున్నాడు. గ్లోబ్ చేతికిస్తే ఏ దేశం ఎక్కడ ఉందో చూపిస్తాడు. జాతీయ పతాకాలను చూపిస్తే అది ఏ దేశానికి చెందిందో చెప్పేస్తాడు. మొత్తం 195 దేశాల పేర్లను సైతం ఇట్టే చెప్పేస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినవే కాకుండా ఆధ్యాత్మిక విషయాలను కూడా తడుముకోకుండా.. విష్ణుమూర్తి దశావతారాల గురించి, తెలుగు నెలల పేర్లు, నవవిధ భక్తి మార్గాల గురించి చెబుతూ అబ్బురపరుస్తున్నాడు. లోహిత్ ఇలా చిరుప్రాయంలోనే ప్రతిభను చాటి ఇటీవలే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కావడమే కాకుండా బంగారు పతాకాన్ని సాధించాడు. చిన్నారి ప్రతిభను గుర్తించిన మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందించారు.
స్థానికంగా ఉన్న పలు పాఠశాలల్లో లోహిత్‌ను విద్యార్థులకు పరిచయం చేస్తూ అతని ప్రతిభ అందరికీ తెలియజేస్తున్నారు. లోహిత్ విజయాల పట్ల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత అత్యున్నత స్థానాలకు లోహిత్ చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.