Gabbar Singh Actor Remuneration: 'రక్త చరిత్ర'కు 40 వేలే... 'గబ్బర్ సింగ్'కు 40 లక్షలు... అదీ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తే యాక్టర్ రేంజ్
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాకు రూ. 40 వేల పారితోషికం మాత్రమే అందుకున్న ఓ బాలీవుడ్ నటుడి రెమ్యూనరేషన్ ... ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాతో ఏకంగా రూ. 40 లక్షలకు పెరిగిందట.

తెలుగు రాకపోయినా టాలీవుడ్ ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేశారు ఓ హిందీ నటుడు. విలన్ గా ఆయన ఇప్పటిదాకా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఆర్జీవి 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఆ తర్వాత 'గబ్బర్ సింగ్' కోసం ఏకంగా 10 రెట్లు ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్నారట. తాజా ఇంటర్వ్యూలో "ఆర్జీవి సినిమాలో నటిస్తే రూ.40,000... కానీ ఆ తర్వాత 'గబ్బర్ సింగ్' ద్వారా ఏకంగా 40 లక్షలు పారితోషకంగా అందుకున్నాను" అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు అభిమన్యు సింగ్.
అభిమన్యు సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్
Abhimanyu Singh First Remuneration: బీహార్ కి చెందిన అభిమన్యు సింగ్ 'అక్స్' అనే హిందీ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి అడగ్గా... 'అక్స్' మూవీకి కేవలం రూ.11,000 పారితోషంగా ఇచ్చారని చెప్పుకొచ్చారు ఆయన. నిజానికి సినిమాల్లో స్టార్ యాక్టర్లకు రెమ్యూనరేషన్స్ బాగానే ఉంటాయి. ఆ రెమ్యూనరేషన్ భారీగా పెరగాలి అంటే ఓ బ్లాక్ బస్టర్ మూవీతో మంచి గుర్తింపు రావాల్సిందే. లేదంటే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత పవర్ ఫుల్ రోల్స్ చేసినా హిట్టు లేదంటే పారితోషికం తక్కువే ఉంటుంది. ఇక అభిమన్య సింగ్ నటించిన 'అక్స్' మూవీ 2001లో రిలీజ్ అయింది. ఇందులో ఆయన ఫస్ట్ టైం ఇన్స్పెక్టర్ గా నటించారు. ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ, సినిమా సినిమాకు ఎదుగుతూ స్టార్ విలన్ గా మారారు.
Abhimanyu Singh Remuneration For Gabbar Singh: 2010లో రిలీజ్ అయిన గులాల్, రక్త చరిత్ర వంటి సినిమాలు అభిమన్యు సింగ్ కు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఫలితంగా తెలుగు, తమిళ, హిందీ, గుజరాతి భాషల్లో నటించే అవకాశం దక్కింది. ముందుగా టాలీవుడ్లో 'నేను నా రాక్షసి' చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది ఆయనకు. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' సినిమాలో విలన్ పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు అభిమన్యు సింగ్. ఇందులో ఆయన సిద్ధప్ప నాయుడిగా నెగిటివ్ రోల్ లో ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఇంకేముంది అప్పటి నుంచి ఈ నటుడుకి టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఫలితంగా పండగ చేస్కో, జై లవకుశ, అమర్ అక్బర్ ఆంటోనీ, ముకుంద వంటి భారీ సినిమాల్లో నటించి మెప్పించారు. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' మూవీతో తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు అభిమన్యు సింగ్. "రక్త చరిత్ర సినిమా మొత్తానికి 40 వేలు మాత్రమే పారితోషికం తీసుకుంటే, గబ్బర్ సింగ్ లో నటించినప్పుడు తన పారితోషికం ఏకంగా 40 లక్షలకు పెరిగింది" అని తెలిపారు.
మరోసారి పవన్ తో అభిమన్యు సింగ్
ఈ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'రూల్స్ రంజన్' సినిమాతో కొన్ని రోజుల క్రితం ప్రేక్షకులను అలరించారు. చివరగా ఆయన 'లైలా' మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేస్తే, ఆయనకు లైన్ వేసే ఓల్డ్ సిటీ రౌడీ క్యారెక్టర్ లో నటించి మెప్పించారు ఈ నటుడు. అభిమన్యు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'ఓజీ' సినిమాతో పాటు 'లూసిఫర్' సీక్వెల్లో నటిస్తున్నారు.
Also Read: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?





















