Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్ జాతీయ సంతాప దినం!
Sharif Usman Hadi:DUCSU నాయకురాలు ఫాతిమా తస్నీమ్ జుమా మాట్లాడుతూ, "కుటుంబ అభ్యర్థన మేరకు హదీని నజ్రుల్ పక్కనే ఖననం చేస్తున్నారు."

Sharif Usman Hadi: అగ్ని గుండంగా మారిన బంగ్లాదేశ్‌లో నేడు జాతీయ సంతాప దినం. షరీఫ్ ఉస్మాన్ హదీ మరణంపై దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ జాతీయ సంతాప దినాన్ని ప్రకటించారు. హదీ మృతదేహం ఇప్పటికే సింగపూర్ నుంచి దేశానికి చేరుకుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పార్లమెంట్ భవనం దక్షిణ ప్లాజాలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆ తర్వాత, ఢాకా విశ్వవిద్యాలయంలో, దేశ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కన హదీని ఖననం చేస్తారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు నజ్రుల్ పక్కనే హదీని ఖననం చేయాలని నిర్ణయించారు.
ఢాకా యూనివర్సిటీ సెంట్రల్ స్టూడెంట్స్ యూనియన్ (DUCSU) నాయకురాలు ఫాతిమా తస్నిమ్ జుమా మాట్లాడుతూ, "కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు నజ్రుల్ పక్కనే హదీని ఖననం చేస్తున్నారు." గత డిసెంబర్ 12న సెంట్రల్ ఢాకాలో రిక్షాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు, హదీపై కాల్పులు జరిగాయి. బుల్లెట్ నేరుగా తలకు తగిలింది. మొదట ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు మెదడు ఆపరేషన్ జరిగింది. పరిస్థితి విషమించడంతో సింగపూర్‌లోని Evercare Hospitalకు తరలించారు. గురువారం రాత్రి సుమారు 9:45 గంటలకు అక్కడే ఆయన మరణించారు. ఆయన మరణంతో బంగ్లాదేశ్ మళ్లీ అల్లకల్లోలంగా మారింది.
హదీ మరణవార్త తెలియగానే గురువారం ఢాకాలో నిరసన ర్యాలీలు జరిగాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వేల మంది రోడ్లపైకి వచ్చారు. క్రమంగా ఢాకా వెలుపల, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఉద్రిక్తతలు వ్యాపించాయి. భారతీయ వీసా కేంద్రం బయట కూడా నిరసనలు తెలిపారు. దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఆస్తులు విధ్వంసం జరిగింది. ఆ తర్వాత ఆ నిరసనల్లో నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) సభ్యులు కూడా చేరారు, ఇది స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ (SAD)అనుబంధ సంస్థ. "నువ్వెవరు, నేనెవరు, హదీ, హదీ," "మనమందరం హదీ అవుదాం, తుపాకీ ముందు నిలబడి గట్టిగా చెబుదాం" వంటి నినాదాలు వినిపించాయి.
గత సంవత్సరం రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి SAD నాయకత్వం వహించింది. SAD తరపున భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. హదీని హత్య చేసిన నేరస్థులు భారతదేశంలోకి పారిపోయి, అక్కడ ఆశ్రయం పొందారని ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్‌లో భారత హై కమిషన్‌ను మూసివేయాలని యూనస్ ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాత సమయం గడిచేకొద్దీ, ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడం ప్రారంభించాయి. మయన్‌సింగ్‌లోని బాలుకాలో దీపుచంద్ర దాస్ అనే యువకుడి ఇంట్లోకి దుండగులు చొరబడి దాడి చేశారు. కొట్టి చంపి, దీపు మృతదేహాన్ని చెట్టుకు కట్టి కాల్చివేశారు. బంగ్లాదేశ్‌లోని రెండు ప్రముఖ వార్తాపత్రికలు, 'ప్రథమ్ ఆలో', 'డైలీ స్టార్' కార్యాలయాలపై దాడి జరిగింది. ధన్మండిలోని బంగ్బంధు షేక్ ముజీబుర్ రెహమాన్ ఇంటిని ధ్వంసం చేశారు. ఢాకాలోని 'ఛాయానట్ సంస్కృతి భవనం'పై కూడా దాడి జరిగింది. విధ్వంసం తర్వాత అగ్నిప్రమాదం కూడా జరిగింది. ఒక జర్నలిస్టును కూడా కాల్చి చంపారు దుండగులు. బుల్లెట్ గాయాలతో మరో జర్నలిస్టు ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి ఎలా ఉందంటే, యూనస్ ప్రభుత్వం కూడా హింసను తీవ్రంగా ఖండించింది.
కానీ హదీ మరణం చుట్టూ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సామాన్య ప్రజలపై హదీ మరణం ఎంత ప్రభావం చూపింది? సోషల్ మీడియాలో హదీకి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి, అందులో బహిరంగ సభల్లో నజ్రుల్ కవితలను చదువుతున్నట్లు వినిపించింది. అయితే బంగ్లాదేశ్ రాజకీయాల్లో హదీపై వివాదాలు కూడా ఉన్నాయి. బరిసాల్‌కు చెందిన హజీ ఢాకా విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో చదువుకున్నారు. ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, కోచింగ్ సెంటర్‌లో ఇంగ్లీష్ బోధించేవారు. గత సంవత్సరం హసీనా ప్రభుత్వం పతనం తర్వాత అవామీ లీగ్‌పై నిషేధం విధించాలని ఆయన గట్టిగా వాదించారు, అలాగే అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ తీర్పులను కూడా విమర్శించారు. గతంలో ధన్మండిలోని బంగ్బంధు ఇంటిపై దాడి జరిగినప్పుడు కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారని తెలిసింది. గోపాల్‌గంజ్‌లో నేషనల్ సిటిజన్ పార్టీ నాయకులపై దాడి జరిగినప్పుడు, ఆయన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా వినిపించింది.
అయితే యువ విద్యార్థులలో ,సోషల్ మీడియాలో హదీకి ప్రజాదరణ పెరిగింది. ముఖ్యంగా భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు హదీని అందరికీ పరిచయం చేశాయి. గత సంవత్సరం జూలై తిరుగుబాటు తర్వాత 'ఇంకిలాబ్ మంచ్' అనే రాజకీయ, సాంస్కృతిక సంస్థను కూడా హదీ స్థాపించారు. బంగ్లాదేశ్ ప్రస్తుత రాజకీయాల్లో క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకోవడం ప్రారంభించారు. బంగ్లాదేశ్ రాబోయే ఎన్నికల్లో కూడా పాల్గొనే ప్రణాళికలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఢాకా-8 నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ప్రచారం చేస్తున్నప్పుడే ఆయనపై కాల్పులు జరిగాయి. అవామీ లీగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయని మరణానికి కొన్ని రోజుల ముందు సోషల్ మీడియాలో రాశారు. దేశం, విదేశాల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తన ఇంటికి నిప్పు పెట్టడం, తల్లి, సోదరీమణులు, భార్యను అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని కూడా హదీ ఆరోపించారు. అందుకే తన మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.





















