CM Chandrababu: బనకచర్లకు గోదావరి నీళ్లు తరలింపు - తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు రిక్వెస్ట్
Andhra Pradesh News | కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డుచెప్పలేదు, బనకచర్లకు గోదావరి నీళ్లపై తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

అమరావతి: గోదావరి నీళ్లు బనకచర్ల (Bhanakacherla Project)కు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు, కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో వృధాగా కలిసే గోదావరి నీళ్లు వాడుకుంటే ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని.. తెలంగాణ (Telangana) ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే అందుకు తాము అడ్డు చెప్పలేదన్నారు. తెలుగు ప్రజలెక్కడున్నా వారి కోసం టీడీపీ పనిచేస్తుందని, తెలుగుజాతి కోసం పుట్టింది తమ పార్టీ అన్నారు. ఎన్డీయే గెలుపు రాష్ట్ర పునర్‌నిర్మాణానికి సంజీవనిలా పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నటికీ ఐకమత్యంతో మెలగాలని సూచించారు. ఈ మూడు కూటమి పార్టీలు ప్రజల్లో ఉంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని, శాశ్వతంగా ఎన్డీయేనే విజయాలు సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్సీలకు అభినందనలు
టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎన్డీయే కూటమి నుంచి విజయం సాధించి ఎమ్మెల్సీలు పేరాబత్తలు రాజశేఖరం, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లకు అభినందనలు. 2024 ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో, 93 శాతం స్ట్రైక్‌రైట్‌తో గెలిచాం. తాజాగా పోటీ చేసిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించాం. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా నెగ్గిన గాదె శ్రీనివాసులుకు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని మనం పిలుపునిచ్చాం. 2023లో జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాం. ఎన్నికల పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటును కేటాయిస్తున్నామని చెబితే ఆలపాటి రాజేంద్ర ఎదురు చెప్పకుండా సహకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ కూడా కష్టపడి భారీ మెజారిటీ తెచ్చి మాట నిలబెట్టుకున్నారు. పార్టీకోసం పని చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. ఆయన విజయం సాధించారు.’
కూటమికి తిరుగుండదు
కూటమి పార్టీలు కలిసుంటే ఎప్పటికీ తిరుగుండదు. కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అధికారంలోకి వచ్చాక మన విజయం కోసం పనిచేసిన వారిని మరిచిపోకూడదు. రాష్ట్రాన్ని పునర్‌నిర్మించాల్సిన అవసరం ఉంది, కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని 2024 ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలకు ఒకే పిలుపిచ్చాం. జనసైనికులను పవన్ కళ్యాణ్ కోరితే వారు కూడా అద్భుతంగా పని చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపుతో బీజేపీ నేతలు, కార్యకర్తలు బాగా పని చేశారు. దాంతో సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పనిచేసి ఘన విజయం సాధించాం - చంద్రబాబు
వృధా నీటిని తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు
‘పోలవరం ప్రాజెక్టు నీళ్లు బనజకచర్లకు తీసుకెళ్తాం. బంగాళాఖాతంలో సముద్రంలోకి పోయే వృథానీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు అని తెలంగాణకు ప్రజలను కోరుతున్నా. తెలుగుజాతి కోసం మా పార్టీ పుట్టింది. ఏపీ విభజన సమయంలోనూ 2 ప్రాంతాలు సమానమని, 2 కళ్లు అని, సమన్యాయం చేయాలని కేంద్రాన్ని అడిగాను. ఇక్కడ అధికారం రాగా, తెలంగాణలో 20 స్థానాలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టుకోవాలని సైతం చెప్పా. ఏటా 1000 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే హక్కు లేదని చెప్పడం సరికాదని’ చంద్రబాబు పేర్కొన్నారు.
మూడుముక్కలాటతో సర్వనాశనం చేశారు
గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటతో సర్వనాశనం చేసింది. రాజధాని అమరావతిని స్మశానం అన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్రం రూ.15 వేల కోట్లు అందించింది. 72 శాతం పనులు పూర్తయిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. మనం మళ్లీ గెలిచింటే 2020కి పోలవరం పూర్తయ్యేది. కానీ చేతకాని వైసీపీ ప్రభుత్వం వల్ల డయాఫ్రంవాల్ కొట్టుకుపోయింది. కేంద్రమంత్రిని కలిసి సహకరించాలని ఒత్తిడి తెస్తే.. కేంద్రం ముందుకొచ్చి పోలవరం ప్రాజెక్టు కోసం రూ.12,150 కోట్లు కేటాయించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏపీ సెంటిమెంట్, విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదం అని నిర్లక్ష్యం చేయొద్దని కోరితే కేంద్రం రూ.11,400 కోట్లు కేటాయించింది. విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. రైల్వేజోన్‌కు కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం... దాంతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు చంద్రబాబు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

