Actress Ranya Rao Arrest: బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన కన్నడ నటి, ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్!
Ranya Rao Remand For 14 Days | దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రన్యా రావు అడ్డంగా దొరికిపోయారు. ఆమెకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Actress Ranya Rao News Updates | బెంగళూరు: సాధారణంగా ఎయిర్ పోర్టులో బంగారం స్మగ్లింగ్ పై నిఘా అధికంగా ఉంటుంది. డ్రగ్స్ పై సైతం తనిఖీలు జరుగుతాయి. ఈ క్రమంలో కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా దాదాపు 15 కేజీల బంగారం బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా రావు పట్టుబడ్డారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆమెను బెంగళూరు ఎయిర్ పోర్టు (Kempegowda International Airport)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది.
దుబాయ్ ట్రిప్స్ సీక్రెట్ ఇదేనా..
కన్నడ నటి రన్యా రావు గత కొంతకాలం నుంచి తరచుగా దుబాయ్ పర్యటనకు వెళ్లి వస్తున్నారు. ఎంతగా అంటే.. రెండు వారాల్లోనే 4 సార్లు సైతం ఆమె దుబాయ్ వెళ్తున్నారు. దాంతో ఆమె కదలికలపై ఎయిర్ పోర్ట్ అధికారులు, డీఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. నటి రన్యా రావు తరచుగా దుబాయ్ వెళ్లి రావడం వెనుక మిస్టరీ ఛేదించాలని భావించిన అధికారులు అందులో సక్సెస్ అయ్యారు. సోమవారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న నటి రన్యా రావును తనిఖీ చేయగా బంగారం విషయం వెలుగు చూసింది. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో దుస్తుల్లో దాచి దుబాయ్ నుంచి తీసుకొచ్చినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఆమె వద్ద నుంచి ఏకంగా 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, రన్యా రావును అరెస్ట్ చేశారు. ఆ బంగారం విలువ రూ.12 కోట్లు అని అధికారులు అంచనా వేశారు. గత 15 రోజుల్లో రన్యా రావు 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చారని.. గతంలోనూ ఆమె స్మగ్లింగ్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యా రావును మంగళవారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి రన్యా రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అంతకుముందు ఆమెకు బౌరింగ్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించారు. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని, కేసు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని డీఆర్ఐ అధికారులు కోరుతున్నారు.
రన్యా రావు బ్యాగ్రౌండ్ ఏంటీ..
చిక్కమగళూరుకు చెందిన రన్యా రావు 2014లో కిచ్చా సుదీప్ సరసన నటించిన మాణిక్య మూవీతో కన్నడ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. పటాకీ, వాఘా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. రన్యా రావు తండ్రి రామచంద్రరావు సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన కర్ణాటక రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా సేవలు అందిస్తున్నారు. దుబాయ్ పర్యటన నుంచి వస్తున్న సమయంలో తాను డీజీపీ ర్యాంకు ఐపీఎస్ కుమార్తెనని పోలీసులకు ఫోన్ చేసేవారు. దుబాయ్ నుంచి తిరిగొచ్చే ముందుగానే కన్నడ నటి రన్యా రావు పోలీసులకు ఫోన్ చేసి.. తనకు ఎస్కార్ట్ గా పోలీసులు వచ్చి ఇంటి వద్ద డ్రాప్ చేయాలని కోరేవారు. తరుచుగా ఆమె దుబాయ్ వెళ్లిరావడంపై అనుమానం వచ్చి తనిఖీ చేసిన డీఆర్ఐ అధికారులు రన్యా రావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారాన్ని బయటపెట్టారు.
Also Read: Crime News: గోవాలో ఘనంగా వివాహం, కానీ నెలల వ్యవధిలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!






















