Doping Test: డోపింగ్ కలకలం.. రోహిత్‌పై ఆరు సార్లు.. కోహ్లీపై సున్నా
భారత అథ్లెట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిరంతర పరిశీలనలో ఉన్నారని, కానీ చాలా మంది పురుష క్రికెటర్లు పరీక్షించబడలేదంటూ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీస్థ ప్రచురించిన నివేదిక కలకలం రేపుతోంది.
ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది. భారత ఒలింపిక్ అథ్లెట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిరంతర పరిశీలనలో ఉన్నారని, కానీ చాలా మంది పురుష క్రికెటర్లు పరీక్షించబడలేదంటూ ఆ సంస్థ ప్రచురించిన నివేదిక కలకలం రేపుతోంది. ‘బయటపడని సాక్ష్యాలు’ పేరుతో భారత్‌కు చెందిన క్రికెటర్లు, అథ్లెట్లపై గత మంగళవారం భారత డోపింగ్ నిరోధక కార్యక్రమంపై ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నివేదిక ప్రచురించింది. ఆర్టీఐ చట్టం కింద 2021-22 మధ్య భారత క్రికెటర్లపై జరిగిన డోపింగ్ పరీక్షల వివరాలు వెలుగులోకి వచ్చాయి.. ఆ వివరాలు ఒకసారి పరిశీలించండి.
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) అందించిన డేటా ప్రకారం, 2021 మరియు 2022లో మొత్తం 5,961 పరీక్షలు జరిగాయి. వాటిలో కేవలం 114 మాత్రమే క్రికెటర్లపై జరిగాయి. దీనికి విరుద్ధంగా, అథ్లెటిక్స్‌లో 1,717 పరీక్షలు నిర్వహించారు. అన్ని క్రీడలలో అథ్లెటిక్సే నుంచే అధికంగా ఉన్నారు. టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మను రెండేళ్లలో అత్యధికంగా ఆరుసార్లు డోప్ కంట్రోల్ అధికారులు పరీక్షించారు. ముంబై , అహ్మదాబాద్ , చెన్నై, UAE లో ఈ పరీక్షలు జరిగాయి. రిషబ్ పంత్ , సూర్యకుమార్ యాదవ్, చెతేశ్వర్ పుజారా వంటి ఏడుగురు ఆటగాళ్లను ఒక్కసారి మాత్రమే పరీక్షించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో ఒప్పందం చేసుకున్న 25 మంది పురుష ఆటగాళ్లలో 12 మందికి నాడా అసలు పరీక్షలు నిర్వహించలేదు. టెస్ట్ చేయని క్రికెటర్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ , ప్రస్తుత పరిమిత ఓవర్ల కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ అర్ష్‌దీప్ సింగ్, బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్, శ్రీకర్ భరత్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. మహిళా క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానను డోపింగ్ అధికారులు గరిష్టంగా 3 సార్లు పరీక్షించారు.
ఈ డేటా ఆటగాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని సూచించదు. అయినా డోపింగ్‌కు పాల్పడేవారిని పట్టుకోవడంలో NADA తగినంతగా పని చేయడం లేదని ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ యొక్క వాదనను ఇది మరింత నొక్కి చెబుతోంది. దేశంలోని ఇటీవల పట్టుబడిన ఒలింపిక్ అథ్లెట్లపై నాడా నిరంతర పరిశీలన, పత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అయతే క్రికెటర్లపై అలా పనిచేయడం లేదనే వాదన వినిపించింది. డోపింగ్ పరీక్షల కోసం కొంతమంది స్టార్ క్రికెటర్లు నమూనాలను అందించమని అడగలేదు.
ఉదాహరణకు, జనవరి 2021 మరియు డిసెంబర్ 2022 మధ్య భారత డోపింగ్ నిరోధక అధికారులు ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియా నమూనాల కోసం 18 సార్లు వెళ్లారు. అతని మూత్రం రక్త నమూనాలను సేకరించడానికి న్యూ ఢిల్లీ, సోనేపట్, హర్యానాలోని శిక్షణా కేంద్రాలకు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. అదే సమయంలో, NADA అధికారులు మరొక ఒలింపిక్ రజత పతక విజేత, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానును ఎనిమిది సార్లు ఆకస్మికంగా సందర్శించి , పాటియాలా, గాంధీనగర్, బర్మింగ్‌హామ్‌లో ఆమె నమూనాలను సేకరించారు . అలాగే టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను పాటియాలా, ఫిన్లాండ్, USA వరకు అనుసరించారు, ఈ ప్రక్రియలో ఐదుసార్లు అతన్ని పరీక్షించారు. ఈ పరీక్షలు అన్నీ పోటీలు పూర్తి అయ్యాక నిర్వహించారు.
భారతకు ఆవల ఇండియన్ క్రికెటర్ల నమూనా సేకరణ గణాంకాలు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇతర దేశాల క్రికెటర్లతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. WADA గణాంకాల ప్రకారం, 2021లో UK ఏజెన్సీ తన క్రికెటర్లపై 96 పోటీ పరీక్షలను నిర్వహించగా, ఆస్ట్రేలియా 69 టెస్టులు నిర్వహించింది. భారతదేశంలో ఆ సంఖ్య 12కి చేరింది. గోప్యత, భద్రతా సమస్యలను ఉటంకిస్తూ తమ ఆచూకీని పంచుకోవడానికి ఇష్టపడని క్రికెటర్లను గతంలో చికాకుపరిచిన అంశాలల్లో డోపింగ్ టెస్టుల నిర్వహణ ఒకటి. పెరుగుతున్న పనిభారం, ఏడాది పొడవునా ప్రయాణం, చాక్-ఎ-బ్లాక్ క్యాలెండర్ అంతర్జాతీయ క్రికెటర్‌లకు ఆటల మధ్య కోలుకోవడానికి చాలా తక్కువ సమయాన్ని ఇస్తుంది.అంతర్జాతీయ క్రికెట్, మూడు ఫార్మాట్లు, సుదీర్ఘమైన IPL ఆడేందుకు క్రికెటర్లు గతంలో కంటే ఫిట్‌గా ఉండాలి. ఈ నేపథ్యంలో బలమైన డోపింగ్ నిరోధక యంత్రాంగాన్ని కలిగి ఉండటం అత్యవసరం, ఇందులో భాగంగా ఆటగాళ్లను ఎప్పుడైనా, ఎక్కడైనా పరీక్షించవచ్చు. ఇది మైదానంలో మంచి క్రీడా వాతావరణాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది.