FIFA World Cup 2022: జపనీస్ గ్రేట్‌నెస్! ఖతార్ మ్యాచ్ తర్వాత ఫిఫా స్టేడియాల్లో చెత్త శుభ్రం చేసిన ఫ్యాన్స్
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ 2022లో జపాన్ ఫ్యాన్స్ అందరి హృదయాలను గెలిచారు. మ్యాచుల తర్వాత స్టేడియం మొత్తం సీట్ల పక్కన పోగుపడ్డ చెత్త, చెదారాన్ని శుభ్రం చేస్తున్నారు.
FIFA World Cup 2022: ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా జపనీయులు తమదైన ముద్ర వేస్తుంటారు! అన్ని దేశాల వారితో వెంటనే కలిసిపోతారు. అక్కడి సంస్కృతిని గౌరవిస్తారు. మనుషులను గౌరవిస్తారు. వీలైనంత వరకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తారే తప్ప అస్సలు హాని తలపెట్టరు.
ఖతార్‌లో నిర్వహిస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2022లోనూ ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. ఖతార్, ఈక్వెడార్ ఆరంభ మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్ అభిమానులు అందరి హృదయాలను గెలిచారు. పోరు ఆస్వాదించాక అందరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. జపనీయులు మాత్రం అక్కడే ఉన్నారు. స్టేడియం మొత్తం సీట్ల పక్కన పోగుపడ్డ చెత్త, చెదారాన్ని సంచుల్లో సేకరించారు.
👍🏽👍🏽👍🏽 They said they weren’t doing it for the cameras, but I’m glad the cameras still spotted them. The values they’re displaying are worthy of a global audience. #WorldcupQatar2022 pic.twitter.com/zsijHH2qsX
— anand mahindra (@anandmahindra) November 22, 2022
ఇతరులు తాగి పడేసిన కూల్‌డ్రింక్ టిన్నులు, ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను జపాన్ అభిమానులు శుభ్రం చేశారు. ఇతర దేశాల జాతీయ పతాకాలను జాగ్రత్తగా సేకరించారు. వీరు చేస్తున్న పని స్థానిక మీడియాను ఆకర్షించింది. అందులో ఒకరు ఎవరు మీరు? ఎందుకిలా చేస్తున్నారు? కెమెరాల్లో పడేందుకేనా అని ప్రశ్నించగా నిజాయతీగా సమాధానం ఇచ్చారు. చుట్టు పక్కల ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తమకు అలవాటని, ఎక్కడా చెత్తాచెదారం ఉన్నా నచ్చదని చెప్పారు. కెమెరాల్లో పడేందుకు ఇలా చేయడం లేదని, మనస్ఫూర్తిగానే శుభ్రం చేస్తున్నామని వెల్లడించారు.
ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు వారి మానవతా స్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఈ వీడియోను ట్వీట్ చేశారు. 'కెమెరాల్లో కనిపించడం కోసం ఇదంతా చేయడం లేదని వారు చెబుతున్నారు. అయినప్పటికీ వారిని కెమెరాల్లో బంధించినందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ అభిమానులకు వారు ప్రదర్శిస్తున్న విలువలు ఎంతో ఉన్నతమైనవి' అని ఆయన ప్రశంసించారు.
View this post on Instagram
View this post on Instagram