Dussehra 2022: అష్టదరిద్రాల తీర్చే మహాగౌరి, దుర్గాష్టమి రోజు నవదుర్గల్లో ఎనిమిదవది మహాగౌరి
Navratri 2022 Mahagauri: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మ అనుగ్రహించే రూపం మహాగౌరి దుర్గ. మహాగౌరి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే....
Navratri 2022 Mahagauri: తెలుపు లేదా ఎరుపు రంగుని గౌరవర్ణం అంటారు. పార్వతీదేవి శివుని కోసం ఘోర తపస్సు చేయగా..ఆ వేడికి ఆమె శరీరం నలుపెక్కి పోయిందట. అప్పుడు పరమేశ్వరుడు ఆమెను గంగాజలంతో అభిషేకించగానే తిరిగి గౌర వర్ణాన్ని పొందింది. అలాగే ఈ తల్లినా ఆరాధించే భక్తులు సకల పాపాలు, సకల భయాలు, అష్టదరిద్రాల నుంచి పునీతులవుతారని విశ్వాసం
మహాగౌరీ దుర్గా నవదుర్గల అలంకారాల్లో ఎనిమిదవ అవతారం. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ అమ్మవారు తీరుస్తుంది. జీవితంలో కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చని భక్తుల విశ్వాసం. మహాగౌరీదేవి నాలుగు చేతులుతో ఉంటుంది. కుడిచేయి అభయముద్రలో ఉండగా, కింద కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో ఢమరుకం ఉంటాయి. పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది.మహాగౌరి అనే పేరు గొప్ప తెలుపు అని అర్ధం. దుర్గాదేవి తెలుపు రంగులో చాలా అందంగా ఉంటుంది. (మహ, మహా = గొప్ప; గౌరీ, గౌరీ = తెలుపు).
Also Read: శరన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు, తింటే ఏమవుతుంది!
మహాగౌరి కథ
పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడంకోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంటుంది. ఆమె రాజ భవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి, అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్కచేకుండా ఏళ్లపాటూ కఠిన తపస్సు కొనసాగించింది. పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. చర్మం మొత్తం నల్లగా మారిపోయింది. పార్వతి కఠోర తపస్సుకి ప్రత్యక్షమైన శివుడు ఆమెను వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. తన తలపై ఉన్న గంగా జలంతో ఆమెను అభిషేకించగా మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. అప్పటి నుంచి మహాగౌరి అని పిలుస్తారు. మహాగౌరిని ఆరాధించే భక్తులు సకల పాపాలు, సకల భయాలు, అష్టదరిద్రాల నుంచి పునీతులవుతారని విశ్వాసం
Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం
ఓం దేవీ మహాగౌర్యై నమః॥
ధ్యాన మంత్రం
పూర్ణే న్దు నిభాం గౌరీ సోమచక్రస్థితాం అష్టమం మహాగౌరీ త్రినేత్రామ్।
వరాభీతికరాం త్రిశూల డమరూధరాం మహాగౌరీ భజేమ్॥
హే గౌరీ శంకరార్ధాంగీ
యథా త్వం శంకర ప్రియా,
తథా మాం కురూ కల్యాణీ
కాన్తాకాంతా సుదుర్లభామ
జగజ్జననిని మహాగౌరిగా కొలిచేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాలి
శ్వేతే వృషే సమారూఢా శ్వేతామ్బరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా
నవదుర్గల శ్లోకం
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది
శ్రీ మాత్రే నమః