Mouni Roy: 'వాళ్లు అలా ఆనందిస్తే మనం ఏం చేస్తాం' - ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్స్‌పై నటి రియాక్షన్
Mouni Roy On Trollings: తనపై సోషల్ మీడియా వేదికగా వస్తోన్న ట్రోలింగ్స్‌పై ప్రముఖ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ తాజాగా స్పందించారు. అలాంటి వాటిని చూడనని.. పట్టించుకోనని అన్నారు.

Actress Mouni Roy Reaction On Plastic Surgery Trollings: ప్రముఖ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ (Mouni Roy) అంటే తెలుగు ఆడియన్స్‌కు కూడా సుపరిచితమే. 'నాగిని' (Nagini) సీరియల్‌తో ఆమె బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మౌనీరాయ్ గత కొంతకాలంగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు.
ట్రోలింగ్స్‌పై ఏమన్నారంటే?
మౌనీ రాయ్ తన తర్వాతి చిత్రం 'ది భూత్నీ' (The Bhootnii) సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నప్పటి నుంచీ ఈ ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ ప్రచారం సాగింది. ఫోటోలు కొన్నింటిని ఇన్ స్టాలో పోస్ట్ చేయగా కొందరు విమర్శించారు. అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని.. దీంతో ముఖ కవళికలు మారిపోయాయని కామెంట్స్ చేశారు. ఈ విమర్శలపై తాజాగా మౌనీ రాయ్ స్పందించారు. తనపై కామెంట్స్ చేసే వాళ్లు తనకు కనిపించరని.. కాబట్టి వాళ్ల మాటలకు బాధ పడాల్సిన అవసరం లేదని అన్నారు.
'ట్రోల్స్ వల్ల నాకు ఎలాంటి బాధ లేదు. నేను వాటిని పట్టించుకోను కూడా. ప్రతి ఒక్కరూ ఎవరి పనిని వారు చెయ్యనివ్వండి. ఇతరులను ట్రోల్ చేయడానికి.. మీరు తెర వెనుక దాక్కుని.. వాటితో ఆనందం పొందాలనుకుంటే మనం ఏం చేస్తాం. అలాంటి వారిని అలానే ఉండనివ్వండి. ఎవరికి నచ్చిన పని వాళ్లను చేసుకోనివ్వండి.' అంటూ పేర్కొన్నారు.
Also Read: ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
మౌనీరాయ్.. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా 'నాగిని' సీరియల్‌తో అటు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించారు.
ఈ నెల 18న 'ది భూత్నీ'
'మౌనీ రాయ్' లేటెస్ట్ మూవీ 'ది భూత్నీ' ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించగా.. ఆమె మొహబ్బత్ అనే దెయ్యం పాత్రలో కనిపించనున్నారు. హారర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో సన్నీ సింగ్, పాలక్ తివారీ, బెయోనిక్, ఆసిఫ్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని.. ఇందులోని స్టంట్స్ తానే స్వయంగా చేశానని మౌనీరాయ్ తెలిపారు.





















