Dussehra Navratri 2022: శరన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు, తింటే ఏమవుతుంది!
శరన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి వినియోగించిన పదార్థాలు, మాంసాహారం తినొద్దని చెబుతారు. వాస్తవానికి శరన్నవరాత్రులనే కాదు ఏ పండుగొచ్చినా కూడా ఇదే ఫాలో అవ్వాలి అంటారు. ఎందుకలా...తింటే ఏమవుతుంది.
హిందూ ధర్మంలో పండగలకు విశిష్టస్థానం ఉంది. పండుగలు, పూజలు, ప్రత్యేక సమయాల్లో తినే ఆహారానికి కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా అత్యంత పవర్ ఫుల్ అని చెప్పే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించేవారంతా కొన్ని ఆహార నియమాలు పాటిస్తారు. ఇందులో భాగంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి , ఇతర మసాలా పదార్థాలేవీ కూడా తినరు. సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు. కారణం చెప్పుకోవాలంటే ముందు మనిషిలో ఉండే మూడు గుణాల గురించి తెలుసుకోవాలి... వీటినే త్రిగుణాలు అంటారు. ఈ మూడు గుణాల కారణంగానే జీవుడు శరీరంలో బంధించి ఉన్నాడని భగవద్గీత చెబుతోంది.
1.సత్వగుణం
సత్వగుణం జ్ఞానంపై ఆసక్తి కలిగిస్తుంది. దైవంపై, దైవకార్యాలపై మనసుని మళ్లిస్తుంది, నిత్యం ప్రశాంతంగా ఉంచుతుంది. మృదువుగా మాట్లాడేలా చేస్తుంది. ఉదాహరణ రాముడు, కృష్ణుడు
2.రజోగుణం
నేను అనే అహానికి ప్రతీక రజోగుణం. రజోగుణం అధికంగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఆలోచన, ఆందోళన, అసంతృప్తి, అశాంతి, ఏదో చేయాలనే తపనతో ఉంటాడు. ఉదాహరణ దుర్యోధనుడు, రావణుడు
3.తమోగుణం
తమోగుణం అధికంగా ఉంటే సోమరితనం, నిద్ర, ఇతరుల దయా-దాక్షిణ్యాలపై ఆధారపడటం, దుర్మార్గపు ఆలోచనలు, తిండి ధ్యాస ఉంటాయి.
ఈ మూడు గుణాల గురించి ఇప్పుడెందుకంటే...మనం తినే ఆహారమే మనలో గుణాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆహారాన్ని కూడా సాత్విక ఆహారం, రాజాసిక్, తమాసిక్ ఆహారాలుగా పేర్కొన్నారు.
Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం
సాత్విక ఆహారం
సాత్విక ఆహారం స్వచ్ఛమైన శాఖాహార ఆహారం. ఇందులో కాలానుగుణ తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మొలకలు, విత్తనాలు, తేనె, తాజా మూలికలు ఉంటాయి. ఇది మనస్సును, శరీరాన్ని స్వచ్ఛంగా సమతుల్యంగా ఉంచుతుంది. సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. వారిలో ప్రశాంతత కనిపిస్తుంది. ఎప్పుడూ ఉత్సాహంగా అందరితో స్నేహంగా ఉంటాడు.
రజాసిక్ ఆహారం
రజాసిక్ ఆహారంలో మసాలా దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, ఇతర సుగంధ ద్రవ్యాలు , డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, షుగర్ ఫుడ్స్, చాక్లెట్లు ఉంటాయి. ఇలాంటి ఆహారాలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది కానీ శరీర సమతుల్యత గాడి తప్పుతుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. వీటిని తినడానికి ఎంత ఆతృత ఉంటుందో... అంతే వేగంగా కోపం, అసహనం, ఆందోళన కలుగుతాయి..
తమాసిక్ ఆహారం
ఇందులో ప్రధానంగా మళ్లీ వేడిచేసిన ఆహారాలు, రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, గుడ్లు, మాంసం, ఆల్కహాల్, సిగరెట్లు ఉంటాయి. ఈ ఆహారాన్ని భుజించేవారు బద్దకంగా, నిస్తేజంగా, జీవితం పట్ల నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. మనసుకి, శరీరానికి హాని కలిగించే ఈ ఆహారం తీసుకోవడం వల్ల దయగల ఆలోచన వీరి దరిచేరదని చెబుతారు.
Also Read: ఒక్కో దేవుడికి ఒక్కో ఆయుధం - కానీ పరాశక్తి చేతిలో అవన్నీ ఉంటాయ్ ఎందుకలా!
అందుకే ప్రశాంతంగా,సంతోషంగా జరుపుకునే శుభకార్యాల్లో రజోగుణం, తమోగుణం కలిగించే ఆహార పదార్థాలు తీసుకోరు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం అవుతాయి. తొమ్మిదిరోజులు అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో భక్తులతో పూజలందుకుంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికగా విజయదశమిని జరుపుకుంటారు. ఇందులో చివరి మూడు రోజులైన దుర్గాష్టమి, మహర్నవమి, దశమి ప్రత్యేకం...