మహాగౌరీ దుర్గా నవదుర్గల అలంకారాల్లో ఎనిమిదవ అవతారం. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.
హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ అమ్మవారు తీరుస్తుంది. జీవితంలో కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చని భక్తుల విశ్వాసం
మహాగౌరీదేవినాలుగు చేతులుతో ఉంటుంది. కుడిచేయి అభయముద్రలో ఉండగా, కింద కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో ఢమరుకం ఉంటాయి. పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది.
మహాగౌరి అనే పేరు గొప్ప తెలుపు అని అర్ధం. దుర్గాదేవి తెలుపు రంగులో చాలా అందంగా ఉంటుంది. (మహ, మహా = గొప్ప; గౌరీ, గౌరీ = తెలుపు).
పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడంకోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంటుంది. ఆమె రాజ భవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి, అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది.
ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్కచేకుండా ఏళ్లపాటూ కఠిన తపస్సు కొనసాగించింది. పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. చర్మం మొత్తం నల్లగా మారిపోయింది
పార్వతి కఠోర తపస్సుకి ప్రత్యక్షమైన శివుడు ఆమెను వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. తన తలపై ఉన్న గంగా జలంతో ఆమెను అభిషేకించగా మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. అప్పటి నుంచి మహాగౌరి అని పిలుస్తారు.
మహాగౌరిని ఆరాధించే భక్తులు సకల పాపాలు, సకల భయాలు, అష్టదరిద్రాల నుంచి పునీతులవుతారని విశ్వాసం