CBI Notices To Satya Pal Malik: కేంద్రంపై విమర్శలు, అంతలోనే సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు
2019లో జరిగిన పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఆ దారుణంలో ప్రధాని మోదీ సహా కేంద్రం తప్పులు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు జమ్ము కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్.

2019లో జరిగిన పుల్వామా అటాక్ లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. అయితే ఆ దారుణంలో ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్రం తప్పులు చాలా ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు జమ్ము కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఆ టైమ్ లో చాలా విషయాలపై తనను సైలెంట్ గా ఉండాలని మోదీ, అజిత్ ధోవల్ సూచించారని చెప్పిన సత్యపాల్ మాలిక్...సీఆర్పీఎఫ్ జవాన్లు రోడ్ ట్రావెల్ చేయటం సేఫ్ కాదని..ఎయిర్ క్రాఫ్టులు అడిగితే కేంద్రం అందుకు నిరాకరించిదంటూ బాంబు పేల్చారు. వైర్ కోసం కరణ్ థాపర్ చేసిన ఈ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.
సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు
ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కి చెందిన ఓ కేసులో సీబీఐ విచారణకు ఈనెల 28న హాజరు కావాలని సత్యపాల్ మాలిక్ తాఖీదులు అందాయి. ఇలా కేంద్రంపై విమర్శలు చేశారో లేదో అలా సీబీఐ నోటీసులు వచ్చాయంటూ ప్రతిపక్షాలు ఈ అంశంపై తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ టైమ్ లోనే నాలుగు రాష్ట్రాలకు సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా పనిచేశారు. 2017-18 బిహార్ గవర్నర్, 2018-19 అక్టోబర్ వరకూ జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా వద్ద ఉగ్రదాడి జరిగి 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రభుత్వం సత్యపాల్ మాలిక్ ను గోవాకు గవర్నర్ గా నియమించింది. 2019-20 వరకూ గోవా గవర్నర్ గా, 2020 నుంచి 2022 అక్టోబర్ కు మేఘాలయకు గవర్నర్ గా ఉన్నారు సత్యపాల్ మాలిక్. బీజేపీ ప్రభుత్వంలో ఇంత కాలం గవర్నర్ గా పనిచేసిన ఆయన..ఆ బాధ్యతల నుంచి తప్పుకోగానే ఇలా పుల్వామా అటాక్ లాంటి సెన్సిటివ్ ఘటనపై కామెంట్స్ చేశారు.
రైతుబిడ్డను.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు
తాజాగా తనకు సీబీఐ నోటీసులు ఇవ్వటంపై సత్యపాల్ మాలిక్ స్పందించారు. తాను రైతుబిడ్డను అని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సీబీఐ కి కొన్ని అంశాలపై స్పష్టత కావాలని కోరుకుంటున్నారని.. అవి అందించేందుకు తాను సిద్ధమని తెలిపారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం 2024లో మళ్లీ అధికారంలోకి రాదని చెబుతున్నారు సత్యపాల్ మాలిక్.పనిలో పనిగా మోదీపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు సత్యపాల్ మాలిక్.
ఆ విషాదానికి ఇటీవల నాలుగేళ్లు పూర్తి..
పుల్వామా ఘటన జరిగి సరిగ్గా నేటికి నాలుగు సంవత్సరాలు అవుతోంది. 2019 ఫిబ్రవరి 14వ తేదీన పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషేమహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు చెందిన 40 మంది జవాన్లు అమరులు అయ్యారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిపోయింది. వీరసైనికులను తలుచుకుంటూ దేశ ప్రజల గుండెల్ని పిండేసిన ఈ ఆరోజును భారతీయులు ఎప్పటికీ మరిచిపోలేరు. సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజున జాతీయ రహదారి 44పై భారతీయ సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 76వ బెటాలియన్ కు చెందిన 40 మంది సెంట్రల్ సీఆర్పీఎఫ్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. మరో 35 మంది గాయపడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

