Monsoon Health Tips: వర్షాకాలంలో రోగాల బారిన పడకూడడంటే ఈ ఎనిమిది జాగ్రత్తలు తప్పనిసరి
వానాకాలంలో రోగాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జలుబు, జ్వరం, ఫ్లూ బారిన పడిపోతూ ఉంటారు.
వర్షాకాలం ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తుంది. దానితో పాటు ఆరోగ్యం విషయంలో అనేక సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. గాలిలో తేమ కారణంగా ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనపడిపోతుంది. ఈ టైమ్ లో జీవక్రియ పనితీరుని పెంచేందుకు పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాదు మరికొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ మాన్ సూన్ సీజన్ లో మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ ఎనిమిది జాగ్రత్తలు అవసరం.
పరిశుభ్రత
బయట నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగత శుభ్రత పాటించాలి. తరచుగా సబ్బు నీటితో చేతులని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా తినడానికి ముందు క్లీన్ చేసుకోవాలి. క్రిములు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే చేతులతో పదే పదే ముఖాన్ని తాకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
నీటి ద్వారా వచ్చే వ్యాధులు
ఈ టైమ్ లో నీరు కలుషితం అవుతుంది. అందుకే ఎప్పుడూ సురక్షితమైన, శుభ్రమైన తాగునీటిని ఎంచుకోవాలి. నీటిని బాగా మరిగించి వడకట్టుకుని తాగడం మంచిది. స్ట్రీట్ ఫుడ్, కలుషితమైన నీటిలో కడిగిన పచ్చి కూరగాయలు తీసుకోవడం మానుకోవాలి.
ఆహార భద్రత
వర్షాకాలంలో అధిక తేమ కారణంగా ఆహారం త్వరగా చెడిపోతుంది. అందుకే తాజాగా తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తినకుండా ఉండాలి. వినియోగానికి ముందుగా పండ్లు, కూరగాయలు బాగా నీటితో శుభ్రం చేసుకోవాలి.
దోమల బెడద
వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. దోమ కాటును నివారించేందుకు ఎప్పుడు క్రిమి వికర్షకాలు ఉపయోగించాలి. నిండుగా దుస్తులు ధరించాలి. దోమతేరలు వినియోగించాలి.
నీరు నిల్వ చేయొద్దు
ఇంటి ఆవరణలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే వాటిలో దోమలు, ఇతర కీటకాలకి సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది. అందుకే ఇంటి చుట్టు పక్కన ఉండే నీటి కుంటలు లేదా నీటి నిల్వలు ఉంటే వాటిని తొలగించడం చాలా ముఖ్యం. లేదంటే వాటి ద్వారా దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండి రోగాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుంది.
వర్షంలో తడవకండి
వర్షపు నీటిలో తడవకుండా పొడిగా ఉండేందుకు ప్రయత్నించాలి. బయటకి వెళ్తున్నప్పుడు గొడుగు, రెయిన్ కోట్ వెంట తీసుకెళ్లడం, వాటర్ ప్రూఫ్ చెప్పులు ధరించడం మరచిపోవద్దు. నీరు ఇంట్లోకి రాకుండ చూసుకోవాలి. తడిచిన పాదాల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పాదాలకి సంబంధించిన సమస్యలకు కారణమవుతుంది.
వెంటిలేషన్ ముఖ్యం
తడి వాతావరణంలో వృద్ధి చెందే శిలీంధ్రాల పెరుగుదలని నిరోధించడానికి నివాస స్థలాల్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. కిటికీలని తెరిచి ఉంచాలి. గది పొడిగా అయ్యేందుకు ఫ్యాన్ లేదా డీహ్యూమిడిఫైయర్లను ఉపయోగించండి.
రోగనిరోధక శక్తి పెంచాలి
బలమైన రోగనిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడేందుకు సహాయపడుతుంది. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. హైడ్రేట్ గా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడి స్థాయిలని అదుపులో ఉంచుకుని తగినంత నిద్రపోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మనదేశంలో RO వాటర్ తాగాల్సిన అవసరం లేదంటున్న శాస్త్రవేత్తలు, ఎందుకో తెలుసా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial