Paneer Making at Home : పనీర్ కల్తీ ఆహారమని తేల్చిన నివేదికలు.. బయట తినేకంటే ఇంట్లోనే పనీర్ తయారు చేసుకోండిలా
Paneer Making : పనీర్ అంటే ఇష్టమా? అయితే దానిని ఇకపై బయట తినకండి. ఇంట్లోనే చక్కగా పనీర్‌ని చేసుకుని నచ్చిన రెసిపీ చేసుకోండి. మరి ఇంట్లో పనీర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Homemade Paneer Recipe : పనీర్‌ని చాలామంది ఇష్టంగా తీసుకుంటారు. ముఖ్యంగా వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ కోసం పనీర్‌ని ఆశ్రయిస్తారు. నాన్‌వెజ్ తినేవారు కూడా దీనిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వెజిటేరియన్స్ బయట ఫుడ్ తినాలనుకున్నప్పుడు వారి జాబితాలో ముందు వరుసలో కచ్చితంగా పనీర్ ఉంటుంది. అయితే పనీర్ అత్యంత కల్తీ ఆహారం అంటూ తాజా నివేదికలు వెల్లడించి.. అందరినీ షాకింగ్‌కి గురిచేశాయి.
ప్రోటీన్ సోర్స్‌గానే కాకుండా మంచి రుచికోసం చాలామంది పనీర్‌ని తీసుకుంటారు. అయితే మీరు ఇకపై పనీర్ ప్రోటీన్‌ని తీసుకోవాలనుకుంటే బయట దొరికే పనీర్ కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుని తింటే మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే నకిలీ పనీర్ మార్కెట్లలో, రెస్టారెంట్లలో ఎక్కువగా ఉందని.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. అందుకే దానిని ఇంట్లోనే తయారు చేసుకుంటే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా పనీర్‌ని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఇంట్లోనే పనీర్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
పాలు - 2 లీటర్లు (ఫ్యాట్ మిల్క్)
నిమ్మరసం - 1 స్పూన్
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి.. దానిపై మందపాటి గిన్నెను పెట్టాలి. దానిలో పాలు వేసి.. మీడియం మంట మీద మెల్లగా మరిగించాలి. పాలు అడుగుపట్టకుండా కలుపుతూ ఉండాలి. పనీర్ చేయాలనుకుంటే పాలల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. అప్పుడే పనీర్ ఎక్కువ వస్తుంది. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి.. దానిలో నిమ్మరసం వేయాలి. వెనిగర్‌ని లేదా పెరుగును కూడా ఉపయోగించవచ్చు. వీటిని వేయడం వల్ల పాలు విరిగిపోతాయి. కాసేపు ఆగితే పాలవిరుగుడు వేరవుతుంది. పాలు విరగకపోతే దానిలో మరో టేబుల్ స్పూన్ వెనిగర్ కలిపి.. మీడియం మంట మీద పాలు మరిగించి దించేయండి.
విరిగిన మిశ్రమాన్ని వడకట్టి పక్కన పెట్టుకోండి. దానిపై చీజ్ క్లాత్ వేయండి. వెనిగర్ పూర్తిగా పోయేలా చల్లని నీటితో ఆ మిశ్రమాన్ని కడగాలి. ఇప్పుడు చీజ్ క్లాత్‌లో పనీర్ వేసి.. క్లాత్‌ను మూటకట్టండి. దీనిని అరగంట వేలాడదీస్తే దానిలోని నీరు బయటకు పోతుంది. ఇప్పుడు ఆ మూటను ఓ జల్లెడ వంటి దానిలో పెట్టి.. పైన ఏదైనా బరువు పెట్టండి. దీంతో పనీర్‌లోని మిగిలిన నీరు పోవడమే కాకుండా.. పనీర్ సెట్ అవుతుంది
అనంతరం మూటను విప్పి పనీర్‌ను మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. అంతే పనీర్ రెడీ. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల 2 నుంచి 3 వారాల వరకు నిల్వ ఉంటుంది. దీనితో మీరు మీకు నచ్చిన పనీర్ డిష్‌లను ట్రై చేసుకోవచ్చు. ప్రోటీన్ డైట్లో కూడా తీసుకోవచ్చు. ఇకపై బయట పనీర్ తినడం, కొనడం మానేసి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా పనీర్ చేసేసుకోండి.






















