Free Chakra Siddha Medical Camp :తినే తిండి, చేసే ఎక్సర్సైజే మనిషికి దివ్యౌషధం: గుండెపూడి చక్రసిద్ధ వైద్య శిబిరంలో సత్య సింధుజ
మంచి ఆహారం తీసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడిపితే చాల వ్యాధులు జయించినట్టేనని చక్రసిద్ధ వైద్యురాలు సత్య సింధుజ చెబుతున్నారు . దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.

Free Chakra Siddha Medical Camp :రోజూ తినే తిండి, చేసే వ్యాయామం మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుందని చక్రసిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ సత్య సింధుజ అభిప్రాయపడ్డారు. దీనికి మానసిక ప్రశాంతత కూడా తోడు అవుతుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడిలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఉచిత వైద్యశిబిరానికి వచ్చిన ప్రజలకు పలు సూచినలు చేశారు.
మందులు అవసరం లేకుండా అనారోగ్య సమస్యలు తీర్చేందుకు చక్రసిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ సత్య సింధుజ నేతృత్వంలోని వైద్యసిబ్బంది గుండెపూడిలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈనెల 14 నుంచి ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ప్రజలకు పరీక్షలు చేసి వారికి ఉన్న వ్యాధులపై అవగాహన కల్పించారు.

వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. వైద్యలతో మాట్లాడి తమకున్న సమస్యలు చెప్పుకున్నారు. వారి ఇచ్చిన సలహాలు సూచనలు పాటించారు. ఎలాంటి మందులు వాడకుండానే మెరుగైన ఫలితాలు వచ్చినట్టు తెలిపారు.
లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని తమ ఆరోగ్య సమస్యలు ఈ చక్రసిద్ధ వైద్యం వల్ల తగ్గుతున్నాయని రోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వైద్యంలో ఎలాంటి మందులు లేకుండా, ఆపరేషన్లు చేయకుండా వైద్యులు తమకు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. వైద్యుల సలహాలు పాటించిన తమకు ఎంతో ఉపశమనం కలుగుతుందని రోగులు తెలుపుతున్నారు. ఇలాంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సత్య సింధుజ, ఆమె టీమ్‌కు ప్రజలు కృతజ్ఞత తెలిపారు.
ఈ సందర్బంగా మాట్లాడిన సింధుజ..." మనో నిబ్బరంగా ఉంటే ఇలాంటి వైద్యం వర్కౌట్ అవుతుంది. మార్పు మనతోనే మొదలు కావాలి. ఎవరికి వారు సెల్ఫ్‌గా కనెక్ట్ అయితే తప్ప మార్పు సాధ్యంకాదు. తమ కోసమే వైద్యులు సలహాలు ఇచ్చారు. ఫలితం చూశామన్న ధైర్యం మీలో మార్పునకు కారణమైంది. అందుకే ఐదు రోజుల్లో పది సెషన్స్‌లో చాలా మార్పు గమనించారు. దాన్ని కంటిన్యూ చేయాలి. అలా చేస్తే మీకు నొప్పులు రావు. శరీరంలో తరగుదల ఉంటుంది. అలాంటి సమయంలోనే కావాల్సిన పోషకాలు అందివ్వాలి. సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. వీటికి తోడు మంచిగా వ్యాయామం చేయాలి. ప్రశాంతమైన జీవనం సాగించాలి. ఇవన్నీ చేస్తే నొప్పులకు దూరంగా ఉండొచ్చు. తినే తిండి, చేసే వ్యాయామమే మనిషికి ఔషధంలా పని చేస్తుంది." అని అన్నారు.
అనంతరం ఇలాంటి వైద్యశిబిరం గ్రామంలో ఏర్పాటు చేసిన సింధుజను గ్రామస్థులు సత్కరించారు. వైద్యశిబిరానికి వచ్చి ప్రజలకు ఉచితంగా సేవ చేసిన వైద్యులను, సిబ్బందిని కూడా సన్మానించారు.





















