Mango Buying Guide : కెమికల్స్‌తో పండిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి.. వాటిని తింటే వచ్చే ఆరోగ్య ప్రమాదాలివే
Chemically Ripened Mangoes : మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ సమయంలో మీరు సరైన వాటిని ఎంచుకోకపోతే.. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎలా గుర్తించాలంటే..

Health Risks of Fake Mangoes : నోటికి రుచిని ఇస్తూ ఆరోగ్యానికి మేలు చేసే మామిడిపండ్ల కోసం సమ్మర్లో ఎదురు చూసేవారు ఎందరో ఉన్నారు. మీరు కూడా వారిలో ఒకరా? మీ క్రేవింగ్స్‌ని రెట్టింపు చేస్తూ.. రోడ్లపై వెళ్తుంటే పసుపు రంగులో కనిపించే చూడ చక్కని మామిడిపండ్లను కొనుక్కుని తినేయాలనిపిస్తుందా? అయితే జాగ్రత్త. ఎందుకంటే అవి కెమికల్స్‌తో పండినవి కావొచ్చు. వాటిని తింటే మీ క్రేవింగ్స్ తగ్గడం దేవుడెరుగు. కానీ కొత్త ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నవారు అవుతారంటున్నారు నిపుణులు.
నిజమే మరీ.. బయట దొరికే మామిడి పండ్లలో దాదాపు 80 శాతం వాటిని కెమికల్స్‌తోనే పండిస్తున్నారట. చూసేందుకు టెంప్టింగ్గా ఉన్నంత మాత్రానా అవి ఆర్గానిక్‌గా పండినవి కావని గుర్తించాలని అంటున్నారు. లేదు వాటినే తినేస్తాము అంటారా? ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ కెమికల్స్‌తో పండించే మామిడిపండ్లను ఎలా గుర్తించాలి? వాటిని తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కెమికల్స్‌తో పండించిన వాటిని ఇలా గుర్తించండి..
కష్టమనుకుంటారు కానీ.. కెమికల్స్‌తో పండించిన మామిడి పండ్లను గుర్తించడం చాలా ఈజీ. సరిగ్గా పరిశీలిస్తే ఇట్టే మీరు వాటిని గుర్తు పట్టేస్తారు. కెమికల్స్‌తో పండించిన మామిడిపండ్లు మొత్తం పసుపు రంగులో ఉంటాయట. అదే సహజంగా పండినవి పసుపు, పచ్చని మిశ్రమాలతో ఉంటాయట. అలాగే కెమికల్స్‌తో పండించిన మామిడి పండుకు ఎలాంటి సువాసన ఉండదట. లేదా తక్కువ వాసన ఉంటాయి. కానీ సహజంగా పండిన మామిడి పండు నోరూరించే సువాసనలు వెదజల్లుతుంది.
పండు పండే విధానంలో కూడా..
కెమికల్స్‌తో పండిన మామిడిపండ్లు చాలా త్వరగా పాడైపోతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండవు. మీరు పచ్చిగా అనిపించి తెచ్చుకున్న మామిడిపండ్లు కూడా మరుసటి రోజుకే పూర్తిగా పండిపోతాయి. ఇది కెమికల్స్ వినియోగాన్ని సూచిస్తుంది. మామిడిపండు పై భాగంలో తెల్లని పొడివలె కనిపిస్తే అది కెమికల్ వినియోగమని గుర్తించాలి.
ఆరోగ్య ప్రమాదాలివే..
కెమికల్స్‌తో నిండిన మామిడి పండ్లు తింటే కచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. మామిడిని పండించడానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ తేమతో నిండి ఉంటుంది. ఇది ఏసిటిలిన్ అనే వాయువును ఉత్పత్తి చేసి.. ఈథిలిన్ వలె పని చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించి తలనొప్పి వంటి సమస్యలను పెంచుతుంది.
కడుపు నొప్పి, అల్సర్లు వంటి సమస్యలు రావొచ్చు. ఎక్కువ కాలం ఈ కెమికల్స్‌తో నిండిన మ్యాంగోలు తింటే.. కాలేయం, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపి.. దీర్ఘకాలిక ప్రభావాలకు దారితీస్తాయి. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు వీటికి త్వరగా ఎఫెక్ట్ అవుతారట.
మామిడి తినేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మీకు నమ్మకమైన స్టోర్స్ నుంచి మాత్రమే మామిడిని కొనండి. లేదా ఆర్గానిక్ స్టోర్ల నుంచి వీటిని కొనుక్కోవచ్చు. మామిడి మంచి సువాసన రాకుంటే కొనకపోవడమే మంచిది. మామిడిని తినేముందు గంటపాటు నీటిలో నానబెట్టి కడిగి తినండి. అలా తినడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. మంచి రుచిగల మామిడిపండ్లు తిన్న తృప్తి ఉంటుంది.






















