Instant Raw Mango Pickle : మూడు నెలలు నిల్వ ఉండే టేస్టీ మామిడి పచ్చడి.. 5 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు
Mamidikaya Turumu Pachadi : మీకు ఆవకాయ చేసుకోవడం రాకపోతే చింతించకండి. మూడు నెలలు నిల్వ ఉండే టేస్టీ పచ్చడిని కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలంటే..
Traditional Mango Pickle Recipe : ఉగాది తర్వాత చాలామంది మామిడి కాయలతో పచ్చడిని పట్టుకుంటారు. కానీ ఆవకాయ చేయడమనేది అందరికీ రాదు. పైగా దానిని చేయాలంటే చాలా ఓపిక, సమయం కావాలి. కానీ 5 నిమిషాల్లో మామిడి కాయలతో మూడు నెలలు నిల్వ ఉండే పచ్చడిని చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును 5 నిమిషాల్లో మామిడి తురుము పచ్చడిని తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని ఏవిధంగా తయారు చేయాలి? పచ్చడిని తయారు చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది? తయారు చేయడం ఎలా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మామిడి కాయలు - 3
ఉప్పు - అరకప్పు
కారం - అరకప్పు
ఆవాలు - పావు కప్పు
మెంతులు - 1 టీస్పూన్
నువ్వుల నూనె - 200 మి.లీ
ఇంగువ - చెంచా
పసుపు - అర టీస్పూన్
ఎండు మిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు -10
తయారీ విధానం
ముందుగా మామిడి కాయలను తీసుకోండి. వాటిపై తొక్కలను చెక్కి కడిగి తుడిచి పక్కన పెట్టుకోండి. దానిపై నీరు లేకుండా ఉండాలి. ఇలా పొడిగా ఉన్న మామిడి కాయలను పొడిగా ఉన్న గిన్నెలోకి తురుముకోవాలి. వాటిని పక్క పెట్టుకోండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో ఆవాలు, మెంతులు వేసి వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూడా పక్కన పెట్టుకోండి. స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో నువ్వుల నూనె వేసి.. వేడి అయ్యాక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. నువ్వుల నూనె అందుబాటులో లేకుంటే పల్లీ నూనె కూడా వాడుకోవచ్చు. అవి వేగిన తర్వాత స్టౌవ్ ఆపేయండి.
ఇప్పుడు పొడిగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి మామిడి తురుమును ఓ కప్పుతో కొలిచి వేయండి. ఇప్పుడు ఓ కప్పుతో మామిడి తురుము మూడు కప్పుల కొలత వచ్చిందనుకో.. మిగిలిన పదార్థాలను తీసుకునేందుకు అదే కప్పును ఉపయోగించాలి. అప్పుడే పచ్చడి సరైన రుచిని మీకు ఇస్తుంది. ఇప్పుడు మామిడి తురుము మూడు కప్పులు వస్తే.. దానిలో ఓ అరకప్పు కంటే ఓ స్పూన్ తక్కువ ఉప్పు వేసుకోవాలి. రాళ్ల ఉప్పును పొడి చేసుకుని దీనిలో ఉపయోగిస్తే మరింత మంచిది. ఉప్పు కొలత కంటే ఎప్పుడూ తక్కువే వేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత మరికొంచెం వేసుకుని కలుపుకోవచ్చు. కానీ ఎక్కువైతే కష్టమవుతుంది.
ఇప్పుడు అదే కప్పుతో కారం కూడా కొలుచుకోవాలి. కప్పులో అరకప్పు కంటే ఓ స్పూన్ ఎక్కువ కారం వేసుకుని దానిని మామిడి తురుములో వేయాలి. ఇప్పుడు దానిలో చెంచా పసుపు, ఓ టేబుల్ స్పూన్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతిగింజల పొడిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో ముందుగా వేసి పెట్టుకున్న తాళింపును వేసి బాగా కలపాలి. సాధారణంగా మీరు పచ్చడి ఎక్కువ కాలం వినియోగించుకోవాలనుకుంటే.. తాళింపు నూనె చల్లారే వరకు ఉంచి.. అప్పుడు మామిడి తురుములో వేసి కలపాలి. లేదు ఇప్పటికిప్పుడు తినాలి అనుకుంటే నూనె వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవచ్చు. దీనిని స్టోర్ చేయాలంటే ఊరగాయలోని నూనె చల్లారిన తర్వాత గాజు పాత్రలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇది కనీసం 3 నెలలు తాజాగా ఉంటుంది.
ఈ టేస్టీ మామిడి తురుము పచ్చడిని మీరు ఇడ్లీ, దోశ, ఉప్మాలతో కలిపి తీసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కూడా హాయిగా లాగించేయవచ్చు. అయితే ఈ మామిడి పచ్చడిని లేత మామిడితో చేస్తే ఓ రుచి.. ముదురు మామిడితో చేస్తే మరో రుచి వస్తుందని గుర్తించుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే మామిడి కాస్త ముదిరింది అయితే మంచిది. దీనిని కేవలం 5 నిమిషాల్లో చేసి పెట్టుకోవచ్చు. ఇంటికి దూరంగా ఉండేవారికి ఈ పచ్చడిని పంపించవచ్చు. అందరూ ఆవకాయ చేయలేకపోవచ్చు. కానీ ఈ తురము పచ్చడిని ఈజీగీ చేయవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈ మామిడి తురుము పచ్చడిని సింపుల్గా చేసుకోవచ్చు.
Also Read : HPV ఇన్ఫెక్షన్తో జెనిటిక్స్కు లింక్ ఉందట.. మహిళల్లో ఆ క్యాన్సర్ని ఇదే రెట్టింపు చేస్తుందన్న న్యూ స్టడీ