Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ వివాదం శాంతి కమిటీతో సద్దుమనిగింది. గ్రామంలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని అధికారులు తెలిపారు.

Pithapuram: పిఠాపురంలో కొత్త వివాదం ఈ మధ్య తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఏం జరిగినా రాష్ట్రవ్యాప్త సంచలనం అవుతుంది. అక్కడ కొంతమందిర దళితులను సంఘ బహిష్కరణ చేశారనే వార్త మరో వైరల్ అవుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది.? ప్రస్తుతం ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం.
పిఠాపురంలోని మల్లంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. దళితుల బహిష్కరణ వార్తలతో జిల్లా యంత్రాగం ఆప్రాంతాన్ని సందర్శించింది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. ఇరు వర్గాల నేతలతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టారు. ఇప్పుడు ఆ గ్రామం అధికారుల పర్యవేక్షణలో ఉంది. పోలీసులు కూడా ఆ గ్రామంపై ప్రత్యేక నిఘా ఉంచారు.
మల్లంలో దళిత వర్గాలను బహిష్కరించారన్న ఆరోపణలతో జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించారు. గ్రామంలో శాంతి కమిటీలు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను సమన్వయపరిచారు. దీంతో మల్లం గ్రామంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి.
అసలేం జరిగింది?
ఆదివారం బహిష్కరణ విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఎక్కడకు వెళ్లిన మీకు ఏం ఇవ్వొబోమని తేల్చేశారు. ఇది పెద్దల నిర్ణయమని కూడా వారి నుంచి సమాధానం వచ్చింది. ఇది విన్న దళిత వర్గాలు షాక్ అయ్యాయి. ఈ విషయాన్ని దళిత నాయకులకు తెలిపారు.
మొత్తం మీద ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. దళిత సంఘాల నాయకులు, వామపక్ష నాయకులు గ్రామంలో పర్యటించి అగ్రవర్ణాల పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన బాటపట్టారు. దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ సగిలి షాన్‌మోహన్ వెంటనే చర్యలు చేపట్టారు. ఆదివారం కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు, పిఠాపురం రూరల్ సీఐ శ్రీనివాస్, రూరల్ ఎస్సై జానీ బాషాకు బాధ్యతలు అప్పగించారు. వారు వెంటనే గ్రామంలో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. తమకు ఎదురైన అనుభవాలను దళితులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
బహిష్కరణకు కారణం ఇదేనా...
ఓ ఇంటికి ఎలక్ట్రికల్ పనులు చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన సురేష్‌బాబు అనే యువకుడు వెళ్లాడు. అక్కడ కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. ఆ ఇంటి విద్యుత్ వైరింగ్ సరిగా లేకపోవడంతోనే సురేష్‌బాబు మృతి చెందాడని దళిత వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. అతని మృతికి పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీనికి ఆ కుటుంబం అంగీకరించకపోవడంతో అంగీకరించకపోవడంతో స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
ఇరువర్గాల మధ్య జరిగిన చర్చల్లో పిఠాపురం రూరల్ సీఐ శ్రీనివాస్ సమక్షంలో మృతుని కుటుంబానికి రూ.2.70 లక్షల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఆ డబ్బులు ఇవ్వకపోగా అగ్రవర్ణాలకు చెందిన పెద్దలు చర్చించుకొని దళితలకు సంఘ బహిష్కరణ చేశారు. పనులకు దళితులను పిలువకూడదని, వస్తువులు కూడా అమ్మకూడదని నిర్ణయించారు.
ఉదయం చికెన్‌షాపులకు, టిఫిన్ సెంటర్లకు వెళ్లిన దళితలకు అసలు విషయం తెలిసింది. అధికారుల సమక్షంలో ఒప్పందం జరిగిందని ఆ డబ్బులు ఇవ్వకపోగా ఇదేంటీ వివక్ష అని వారి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాహ్యప్రపంచానికి తెలియజేశారు దళితులు.
గ్రామంలో శాంతి కమిటీలు..
పిఠాపురం మండల పరిధిలోని మల్లం గ్రామంలో జరిగిన దళితుల సాంఫీుక బహిష్కరణ విషయం వైరల్ అవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి గ్రామాన్ని సందర్శించిన అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి శాంతి కమిటీలు వేశారు. దళితులను సాంఫీుక బహిష్కరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇరు వర్గాల పెద్దలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. గ్రామంలో అన్ని వర్గాలు సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని సూచించారు. సమావేశం అనంతరం ఆర్డీవో మల్లం గ్రామంలో ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేవని, పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని తెలిపారు.
ప్రతీ దానికి పవన్‌పై నిందలు వేయొద్దు..
పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నంత మాత్రాన ప్రతీ దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నిందలు మోపడం సరికాదని ఆపార్టీ దళిత నాయకులతోపాటు ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మల్లం గ్రామంలో కొందరు అగ్రవర్ణ పెద్దలు దళితుల సాంఘిక బహిష్కరణకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మల్లం ఘటనకు పవన్ కల్యాణ్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు. ప్రతీ దానికి పవన్ కల్యాణ్‌ను బాద్యున్ని చేస్తూ కొందరు కావాలనే మాట్లాడుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.





















