Cold In Winter: చలికాలంలో అందుకే ఎక్కువగా జలుబు చేస్తుందట!
శీతాకాలంలో చాలా మంది జలుబు, ఫ్లూ బారిన పడతారు. ఒక పట్టాన అది తగ్గదు. అందుకు కారణం ఏంటో శాస్త్రేవేత్తలు కనిపెట్టేశారు.
చలికాలం వచ్చిందంటే కొందరికి తరచూ జలుబు, ఫ్లూ వస్తూ ఉంటాయి. కొంతమంది ఎప్పుడు ముక్కు కారుతూ దగ్గుతూ ఉంటారు. అవి ఎందుకు వస్తాయో ఎవరికి తెలియదు. అయితే అలా ఎందుకు జరుగుతుందనే దానికి ఇప్పుడు సమాధానం దొరికింది. శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి, గొంతు, ముక్కుపై వైరస్ లేదా బ్యాక్టీరియా దాడి ఎందుకు చేస్తుందో శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం చల్లని వాతావరణంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని వల్ల వైరస్ అంటుకుని నాసికా కణాలకి సోకుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.
అందుకే జలుబు, ఫ్లూ వస్తాయ్
ఉష్ణోగ్రతలో తగ్గుదల వల్ల ముక్కులో సహజమైన రోగనిరోధక ప్రతిస్పందన గణనీయంగా తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్‌ను చుట్టుముట్టడం వల్ల ఎక్స్‌ట్రా సెల్యులర్ వెసికిల్స్ (EV) సంఖ్య మాత్రమే కాకుండా వాటి నాణ్యత, బలాన్ని తగ్గిస్తుంది. ఇలా తగ్గడం వల్ల వైరస్ నాసికా కణాలకి అంటుకునేలా చేస్తుంది. అక్కడ నుంచి అవి ఇతర భాగాలకి చేరతాయి. జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం అధిక వేడి శ్లేష్మం దాని రక్షణ సామర్థ్యాన్ని కోల్పోదు. ముక్కు లోపల ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గడం వల్ల ముక్కు రంధ్రాల్లో బిలియన్ల కొద్ది వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడే కణాలలో దాదాపు 50 శాతం నాశనం అవుతుందని సదరు అధ్యయనం పేర్కొంది.
చల్లగాలి వైరస్ ఇన్ఫెక్షన్స్ ని పెంచుతుంది. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల సగం రోగనిరోధక శక్తిని కోల్పోతారని నిపుణులు వెల్లడించారు. ఫ్లూ బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా మరికొంతమంది అలర్జీలకి గురవుతారు. అందుకే తమను తాము రక్షించుకోవడానికి చల్లనివాతావరణం సమయంలో ముఖానికి మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. అలాగే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్స్ తో పోరాడగలిగే సామర్థ్యం ఉన్న ప్రోటీన్లతో కుడైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమమైన మార్గం సబ్బు నీటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం. బయటకి వెళ్లొచ్చిన తర్వాత కళ్ళు, ముక్కు నేరుగా తాకకుండా చేతులు కడుక్కోవాలి. అలాగే ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకి దూరంగా ఉండటం వంటివి చెయ్యాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి
☀ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం
☀ నిరంతర ఛాతీ లేదా కడుపు నొప్పి
☀ కండరాల్లో తీవ్రమైన నొప్పి లేదా బలహీనత
☀ మూర్చలు
☀ మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది
☀ జ్వరం లేదా దగ్గు ఎక్కువగా రావడం
☀ మైకం లేదా గందరగోళంగా అనిపించడం
ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి తగ్గేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే సమతుల ఆహారం తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: వెన్నునొప్పి వేధిస్తుందా? ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందొచ్చు