జాగ్రత్త, ఈ సైలెంట్ కిల్లర్ ఇప్పటికే మీ శరీరంలో తిష్ట వేసింది - ఇలా చేస్తేనే సేఫ్!
గుండె, ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన మరణాలు ఏటా జరిగే మరణాల్లో నాలుగింట ఒక వంతుగా ఉంటున్నాయి.
మీకు ఈ సైలెంట్ కిల్లర్ గురించి అవగాహన ఉందా? అయితే, తెలుసుకోండి. ఎందుకంటే.. మీకు తెలియకుండానే అది మీ ప్రాణాలను హరిస్తోంది. ప్రాణాంతక గుండె సమస్యలకు దారితీస్తోంది. ఇంతకీ ఆ సైలెంట్ కిల్లర్ ఏంటో తెలుసా? మరెంటో కాదు... మీ శరీరంలోని కొవ్వు. ఔనండి, ప్రపంచంలో సగానికి పైగా జనాభా.. ఈ సైలెంట్ కిల్లర్‌తో ప్రమాదకర జీవితాన్ని గడుపుతున్నారట. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు ఈ విషయాలు తెలుసుకోవల్సిందే.
కొలెస్ట్రాల్ శరీరానికి ప్రమాదకరంగా మారుతోందనే స్పృహ చాలామందికి లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం అనేది గుండె సమస్యలతో పాటు స్ట్రోక్ కు కూడా కారణమవుతుంది. ఇది ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించే పరిస్థితి. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్‌గా అభివర్ణిస్తారు. గుండె, ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన మరణాలు ఏటా జరిగే మరణాల్లో నాలుగింట ఒక వంతుగా ఉంటున్నాయి.
కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యవంతమైన కణ నిర్మాణానికి అవసరమయ్యే రక్తంలో ఉండే కొవ్వు పదార్థం. ఇది కాలేయం ద్వారా తయారై రక్తంలో కలుస్తుంది. కొన్ని ఆహారపదార్థాల్లో కూడా ఈ కొవ్వు కనిపిస్తుంది. ఈ కొవ్వు పరిమాణం రక్తంలో పెరిగినపుడు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. రక్తంలో ఉండే కొలేస్ట్రాల్ ప్రొటీన్ తో కలిసినపుడు దానిని లిపోప్రొటీన్ అంటారు. ఈ లిపోప్రొటీన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అధిక సాంద్రతతో ఉంటుంది. దానిని హైడెన్సిటీ లిపోప్రోటిన్ (హెచ్డీఎల్) అంటారు. రెండోది తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. దానిని లోడెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్డీఎల్) అంటారు.
ఏది మంచిది?
హెచ్డీఎల్ కొలేస్ట్రాల్ ను కణాల నుంచి సేకరించి దానిని విచ్ఛిన్నం చేసే కాలేయానికి తిరిగి చేరుస్తుంది. దీన్ని శరీరం వినియోగించుకుని తిరిగి విసర్జన ద్వారా బయటకు పంపేస్తుంది. హెచ్డీఎల్ అనేది మంచి కొలేస్ట్రాల్ గా చెప్పుకోవాలి. ఇది ఎక్కువ మొత్తంలో ఉండడం ఆరోగ్యానికి మంచిది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను శరీరంలో అవసరమైన చోటుకు చేరవేస్తుంది. కానీ ఇది ఎక్కువగా కొలెస్ట్రాల్ ను ఎక్కువ మొత్తంలో తీసుకువెళితే అది రక్తనాళాల గోడల్లో పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోయిన కొలేస్ట్రాల్ గుండెజబ్బులకు కారణం అవుతుంది. కాబట్టి ఎల్డీఎల్ మోతాదుకు మించి ఉన్నపుడు ప్రమాదకరమైన స్థితిగా చెబుతారు. ఇది చెడు కొలేస్ట్రాల్ అని చెప్పవచ్చు.
కొలెస్ట్రాల్ తగ్గించే మార్గాలేమిటి?
మనం పుట్టినపుడు మన శరీరంలో ఎంత కొలెస్ట్రాల్ ఉండేదో అంత స్థాయిలో మాత్రమే ఉండడం అత్యంత ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలుగా చెప్పవచ్చు. ఇలా ఉన్నపుడు గుండె సమస్యలు, స్ట్రోక్ సమస్యలను నివారించడం అప్పుడు సుసాధ్యం అవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించుకునేందుకు నిపుణులు చాలా మార్గాలను సూచించారు. అధిక కొలెస్ట్రాల్ కూడా లైఫ్ స్టయిల్ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. దీనిని కూడా బీపీ, షుగర్లను కంట్రోల్ లో పెట్టెందుకు తీసుకునే జాగ్రత్తలే తీసుకోవాలి. ఆహార, విహారాలు, వ్యాయామ, విశ్రాంతులు కొలెస్ట్రాల్ స్థాయి మీద కూడా ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకు వారు జీవన శైలీలో చేసుకునే కొన్ని మార్పుల గురించి కూడా వివరాలు అందిస్తున్నారు.
- ప్రతి రోజూ సమతుల ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఖనిజలవణాలు సిఫారసు చేసిన స్థాయిల్లో ఉండే ఆహారాన్ని సమతుల ఆహారంగా చెప్పుకోవచ్చు. సమతుల ఆహారంలో భాగంగా తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు ధాన్యాలు అన్నీ సమపాళ్లలో ఉండాలి. వీలైనంత తక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవాలి.
- సంతృప్త కొవ్వుల వినియోగం పూర్తిగా మానెయ్యాలి. ఇది నేరుగా రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణం కాగలదు.
- పొగతాగే అలవాటు మానెయ్యాలి. ఆల్కహాల్ మోతాదుకు మించి తీసుకోకూడదు.
- ప్రతి రోజు కనీసం అరగంట నుంచి గంట పాటు తప్పనిసరిగా వ్యాయామం చెయ్యాలి.
- వ్యాయామం కేవలం కొవ్వు తగ్గించి బరువు తగ్గేందుకు మాత్రమే కాదు ఇతర మానసిక శారీరక ఆరోగ్యాలకు ఎంతో మేలు చేస్తుంది.
- వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం వంటి చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.
కొద్దిపాటి జాగ్రత్తలు కొలెస్ట్రాల్ వల్ల పొంచి ఉన్న ప్రమాదానికి మనల్ని దూరంగా ఉంచుతాయి.
Also read: ఏడాదికి ఒకసారి మాత్రమే పండే పంట హిమాలయన్ వెల్లుల్లి, దీని ధర అదిరిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.