Delhi CM Rekha Gupta Oath Ceremony:ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం- వేడుకకు మోదీ, అమిత్‌షా, చంద్రబాబు, పవన్ హాజరు
Delhi CM Rekha Gupta Oath Ceremony: దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

Delhi CM Rekha Gupta Oath Ceremony: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమెతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
రామ్‌లీలా మైదానంలో ఢిల్లీకి తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం రేఖా గుప్తా బిజెపి నుంచి ఢిల్లీకి నాల్గో ముఖ్యమంత్రిగా, కేంద్ర పాలిత ప్రాంతానికి నాల్గో మహిళా ముఖ్యమంత్రి. ఆమె కంటే ముందు బ్రహ్మ ప్రకాష్ యాదవ్, గుర్ముఖ్ నిహాల్ సింగ్, మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్, అతిషి ఢిల్లీకి ముఖ్యమంత్రులుగా పని చేశారు. ప్రకాష్ యాదవ్, నిహాల్ సింగ్, షీలా దీక్షిత్ కాంగ్రెస్ నుంచి సీఎంలు అయితే కేజ్రీవాల్, అతిషి ఆప్ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ బిజెపి నుంచి సీఎం సీటులో కూర్చొన్నారు. ఇందులో ఒక్క షీలా దీక్షిత్ మాత్రమే మూడు పర్యాయాలు పదవీ కాలంం పూర్తి చేసుకున్నారు. తర్వాత కేజ్రీవాల్ ఒకరు మాత్రమే ఐదేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. మిగతా వాళ్లు ఎవరూ ఐదేళ్ల కాలం పదవిలో ఉండలేకపోయారు.
రేఖ గుప్తా తర్వాత ఇతర క్యాబినెట్ సభ్యులతో LG వినయ్ కుమార్ సక్సేనా పదవీ ప్రమాణం చేయించారు. రేఖ గుప్తా తర్వాత పర్వేష్ వర్మ ఢిల్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా ఆశిష్ సూద్ ప్రమాణ స్వీకారం చేశారు. మంజీందర్ సింగ్ సిర్సా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రవీందర్ సింగ్ ఇంద్రాజ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వారందరి పేర్లను ఈ ఉదయం ప్రకటించారు. ప్రమాణ స్వీకారం తర్వాత, ప్రతి ఒక్కరి మంత్రిత్వ శాఖలు నిర్ణయిస్తారు. బిజెపి తన మంత్రివర్గంలో జాట్‌లు, పంజాబీలు, పూర్వాంచల్ నాయకులను తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంది.
ఎవరీ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా?
షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా గతంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. హర్యానాలోని జింద్ జిల్లాలో జన్మించిన ఈమె రెండేళ్ల వయసులోనే కుటుంబంతో కలిసి ఢిల్లీలో స్థిరపడ్డారు. తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగి.
1993లో దౌలత్ రామ్ కళాశాలలో చదువుతూ ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. ABVPలో చేరారు. అలా వివిధ పదవుల్లో పని చేశారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU)కి 1995 నుంచి 1996 వరకు జనరల్ సెక్రటరీగా పని చేశారు. 1996 నుంచి 1997 వరకు అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. 2002లో బిజెపిలో చేరి త్వరగా ఎదిగి భారతీయ జనతా యువ మోర్చా ఢిల్లీ యూనిట్ కార్యదర్శి అయ్యారు. 2005 వరకు ఆ సంస్థ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆమె ఢిల్లీ బిజెపి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి, బిజెపి మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మహిళా మోర్చా జాతీయ ఇన్‌ఛార్జ్‌తో సహా వివిధ పదవులు చేపట్టారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కూడా ఉన్నారు.
2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆప్ అభ్యర్థి బందన కుమారి చేతిలో ఓడిపోయారు. 2020లో ఆమె మళ్లీ పోటీ చేసినా అదే ఫలితం వచ్చింది. 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ వార్డు నుంచి విజయం సాధించారు. తరువాత మేయర్ ఎన్నికకు నామినేట్ అయ్యారు. ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ చేతిలో ఓడిపోయారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వచ్చింది. మరోసారి బందన కుమారిపై పోటీ చేశారు. 29,595 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమెకు ఇద్దరు పిల్లల. కుమార్తె ఆస్ట్రేలియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. కుమారుడు తమిళనాడులోని వెల్లూరులో ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

