TG EAPCET 2025: తెలంగాణ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్ వచ్చేస్తోంది, ఆ కోటా సీట్లన్నీ రాష్ట్రవిద్యార్థులకే
EAPCET: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2025' నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ-హైదరాబాద్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది.

TG EAPCET 2025 Notification: తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 (EAPCET) నోటిఫికేషన్ నేడు (ఫిబ్రవరి 20న) విడుదల కానుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎప్‌సెట్ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు; మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది కూడా ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ నిర్వహించనుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
నాన్ లోకల్ కోటా రద్దు..
రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న 15 శాతం అన్‌రిజర్వుడ్(నాన్ లోకల్) కోటా రద్దు కానుంది. కన్వీనర్ కోటా సీట్లన్నీ ఇకపై తెలంగాణ విద్యార్థులకే కేటాయించనున్నారు. ఇంజినీరింగ్ సీట్లను 70 శాతం కన్వీనర్ కోటాలో, 30 శాతం మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్వీనర్ కోటాలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేవారు. అయితే ఉమ్మడి రాజధాని, రాష్ట్ర విభజన పదేళ్ల గడువు గతేడాదితో పూర్తవడంతో.. నాన్‌లోకల్ కోటా గడువు కూడా ముగిసినట్లయింది. ఈ నేపథ్యంలో కన్వీనర్ కోటాలోని పూర్తి సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే దక్కనున్నాయి.
క్లారిటీ లేకుండానే నోటిఫికేషన్..
నాన్‌లోకల్ కేటగిరీ ప్రవేశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కొన్ని షరతులకు లోబడి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం జారీ చేయబోయే ఉత్తర్వుల మేరకే నాన్‌లోకల్ కేటగిరీ ప్రవేశాలుంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొనే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలోని కళాశాల్లో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలపైనా గందరగోళ స్థితి ఏర్పడింది. గతేడాది వరకు ఈ కోర్సులో ప్రవేశాలను ఎప్‌సెట్ ర్యాంకుల ఆధారంగా చేపట్టగా.. ఈ ఏడాది అటవీశాఖే స్వయంగా ప్రవేశపరీక్ష నిర్వహించాలని భావించింది. అయితే ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఎప్‌సెట్‌లో బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాల అంశాన్ని ప్రస్తావిస్తారా, లేదా అనే దానిపైనా అయోమయం నెలకొంది.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున స్థానికత, స్థానికేతర కోటా తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గతేడాది డిసెంబరులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, అందులో 95 శాతం రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5 శాతం వివిధ అవసరాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఇవ్వాలని ప్రధానంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. దీనిపై కమిటీ ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని వివరణ కోరగా.. నివేదిక అందజేశామని, 95-5 కోటాపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. తుది నిర్ణయం వెలువడనందున ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయనే నిబంధన విధించి ఎప్‌సెట్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
మరిన్ని సీట్లు అందుబాటులోకి..
కమిటీ సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్ర విద్యార్థులకు మరిన్ని ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు 15 శాతం అన్‌రిజర్వుడ్ కోటాలో మొత్తం 12 వేల సీట్లు ఉండగా.. అందులో 4-5 వేల సీట్లు మెరిట్ ఆధారంగా ఏపీ విద్యార్థులు పొందుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

