(Source: ECI/ABP News/ABP Majha)
Heart Attacks: గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ఫోకస్, గోల్డెన్ అవర్ లో ఫ్రీగా రూ.40 వేల ఇంజెక్షన్
గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
AP Government Special Focus on Heat Attack Issue:
గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటి గంట (Golden Hour)లోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే STEMI ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడేందుకు 40వేల రూపాయల విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గుండె పోటు మరణాలపై సర్కార్ ఫోకస్...
మారుతున్న జీవన ప్రమాణాలు చిన్న వయసులోనే గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అయితే గుండెపోటు సంభవించిన తొలి గంటలోపు (దీన్నే గోల్డెన్ అవర్ అంటారు) సరైన అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం ద్వారా మనిషి ప్రాణాలు నిలబెట్టేందుకు అత్యధిక అవకాశాలున్నాయని అనేక సర్వల్లో వెల్లడయ్యింది. అనారోగ్యానికి గురైన వెంటనే గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే దాన్ని గుర్తించడం అత్యంత కీలకమయిన అంశం. గుర్తించిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి సకాలంలో చేర్చడం, ఇంజక్షన్ ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించడం, ప్రాధమికంగా జరిగే ప్రక్రియ. ఆ తరువాత చికిత్స కోసం మెరుగయిన సదుపాయాలు కలిగిన ఆసుపత్రికి మనిషిని తరలించి, ECG వంటి పరీక్షల ద్వారా పరిస్థితిని అంచనావేసి, అవసరమైన శస్త్ర చికిత్సను చేయడం వంటి ఘట్టాలు వరుసగా జరిగేవి. ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే గుండెపోటు కారణంగా జరిగే మరణాలను కట్టడి చేసే పరిస్దితులు ఉన్నాయి. ఇందు కోసమే ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం STEMI కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటిచాయి.
గుండె పదిలం కావాలి...
అసంక్రమిక వ్యాధుల్లో (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, NCD) గుండె సంబంధిత సమస్యల వల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్.సీ.డీల్లో గుండెపోటు వల్ల జరుగుతున్న మరణాలు 32% ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మంది ప్రజలు గుండె జబ్బులతో బాధపడుతున్నారనేది ఒక అంచనా. గుండెపోటుకు గురై మరణించేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, పీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో హృద్రోగ చికిత్సలకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
STEMI ద్వారా గుండె పదిలం
గుండెపోటు సంభవించిన తొలి 40 నిమిషాల సమయం ఎంతో కీలకమని వైద్యులు చెబుతున్నారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తూ మనిషికి అవసరమైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడటమే STEMI ముఖ్యోద్దేశ్యంగా సర్కార్ చెబుతుంది. ముందుగా గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించడం, సమీపంలో ఉన్న PHCలలో ఇనీషియల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచడం, గోల్డెన్ అవర్ లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ను ఉచితంగా రోగికి అందించడం, తరువాత 100కి.మీల పరిధిలో క్యాథ్ లాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్ హబ్ హాస్పటల్ కు తరలించి అవసరమైన పరీక్షలు, శస్త్ర చికిత్స నిర్వహించడం, ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో సిబ్బంది, వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసిన వైద్య ఆరోగ్య శాఖ, ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలను కూడా చేపట్టినట్లు చెబుతున్నారు. రూ.120 కోట్లు వెచ్చించి క్యాథ్ లాబ్స్ నిర్మాణం చేపట్టింది, రాష్ట్ర ప్రభుత్వం. SVRR GGH గుంటూరు, GGH కర్నూలు, KGH విశాఖపట్నం నాలుగు హబ్స్ గా ఏర్పాటు చేశారు.
జరిగే ప్రక్రియ ఇలా...
గ్రామీణ ప్రాంతాల్లో ANMలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వ్యవస్థను వినియోగించి గుండెపోటు లక్షణాల పై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్ కు తరలిస్తారు. పైలెట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో 13, కర్నూలు 16, గుంటూరు 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. తదనంతరం రోగిని క్యాథ్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ హాస్పటల్ కు రిఫర్ చేస్తారు.
ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం...
గుండె వ్యాధులను తగ్గించేందుకు అత్యుత్తమమైన, నాణ్యమైన హార్ట్ కేర్ సర్వీసులను రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని సీఏం వైయస్ జగన్ ఆదేశించారు. కార్డియాలజీ విభాగంలో అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాల కోసం వేగంగా అవసరమైన పోస్టులను కూడ మంజూరు చేశారు. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ, క్యాథ్ ల్యాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు, టెక్నికల్ అసిస్టెంట్స్, ల్యాబ్ మరియు ఓటీ విభాగాల్లో రెగ్యులర్ మరియు కాంట్రాక్టు పద్ధతిలో 94 పోస్టులకు అనుమతి చేస్తూ జీవో జారీ అయ్యింది. దీంతో కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయి.
ముహూర్తం ఫిక్స్....
STEMI పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అదికారులు తెలిపారు. సెప్టెంబర్ 29, 2023న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 2024 నుండి STEMI ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేసింది. అన్ని టీచింగ్ హాస్పటల్స్ లో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్ విభాగాలను బలోపేతం చేసి, కార్డియాక్ సేవలను పెంపొందించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది.