Nizamabad Politics: వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ?
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ? జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ. జిల్లాపై పట్టున్న మాజీ మంత్రి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందా.
నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని పార్టీగా హస్తం గుర్తుకు పేరుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9కి 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన చరిత్ర సొంతం. జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి గట్టి క్యాడర్ ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇంకా అలాగే ఉంది. తిరిగి జిల్లాలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలుంటాయి. ఈ నియోజకవర్గాలపై గట్టి పట్టున్న నేతను ఎంపీగా బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం టీపీసీ కోశాధికారిగా ఇటీవల ఏఐసీసీ సభ్యునిగా పదవి పొందారు.
జిల్లాలో సీనియర్ సుదర్శన్ రెడ్డి
జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వారిలో సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. బోధన్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు బోధన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సుదర్శన్ రెడ్డికి జిల్లా మీద మంచి పట్టుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి ని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపనున్నట్లుగా తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి అయితేనే గెలిచే అవకాశాలుంటాయని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో సుదర్శన్ రెడ్డికి పార్టీ అధిష్టానం హింట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే దిశలో కార్యచరణ రూపొందిస్తున్నారు. గెలుపు గుర్రాలపై ఆయన నజర్ వేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) లో సుదీర్ఘకాలంగా పనిచేసి ఎలాంటి పదవులు దక్కని సీనియర్లకు టచ్ లో ఉంటూ ఇప్పటికే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నేరుగా వారి ఇళ్లల్లోకి వెళ్లి కలుస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ నాయకులకు ఆయన టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీజేపీలో ఉన్న అసంతృప్తులను సైతం సుదర్శన్ రెడ్డి కలుస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఒక్క బోధన్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు సుదర్శన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జిల్లాలో సీనియర్ నాయకులు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అయితే మధుయాష్కీ ఈ సారి జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయరన్న వార్తలు కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి సుదర్శన్ రెడ్డి సరైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ఆయనైతేనే గట్టి పోటీ ఇవ్వగలరని హస్తం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. జిల్లాపై సుదర్శన్ రెడ్డికి పట్టుంది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కు ఆయనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని సైతం తిరిగి పార్టీలో చేరే విధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు కూడా సుదర్శన్ రెడ్డి ఎంపీగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ మేయర్ ధర్శపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే విషయంలో కొందరు జిల్లాకు చెందిన నాయకులు వ్యతిరేకించినా.. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాత్రం సంజయ్ చేరికకు ఇష్టంగా ఉన్నారని సమాచారం. సంజయ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీకి బలం చేకూరుతున్న అభిప్రాయాన్ని సుదర్శన్ రెడ్డి వ్యక్తం చేసినట్లు సమాచారం.
సుదర్శన్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారన్న ప్రచారమూ ఉంది. సుదర్శన్ రెడ్డి అభిప్రాయాలకు రేవంత్ రెడ్డి కాదనరనేది ప్రచారం. దీంతో సుదర్శన్ రెడ్డి కూడా చాపకింద నీరులా జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఇప్పటి నుంచే గట్టి అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.