India Bans Pakistans YouTube: మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకమైన, కమ్యూనికేషన్ సున్నితమైన కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నందుకు చర్య తీసుకున్నారు.

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ దేశానికి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వం పలు పాకిస్థన్ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. "ఉద్దేశపూర్వకంగా భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయన్న అభియోగాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సున్నితమైన కంటెంట్, ప్రజలను తప్పుదారి పట్టించే కథనాలు ప్రసారం చేయడంతో పాకిస్తాన్ కు చెందిన కనీసం 16 యూబ్యూట్ ఛానెళ్ల ప్రసారాలపై భారత్ లో నిషేధం విధించారు. భారతదేశం, ఇండియన్ సైన్యం, భద్రతా సంస్థలపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
నిషేధం విధించిన యూట్యూబ్ ఛానెళ్లు ఇవే
డాన్, బోల్ న్యూస్, రఫ్తార్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, సునో న్యూస్ వంటి వార్తా సంస్థల యూట్యూబ్ ఛానెళ్లను భారత ప్రభుత్వం నిషేధించింది. వీటితో పాటు ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజి, ఉమర్ చీమా, మునీబ్ ఫరూక్ వంటి జర్నలిస్టుల ఛానెళ్లపై సైతం కొరడా ఝులిపించింది. ఇంకా ది పాకిస్థాన్ రిఫరెన్స్, ఉజైర్ క్రికెట్, సమా స్పోర్ట్స్ వంటి ఇతర సోషల్ మీడియా ఖాతాలపై భారత్ ఉక్కుపాదం మోపింది. .
ఈ ఛానెళ్లపై క్లిక్ చేసినప్పుడు, యూట్యూబ్ ఈ సందేశాన్ని చూపిస్తోంది. జాతీయ భద్రత లేదా ప్రజల మధ్య అశాంతి, అభద్రతాభావం కల్పించేలా కథనాలు ప్రసారం చేయడం, భారతదేశానికి, భారత సైన్యానికి వ్యతిరేకంగా ప్రసారం చేస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ తొలగింపు అభ్యర్థనల గురించి మరింత సమాచారం కోసం Google Transparency Reportని సందర్శించాలని సూచిస్తోంది.






















